మన యందు లక్ష్యముంచు దేవుడు


మన యందు లక్ష్యముంచు దేవుడు


మన యందు లక్ష్యముంచు దేవుడు

(నిర్గమ. 1-6 అధ్యాయములు )


 ఈ లోకంలో మనిషి కంటే గొప్పవి చాలానే ఉన్నాయి, కానీ దేవుడు  అన్నిటికంటే ఎక్కువగా  మనిషి మీద దృష్టి నిలిపేవాడుగా ఉన్నాడు. దీన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కీర్తనకారులతో కలిసి నీవు నరపుత్రుని దర్శించుటకు వారు ఏ పాటివారు అని చెప్పగలరు.

 కరువును తప్పించుకోవడానికి ఐగుప్తులోనికి వెళ్ళిన యాకోబు కుటుంబం, కరువు తీరిపోయిన తర్వాత వెనక్కి తిరిగి కనానుకు రాలేదు.   యోసేపు చనిపోయిన తర్వాత కూడా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోనే నిలిచిపోయారు, వారు వెనక్కి తిరిగి వచ్చే ప్రయత్నం చేయలేదు, 70 మంది గా అడుగుపెట్టిన యాకోబు కుటుంబం కాలక్రమంలో అనగా 400 సంవత్సరాల్లో ఒక గొప్ప జనముగా సుమారు 30 లక్షల ప్రజలుగా మార్చబడ్డారు.

వీరు ఈ విధంగా విస్తరించడాన్ని చూడలేకపోయినా ఆ దేశపు రాజులు వీరిని అణిచి వేయడానికి రకరకాల ప్రణాళికలు సిద్ధం చేశారు. వీరిని అణిచివేయాలనుకోవడానికి ప్రధానమైన కారణం, వీరి యొక్క సంఖ్య మరియు వీరు పరదేశులు కావడమే.

మొదటిగా వీరిని అణచివేయడానికి మగవారిని వెట్టిచాకిరికి లోను చేశారు, మగవారు వెట్టిచాకిరి చేయడం వలన సంతాన ఉత్పత్తి తగ్గిపోతుంది అని భావించారు, కానీ ఇశ్రాయేలీయుల ప్రజల మీద లక్ష్యం ఉంచిన దేవుడు శత్రువులు వీరిని ఎంతగా అణచివేస్తున్న అంతకంతకు వీరిని విస్తరింప చేయడం ప్రారంభించాడు మొత్తానికి ఆ ప్రణాళిక బెడిసి కొట్టింది.

మంత్రసానుల ద్వారా సహాయం చేశాడు

ఇక రెండవ ప్రణాళికకు శ్రీకారం చుడుతూ, హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచేసే వారిని పిలిపించి హెబ్రీ స్త్రీలకు మగ పిల్లల పుడితే చంపేయండి ఆడపిల్లలు పుడితే బ్రతకనీయండి అని చెప్పడం జరిగింది. కానీ ఈ మంత్రసానులు హత్య చేయడానికి ఇష్టపడక దేవునికి భయపడి ఆ పిల్లలను బ్రతకనిచ్చారు

అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా -నిర్గమకాండము 1:17

దేవుడు మన యందు లక్ష్యముంచినప్పుడు మనము ఊహించని రీతిలో ఆయన సహాయం చేసేవాడుగా ఉంటాడు, నిజంగా నిన్ను పుట్టించిన దేవుడు నీ యందు లక్ష్యముంచేవాడై ఉన్నాడు, ఆయన నీ యందు లక్ష్యం ఉంచి నీకు ఎన్నో రీతులుగా ఆయన సహాయం చేస్తుండగా ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించు.

 ఊహించని రీతిలో నీకు సహాయము దొరుకుతున్నదా? అది నీ అదృష్టం అనుకోవద్దు. అదృష్టాలు దురదృష్టాలు లేవు, ఉన్నదల్లా దేవుని నియామకాలే.

నీ మీద దృష్టి నిలిపిన దేవుడు  నీకు సహాయం చేయడానికి వారిని నియమించాడని గ్రహించి నీకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెల్లించడంతోపాటుగా ఆ రీతిగా వారు సహాయపడునట్లు వారి మనసును ప్రేరేపించి  నీ కొరకు వారిని సిద్ధపరిచి ఏర్పాటు చేసిన దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆయనకు మరింత దగ్గరగా జీవించే ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.

మాపై లక్ష్యం ఉంచి  మమ్మల్ని నడిపిస్తున్న దేవా మేము నీపై లక్ష్యం నుంచి నీకు దగ్గరగా జీవించే భాగ్యం మాకు దయచేయండి, మా తీర్మానం స్థిరపరచమని మిమ్ములను వేడుకుంటున్నాం. 

రెండవ ప్రణాళిక కూడా బెడిసి కొట్టడాన్ని బట్టి, రాజుగారు ఈ మంత్రసానులను పిలిపించి అడిగాడు, వాళ్లు మాత్రం హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనవారు,   మేము వెళ్ళకముందే వారు ప్రసవిస్తున్నారు అని చెప్పారు.

రాజుగారు మూడవ ప్రణాళిక చేస్తూ హెబ్రీ మగ పిల్లలందరినీ నైలు నదిలో పడవేయాలని ఆజ్ఞాపించాడు. 

ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం, ఏ ఒక్కరు కోరుకోరు. కానీ లేవి వంశానికి చెందిన అమ్రాము యెకెబెదు అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ముగ్గురు పిల్లలు కలగడం జరిగింది, ఇప్పుడు మూడో వ్యక్తికి సమస్య వచ్చి పడింది. ఎందుకంటే మూడో వ్యక్తి మగ పిల్లవాడు కావడమే.  

మగ పిల్లల పుడితే నైలు నదిలో పడవేయబడాలని ఆజ్ఞ ఉన్నది కనుక వాళ్ళ అమ్మ ఈ బాబుని మూడు నెలలు దాచిపెట్టి ఇక దాచలేక విసిరి నదిలో పడవేయలేక ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి మొసళ్ళు రాకుండా జిగటమన్నును నీళ్లు లోనికి రాకుండా తారును పూసి నది ఒడ్డున జమ్ములో ఉంచి కాపలాగా తన పెద్ద కుమార్తెను ఉంచింది..

మోషేను రక్షించి సిద్ధపరిచాడు

అదే సమయంలో రాజుగారు కుమార్తె నడి ఒడ్డుకు రావడం, ఆ పెట్టెను చూడడం , ఆమెకు కనికరము కలగగా ఆ బాబు యొక్క అక్క ద్వారా ఒక దాదికి ఆ బాబును అప్పగించి తన కొరకు పెంచమని జీతం ఇస్తానని చెప్పడం కూడా జరిగింది.

ఆ బాబును పెంచుతూ ఆ దాది, పెద్దవాడైన తర్వాత రాజకుమార్తె యొద్దకు తీసుకురాగానే మోషే అని ఆవిడ పేరు పెట్టడం జరిగింది. 

మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు, తన ప్రజలు బానిసత్వంలో ఉన్న సంగతి తెలుసుకున్నాడు, తన బలాన్ని బట్టి వారిని విడిపించాలని ప్రయత్నం చేశాడు, కాని అది బెడిసి కొట్టడంతో ఆయన మిద్యాను అనే దేశానికి పారిపోయాడు, అక్కడ సిప్పోరా అనే ఆమెను పెళ్లి చేసుకొని అక్కడే తన మామగారి మందులు మేపుతూ ఒక 40 సంవత్సరాలు గడిపాడు.

ఈలోగా ఒక రోజున దేవుడు మోషేను దర్శించి నా ప్రజలను ఐగుప్తీయులు ఎంతగా బాధపెడుతున్నారో నేను చూశాను, కాబట్టి నిన్ను వారిని విడిపించడానికి పంపిస్తాను రమ్మని ఆయనను పిలవడం జరిగింది.

కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. -నిర్గమకాండము 3:10

మోషేకు దేవుడు ఇచ్చిన ఈ పిలుపుకు మోషే వెంటనే అంగీకారం చెప్పలేదు. చూడండి ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన లక్ష్యం ఉంచిన దేవుడు వారిని విడిపించడానికి ఒక నాయకున్ని రక్షించి సిద్ధపరిచి పిలుపునిస్తూ ఉన్నాడు.

కొంత వాదన దేవునికి మోషేకు జరిగిన తర్వాత ఎట్టకేలకు మోషే అంగీకరించడం జరిగింది. దేవుని మాట చొప్పున మోషే తన కుటుంబంతో పాటుగా ఐగుప్తుకు బయలుదేరి వచ్చాడు.

దేవుడు మన కొరకు తన కుమారుని సిద్దపరచి, మన పాపపు దాస్యము నుండి విడిపించడానికి ఏర్పాటు చేసాడు, మన యందు లక్ష్యముంచి ఇలాంటి కార్యములు దేవుడు చేసినందుకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన యందు లక్ష్యముంచి కొనసాగాలి.

 దేవుడు మన కొరకు సిద్ధపరచిన రక్షకుని మీద దృష్టి నిలిపి మనం ముందుకు సాగాలి. ఆయన ద్వారా మాత్రమే కలిగేటువంటి రక్షణను మనము పొందుటకు అంగీకరించి నిత్య శిక్షను నరకమును తప్పించుకునే వారంగా ఉందాము. 

మనం ఆయన యందు లక్ష్యం నుంచి కొనసాగాలి

మోషే వచ్చిన తర్వాత ఇశ్రాయేలు పెద్దలను పోగుచేసి దేవుడు తనతో చెప్పిన విషయాలన్నీ వారితో చెబుతూ వారిని విడిపించడానికి దేవుడు తనను పంపినట్టుగా చెప్పిన మాటలను బట్టి వారు ఎంతగానో సంతోషించారు.

మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. -నిర్గమకాండము 4:31

ఆ తర్వాత మోషే రాజును కలసి ఈ ప్రజలను విడుదల చేయమని కోరాడు. దానికి రాజు ఒప్పుకపోగా, మరింత కఠినంగా ప్రజలతో వ్యవహరించడం ప్రారంభించారు. అందులో భాగంగా వారు ఇటికల చేయడానికి అంతకుముందు గడ్డి ఇచ్చేవాడు, ఇప్పుడు మోషే వచ్చి మాట్లాడిన తర్వాత మీకు గడ్డి ఇవ్వను, కానీ ఇటికల లెక్క మాత్రం తగ్గకూడదు అని చెప్పి, వారు ఇంతకు మునుపు వలె ఇటికలు చేయలేక పోయినప్పుడు వారిని కొట్టడం ప్రారంభించారు. 

దీని సంగతి ఏంటో తేల్చుకుందామని ఇశ్రాయేలు పెద్దలు రాజు దగ్గరికి వెళ్తే, అదే సమయంలో మోషే వారికి ఎదురు పడటం జరిగింది, మీ వల్లనే మాకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నట్లుగా వారి మాటలు మోషేతో ఉన్నాయి. 

మోషేకిదేమంతా మంచిగా అనిపించలేదు దేవుని వద్దకు వెళ్లి ప్రార్థన చేస్తే ఆయన తాను చేయబోయే కార్యాన్ని తెలియపరిచాడు, మోషే ఆ విషయాలను తీసుకెళ్లి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తే వారు వారు ఉన్నటువంటి దాసత్వాన్ని బట్టి దేవుని మాట మీద మోషే మాట మీద లక్ష్యముంచలేకపోయారు.

మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. -నిర్గమకాండము 6:9

మన జీవితంలో కూడా దేవుడు మన మీద లక్ష్యముంచి ఎన్నో రీతులుగా సహాయం చేస్తూ, మన కొరకు ఎన్నో ఏర్పాట్లు ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి సహాయానికి, ఇంత గొప్ప సృష్టిలో మన మీద ఆయన లక్ష్యముంచి నడిపిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. 

దేవుడు నీ కొరకు చేస్తున్న ఏర్పాట్లు గ్రహించక, ఆయన నీ జీవితంలో ఏమీ చేయలేదన్నట్టుగా నీవు మాట్లాడి ఉంటే దానిని బట్టి క్షమించమని దేవుణ్ణి కోరుకొనండి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మొదట్లో మనం దేవుని వెంబడిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు వలే సమస్య మీదనే లక్ష్యం ఉంచి దేవుని మీద లక్ష్యం ఉంచకుండా కొనసాగి ఉంటే దానినిబట్టి క్షమించు మని దేవుని కోరుకుంటూ, ఇకనుండి నీపై లక్ష్యం ఉంచుతున్న దేవుని మీదనే లక్ష్యం నుంచి కొనసాగడానికి తీర్మానించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను.

Post a Comment