బెతస్థ కోనేరు వద్ద యేసు తాను స్వస్థపరచిన వ్యక్తితో నీ పరుపెత్తుకుని నడవమని ఎందుకు చెప్పాడు?
అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను. యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగిస్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడి నప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులుఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడునీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. -యోహాను 5:1 -16
మొదటిగా నన్ను ఈ ప్రశ్న అడిగిన సహోదరుడికి వందనాలు, యేసయ్య ఇలా చెప్పడానికి నాలుగు కారణాలు ఉన్నాయి : స్వస్థతను రుజువుపరచడం, సాక్ష్యం ఇవ్వడం , సబ్బాతుకు ప్రభువు యేసు క్రీస్తు వారిని తెలియపరచడం, స్వస్థపరచబడిన వ్యక్తి యొక్క విశ్వాసము విధేయత పరీక్షించబడటం.
స్వస్థతను రుజువుపరచడం :
యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్థ అనే కోనేరు ఉండేది, దీనికి ఐదు మంటపములు ఉండేవి. ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించడం జరుగుతూ ఉంటుంది, నీళ్లు కదిలించబడిన తర్వాత మొదట నీటిలోనికి ఎవరు దిగుతారో, వారు ఎలాంటి వ్యాధి కలిగిన వారైనప్పటికి బాగుపడడం జరుగుతుంది, ఈ స్వస్థతను పొందుకోవడం కోసం ఆ మంటపాల్లో అనేకమంది రోగులు, కుంటివారు గుడ్డివారు ఇలా చాలామంది ఉండేవారు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతమును దర్శించడం జరిగింది, ఆ సమయంలో ఆయన 38 సంవత్సరాల నుండి వ్యాధి కలిగిన వ్యక్తి అక్కడ ఉండటం చూసి, నీవు స్వస్థపడ కోరుతున్నావా అని అడిగాడు.
దానికి అతను దేవదూత నీళ్లు కదిలించిన తర్వాత మొదటిగా నన్ను నీళ్లలో దింపటానికి ఎవరూ లేరు, నాకై నేనుగా వెళ్లి దిగే లోపల నాకంటే ఎవరో ఒకరు ముందుగానే నీళ్లల్లో దిగుతున్నారు అని చెప్పాడు. దీనిని బట్టి అతని యొక్క బలహీనత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు, దీనిని బట్టి కొంతమంది ఈయనకు పక్షవాతమని, కుంటితనమని చెప్తూ ఉంటారు.
38 సంవత్సరాలుగా ఇతను అక్కడ ఉన్నాడు అంటే, అది అతని యొక్క నిస్సహాయతను , తనకున్న నిరీక్షణను తెలియజేస్తున్నది, ఇతను చాలా సహనం కలవాడు అని కూడా చెప్పవచ్చు. 38 సంవత్సరాలుగా తనకు ఎలాంటి స్వస్థత కలగకపోయినా, వేరేచోటకి వెళ్లే ప్రయత్నం చేయకుండా అక్కడే ఉండిపోయాడు. 38 సంవత్సరాలుగా ఈయన ఇక్కడే ఉన్నా నీళ్లు కదిలింప బడిన తర్వాత తనకంటే ముందుగా ఎవరో ఒకరు దిగి స్వస్థత పొందటానికి చూస్తే మనుషులు యొక్క స్వార్థం ఇట్టే అర్థమవుతుంది.
ఆ సమయంలో యేసయ్యా ఆ వ్యక్తితో చెప్పిన మాట ఏమిటంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఇలా చెప్పడంలో మనం ఆలోచిస్తే నాలుగు కారణాలు కనబడుతున్నాయి, మొదటిగా అతను అలా తన పరుపెత్తుకొని నడవడం తాను పూర్తిగా స్వస్థపడ్డాడు అనేదానికి రుజువుగా ఉన్నది. ఈయన దశల దశలుగా బాగుపడలేదని, ఆ స్వస్థత కార్యం తక్షణమే జరిగిందని, అప్పటివరకు కదలలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కొంత బరువును మోయగలిగిన స్థితిని పొందాడని ఇది తెలియజేస్తుంది.
సాక్ష్యం ఇవ్వడం :
రెండవదిగా , ఆ దినము సబ్బాతు గనుక కానీ ఈ విధంగా తన పరుపు ఎత్తుకొని వెళ్లడం అనేది అనేకమందికి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఇస్తుంది. సబ్బాతు దినాన కొన్ని పనులు చేయడం నిషేధం, ఆనాటి కాలంలో ఉన్న యూదా మత పెద్దలు 39 రకాల పనులు చేయకూడదని నిషేధించారు. ఖచ్చితంగా బరువును మోసుకుని వెళ్లడం నిషేధమే, ఈయన ఈ విధంగా బరువును మోసుకొని వెళుతున్నప్పుడు, తనను చూసినవారు నువ్వెందుకు ఈ విధంగా బరువును మోసుకొని వెళ్తున్నామని ఖచ్చితంగా అడుగుతారు, అప్పుడు అసలు తానెవరో, తనకు ఏమి జరిగిందో, తనను స్వస్థపరచిన వ్యక్తి తనకు ఏమని చెప్పాడో, ఇవన్నీ వివరిస్తూ యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడుగా ఆయన ఉండటానికి అవకాశం ఉన్నది.
సబ్బాతుకు ప్రభువు యేసు క్రీస్తు వారిని తెలియపరచడం :
మూడవదిగా యేసుక్రీస్తు వారు సబ్బాతుకు ప్రభువై ఉన్నాడని తెలియపరచడం: ఆనాటి కాలంలో యూదా మత పెద్దలు సబ్బాతును గూర్చి విధించిన నియమాలు, సబ్బాతును దేవుడు విధించిన ఉద్దేశాన్ని మరిచిపోయే విధంగా చేశాయి. అందుకే యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో దాని యొక్క అసలు అర్ధాన్ని గుర్తు చేయడానికి సబ్బాతు దినాన స్వస్థతలు చేయడం, సబ్బాతు మనిషి కోసమే గాని మనిషి సబ్బాతు కోసం లేడని తెలియపరిచే ప్రయత్నం చేశాడు. అయితే ఇతను ఇక్కడ చేసింది పాపమే మాత్రము కాదు. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు సబ్బాతు దినాన యెరికో చుట్టూ తిరిగారు, ఇతను చేసిన ఈ కార్యం అత్యవసరమైనదో, దయాపూర్వకమైనదో కాదు గాని అంతకుమించి దేవుని పట్ల భక్తిని కనపరుస్తూ ఆయనను మహిమ పరిచే కార్యమైయున్నది.
స్వస్థపరచబడిన వ్యక్తి యొక్క విశ్వాసము విధేయత పరీక్షించబడటం :
నాలుగోదిగా ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని విధేయతను పరీక్షించడానికి యేసయ్య ఈ విధంగా చెప్పాడు. యేసు వారి మాట ప్రకారంగా తన ఈ విధంగా పరుపెత్తుకొని వెళ్లడం ద్వారా, ఖచ్చితంగా ఆయన మహాసభ వద్దకు పిలవబడటం జరుగుతుంది, లేదా కనీసం సమాజ మందిరంలో పెద్దల ద్వారా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. తనలా చేసినందుకు కొట్టబడడం లేదా వేరే ఏదైనా శిక్ష విధించబడటం జరగవచ్చు. మరి యేసుక్రీస్తు వారి కోసం తాను ఇవన్నీ అనుభవిస్తాడా? దానిని పరీక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. క్రీస్తు ద్వారా రక్షింపబడిన మనమందరం, ఆయన కొరకు ఆయనకు విధేయత చూపుట కొరకు ఎన్ని సమస్యలైనా అనుభవించడానికి వెనకాడనివారమై ఉండాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి