వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని తీసుకువచ్చినప్పుడు ఆమెతోపాటు పురుషుడిని ఎందుకు తీసుకురాలేదు?
యోహాను సువార్త 7:53-8:11 లో ఉన్న భాగము కొన్ని ప్రాచీన పత్రులలో లేదు అనేది కొంతమంది పండితులు చెప్పే మాట. ఇంకొన్ని ప్రతులలో ఉన్నప్పటికీ అది మనం యోహాను సువార్తలో ఎక్కడైతే చూస్తున్నామో ఆ సందర్భంలో లేదని కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏ స్థానంలో ఈ అంశం రాయబడిందో అది సరైన స్థానంలో ఏర్పాటు చేయబడింది అని మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా ఎనిమిదవ అధ్యాయంలో యూదా మత పెద్దలు యేసుక్రీస్తు వారిని ఏదో ఒక రీతిలో దోషిగా చిత్రీకరించాలని చేసిన ప్రయత్నమే ఇక్కడ వివరించబడిన విషయం.
యేసు ఒలీవలకొండకు వెళ్లెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను. శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను; అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి. ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను. యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమెలేదు ప్రభువా అనెను. అందుకు యేసునేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. -యోహాను 8:1-11
గుడారాల పండుగ లేదా పర్ణశాలల పండుగ ముగిసిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఇది. ఆ పండుగలలో ఆయన చేసిన బోధనను బట్టి ఆయనను పట్టుకోవడానికి బంట్రోతులను పంపించారు గాని వారు వట్టి చేతులతో తిరిగివచ్చారు. మరలా ఇప్పుడు మరొక ప్రయత్నం చేస్తున్నారు.
ఈసారి దేవాలయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్త్రీలు కూర్చునే స్థలంలో బోధిస్తున్నవాడుగా ఉన్నాడు. బోధిస్తున్న ఆయన బోధను కొనసాగించనివ్వకుండా, మధ్యలో వీరు అడ్డుపడుతూ ఒక స్త్రీని ఆయన ముందు నిలబెట్టారు. ఆమె వ్యభిచారం చేస్తుండగా మేము పట్టుకున్నాం అని చెప్పారు, ఇలాంటి వ్యక్తులను రాళ్లు రువ్వి చంపాలి అని ధర్మ శాస్త్రం చెప్తుంది అని తెలియపరిచారు. ఇది యేసుక్రీస్తు వారిని ఇరుకులో పెట్టడానికి, ప్రజలను ఆయన నుండి దూరం చేయడానికి వేసిన పథకం అని చెప్పవచ్చు. ఈ సందర్భాన్ని గూర్చి ఆలోచన చేస్తూ ఉంటే మనకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి.
అందులో కచ్చితంగా మనలను పలకరించే ప్రశ్న, ఈ వృత్తాంతములో కనిపించని పురుషుని ప్రస్తావన. పురుషుని వారు ఎందుకు తీసుకురాలేదు? అతను పారిపోయాడా? ఒకవేళ పట్టుబడిన ఈ స్త్రీ వివాహిత అయితే, ఈమెపై పగ తీర్చుకోవాలని కోరుకుంటున్న ఆమె భర్త నాటిన మొక్క ఆ పురుషుడా? లేదా యేసుక్రీస్తు వారిని ఇరుకులో పెట్టాలని చూస్తున్న వ్యక్తులకు సంబంధించిన వాడు ఆ పురుషుడా? ఎవరైతే ఆ స్త్రీ మీద నేరం మోపడానికి వచ్చారో, ఒకవేళ వారిలో ఆ పురుషుడు ఉన్నాడా? అసలు ఈమె యొక్క వివాహ స్థితి ఏమిటి? ఆమెకు వివాహమైందా? లేక కేవలం ప్రధాన చేయబడిందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో.
ఇక్కడ ఒక విషయం మాత్రం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది, ఆ స్త్రీని తీసుకువచ్చిన మత పెద్దలకు న్యాయాన్ని కాపాడాలని ఆలోచన ఏమాత్రం లేదు, బహుశా పైన ప్రస్తావించినట్లుగా ఈ వృత్తాంతంలో కనబడని పురుషుడు వారికి సంబంధించిన వాడు కూడా కావచ్చు, లేదా ఆ పురుషుని యొద్ద నుండి కొంత లంచం పుచ్చుకొని అతనిని వదిలిపెట్టి కూడా ఉండొచ్చు.
కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు. -ద్వితియోపదేశకాండము 22:23,24
ఒకవేళ వివాహమైన ఒక స్త్రీ తప్పు చేస్తే, అక్కడ కూడా తప్పు చేసిన స్త్రీ పురుషులు ఇద్దరూ చంపబడాలి, కానీ రాళ్లతో కొట్టబడాలి అని మాత్రం చెప్పబడలేదు.
ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన యెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురు షుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు. -ద్వితియోపదేశకాండము 22:22పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను. -లేవీయకాండము 20:10
ఇక్కడ ఈమె స్త్రీ అని పిలవబడింది కనుక ఆమె ప్రధానము చేయబడింది కాదు ఒక వ్యక్తికి భార్యా అనేది పండితుల అభిప్రాయం. మొత్తానికి యేసుక్రీస్తు వారు ఈ సమయంలో , శిక్ష విధించుట సంగతి పక్కన నుంచి, వారి యొక్క వ్యక్తిగత అపరాధమును పరిగణించాలని తెలియజేస్తూ ఆమెను తప్పించాడు.
ఇక ముగింపులో స్త్రీ తో పాటు పురుషుని తీసుకురాకపోవడానికి ఆనాడు ఉన్న సామాజిక పరిస్థితులు, యేసుక్రీస్తు వారిని చిక్కించుకోవాలన్నా కోణం, న్యాయ నెరవేర్పు పట్ల వారికి ఉన్న చులకన భావమును మనకు తెలియజేస్తున్నది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి