విమోచించు దేవుడు

విమోచించు దేవుడు

విమోచించు దేవుడు

(నిర్గమ. 7-సంఖ్యా 10 అధ్యాయములు )

ఇశ్రాయేలు పై లక్ష్యముంచి వారి మగ పిల్లలను కాపాడుతూ, వారి కొరకు నాయకుని సిద్దపరిచి నడిపిస్తున్న దేవుడు వారిని విమోచించే ప్రక్రియను ప్రారంభించాడు. అందులో భాగంగా ఆయన వింతైన కార్యములు చేయడం ప్రారంభించారు.

వింతైన కార్యములు చేశాడు (7-11)

దేవునిని లెక్క చేయకుండా, మోషే మాట వినకుండా ఇశ్రాయేలు ప్రజలను మరింతగా శ్రమ పరుస్తున్న ఐగుప్తు రాజుకు, తన ప్రణాళికలో భాగంగా అబ్రహాముకు దేవుడు తెలియపరచినట్టుగానే తీర్పు తీర్చడం ప్రారంభించాడు.

వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. -ఆదికాండము 15:14

ఈ తీర్పు ఆ ప్రజలకు, ఆ ప్రజలు ఆరాధిస్తున్న దేవుళ్లకు దేవతలకు ఆయన తీర్చాడు అని చెప్పవచ్చు.

 ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను. -నిర్గమకాండము 12:12

అందులో భాగంగా నైలు నదికి సంబంధించిన ఆరాధన అంతటికి వ్యతిరేకంగా ఆ నదిలోని నీళ్లను రక్తముగా మార్చుతూ, నదిలో చేపలు చనిపోయేటట్లుగా, విపరీతమైన కంపు, ఐగుప్తీయులకు తాగుటకు నీళ్లు లేని పరిస్థితి ఏర్పడునట్లుగా దేవుడు కల్పించాడు. 

కప్పకు చేసే ఆరాధన అంతటికి వ్యతిరేకంగా, ఐగుప్తు దేశమంతటి మీదికి దేవుడు కప్పలను రప్పించాడు , అవి చనిపోగా అదొక వాసన. కప్పను ఆరాధన చేసేవారే అది వారి దగ్గర నుండి తొలగిపోవాలని కోరుకున్నారు.

ఎడారిని ఆరాధించినందుకు పేలు, ఈగలను ఆరాధించినందుకు ఈగలు, పశువులను ఆరాధించినందుకు పశువుల మరణం, స్వస్థపరిచే శక్తి ఉందని పిలవబడే సును ఇసిస్ అనే దేవతలకు వ్యతిరేకంగా దద్దుర్లు, ఆకాశదేవతకు వ్యతిరేకంగా వడగండ్ల వాన, పంటనిచ్చే దేవతకు వ్యతిరేకంగా పంటను పాడు చేసే మిడతలు, సూర్యదేవునికి వ్యతిరేకంగా మూడు దినాల కటిక చీకటి ఐగుప్తు మీదకు దేవుడు రప్పించాడు.

ప్రతి కార్యములోను దేవుడు తాను సార్వభౌమాధికారం కలిగినవాడని నిరూపించుకున్నాడు, ఈ లోక దేవతలన్నిటికంటే ఆయన గొప్పవాడని చెప్పకనే చెప్పాడు. ఇవన్నీ ఆయన చేయడానికి కారణం ఐగుప్తు మెడలు వంచడమే. ఇవి ఎన్నడూ కని విని ఎరగని కార్యములు, ఒక ఐగుప్తీయుడు తన జీవితంలో ఎన్నడూ ఊహించని కార్యములు .

ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరిగించాడా? అయితే దేవుని స్తుతించు. ఇశ్రాయేలు వలే శ్రమనుభవిస్తున్నావా నిన్ను విమోచించుటకు వింతైన కార్యములు నేటికీ కూడా చేయగల దేవుడు నీ పక్షాన ఉన్నాడని తెలుసుకో.

వినాశనమును తప్పించాడు (12)

దేవుడు ఈ తొమ్మిది తెగుళ్లుతో ఆగిపోలేదు గాని, పిల్లలను కాపాడే దేవతకు వ్యతిరేకంగా ఐగుప్తీయుల తొలి సంతానం మరణించడానికి ఏర్పాటు చేశాడు. అయితే ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే, ఐగుప్తీయుల మీదకు తీసుకురాబడ్డ 10 తెగుళ్లు కూడా అదే ప్రాంతంలో ఉంటున్న ఇశ్రాయేలీయులకు ఏమాత్రం నష్టాన్ని కలిగించలేదు. 

మరి ముఖ్యంగా ఈ పదవ తెగులు సంభవించడానికి ముందుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెప్పాడు, మరణ దూత మీ ఇంటిని దాటిపోవునట్లుగా ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని వధించి, ఆ రక్తమును వారి ద్వారబంధముల మీద పూయమని చెప్పాడు.

మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములో నున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింప వలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు. -నిర్గమకాండము 12:22, 23

ఇశ్రాయేలీయులు ఈ విధంగా చేసినప్పుడు వారి తొలి సంతానం రక్షించబడ్డారు, దేవుడు ఎంత చక్కగా ఇశ్రాయేలీయుల పిల్లలను కాపాడాడో చూడండి, మంత్రసానుల ద్వారా కొంతమందిని, నదిలో కొంతమందిని, ఇప్పుడు పస్కా పశువు ద్వారా అందర్నీ కాపాడాడు.

ఓ పక్క ఐగుప్తీయుల ఇండ్లలో శవము లేని ఇల్లు లేకుండా పోయింది. వారి ఏడుపులతో ఐగుప్త మారుమోగిపోయింది. దేవుడు చెప్పినట్టుగానే ఇశ్రాయేలీయులు ఐగుప్తుల్య ద వెండి బంగారం విలువైన వస్త్రాలు వాటన్నిటిని అడిగి తీసుకున్నారు, అబ్రహం కి దేవుడు ఇచ్చిన మాట చొప్పున వీరు మిక్కిలి ఆస్తితో ఐగుప్తును విడిచిపెట్టారు.

విమోచించు దేవుడు , మనందరి విమోచన నిమిత్తమై పస్కా పశువుగా కల్వరి సిలువలో వధించబడ్డాడు, ఆయన రక్తం మన శిక్షను తొలగించింది. నిత్య నరకాన్ని తప్పించింది, ఇట్టి భాగ్యాన్ని నీవు పొందుకున్న వ్యక్తిగా ఉంటే దేవుని స్తుతించు, నీవింకను ఈ భాగ్యాన్ని పొందుకోకపోతే నశించిపోయే వారి గుంపులో ఉండకుండా నీ కొరకు వధింపబడిన యేసుక్రీస్తు వారి రక్తములో మునుగుటకు తీర్మానించుకుని ఆ భాగ్యాన్ని పొందుకో.

విరోధులను ఓడించాడు(13-15)

ఇశ్రాయేలు ప్రజలను పంపించి వేసిన తర్వాత ఐగుప్తీయులు మరల వారిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నారు, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ వారిని సరిగ్గా ఎర్ర సముద్రం ఎదుటకు తీసుకొచ్చి ఆపాడు.

కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు, కానీ ఆయన కీడు చేసే వాడు మాత్రం కాదు. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఎర్ర సముద్రంలో మార్గాన్ని కలుగజేశాడు, వీరిని త్వరగా కలుసుకోవాలని పరిగెత్తుతున్న ఐగుప్తీయులను సరాసరి ఎర్ర సముద్రంలోనికి రానిచ్చి వారిని అందులో ముంచివేశాడు. ఇంతకాలం వారిని బాధించిన అధిపతులు ఘనులు శ్రేష్టులు అక్కడ శవాలుగా వారు ముందు తేలేరు.

యేసయ్య మరణం ఆయన యొక్క విమోచన కార్యం మన విరోధి అయిన సాతాను అణచివేసింది. మన దేవుడు విమోచించేవాడు గనుక నీవు ఆయనపై లక్ష్యం నుంచి కొనసాగితే నీ విరోధులను ఆయన అణిచివేస్తాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును ఆయన వర్ధిల్లనియ్యడు.

విశ్వాసంతో ముందుకు సాగాలి(16,17)

ఎర్ర సముద్రం దాటిన ఇశ్రాయేలీయులు పాటలు పాడుతూ చక్కగా దేవుని స్తుతించారు, అయితే ఇక వారి ముందు గొప్ప ప్రయాణం ఉన్నది. వారి ముందు ఉన్నది ఎడారి ప్రయాణం, వారి ఎదురు కావలసిన సమస్యల్లో ఆకలి దప్పిక ప్రధమంగా వారి ఎదుట ఉన్నవి. ఆలస్యం చేయకుండా ఐగుప్తు నుండి బయలుదేరారు, ఖచ్చితంగా వారు తెచ్చుకున్న ఆహార పానీయాలు ఖాళీ అయిపోయి ఉంటాయి. 

ఇప్పుడు వారికి నీళ్లు ఎలాగూ? ఆహారం ఎలా? కొయ్యలేరు కొనలేరు. చేయాల్సింది ఒక్కటే దేవుని వైపు చూడటమే విశ్వాసముతో దేవుని వైపు చూస్తే ఆయనే తగిన కాలంలో నీళ్లు ఆకలి తీర్చడానికి ఆహారం వారికి అనుగ్రహించ ప్రణాళిక కలిగి ఉన్నాడు. 

కానీ ఈలోగానే వారు దేవునిపై సణుగుతూ మోషేపై సనుగుతూ గడిపినవారుగా ఉన్నారు. విమోచింపబడిన ప్రతి ఒక్కరు దేవుని పై విశ్వాసంతో శేష జీవితమును కొనసాగించాలి.

నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. -గలతియులకు 2:20

దేవుడు మనలను విడిచి పెట్టేవాడు కాదు, కనుక మన విశ్వాసమును మనం కోల్పోకుండా, ఆయన కొరకు ఎదురుచూస్తూ మనం కొనసాగితే ఆయన మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఇక్కడ ఇంత ఎడారిలో ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి నీళ్లు, ప్రతి దినము ఆహారము దేవుడు వారికి అనుగ్రహించాడు. నీవు విశ్వాసం కలిగి ఉంటే నీవును వాటిని పొందుకొనగలవు

విధేయులమై ముందుకు సాగాలి (18-సంఖ్య. 10)

ఇశ్రాయేలు ప్రజలను పోషిస్తూ దేవుడు వారిని మోషేకు మొదటిసారి ప్రత్యక్షమైన సినాయకొండ యొద్దకు నడిపించాడు. అక్కడ ఈ ప్రజలకు వారు ముందుకు సాగవలసిన విధానాన్ని విశదపరిచాడు. వారు పాటించవలసిన ఆజ్ఞలను తెలియపరిచాడు, ఆరాధన క్రమాన్ని, ఆచరించవలసిన పండుగలను, బలులను అర్పన్లను వారికి తెలియపరచాడు.

వాటిని అనుసరించి నడుచుకుంటే దీవెన కలుగుతుందని, వారు ప్రత్యేకమైన జనముగా దేవుని యొక్క స్వకీయ సంపాదియంగా ఉంటారని ఆయన తెలియపరిచాడు. విమోచింపబడిన ప్రతి వ్యక్తి మీద ఉన్న బాధ్యత, విధేయత కలిగి కొనసాగడమే. వాక్య విశేషాలను తెలుసుకుంటూ, ఆత్మీయ క్రమాన్ని నేర్చుకుంటూ, మనలను విమోచించినప్పటికీ మనకు గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆయన మనలను చూడాలనుకున్న రీతిలో మార్చబడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది.

అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును , పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. -1 పేతురు 2:9

Post a Comment