దిగివచ్చిన దేవుడు (మత్తయి - ప్రకటన)



దిగివచ్చిన దేవుడు (మత్తయి - ప్రకటన)

దిగివచ్చిన దేవుడు
(మత్తయి - ప్రకటన) 

400 సంవత్సరాల మౌనం తర్వాత దేవుడు మరల మాట్లాడ్డం ప్రారంభించాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపటానికి అవసరమైన మార్గమును సిద్దపరచడానికి యోహానును, ఇంకా అనేకమంది ప్రవక్తి, ప్రవక్తలను పంపడం జరిగింది.

మనుషునిగా దిగి వచ్చాడు

కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు, ఆయన దేవుడిచ్చిన వాగ్దానమును నెరవేరుస్తూ స్త్రీ యందు పుట్టి మనుష్య రూపమును ధరించాడు.

ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. -మత్తయి 1:22,23

మానవుల యొక్క పాప పరిహారము నిమిత్తమై తాను శరీర ధారిగా రావాల్సి వచ్చింది.

మాదిరిని చూపించుటకు దిగి వచ్చాడు

యేసయ్య సాధారణ బాల్యమును, యవ్వనమును కలిగి అన్ని విధాలా శోధనలను ఎదుర్కొని, వాటిని జయించి మనకు మాదిరిని కనపరచాడు

మహత్తర కార్యములు కనికరముతో జరిగించాడు

ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. -లూకా 7:13

ప్రజల అనుభవిస్తున్న బాధలను చూచి కనికరపడి వారి బంధకముల నుండి వారిని విడిపించుటకు అనేకమంది రోగులను స్వస్థపరచాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు ఎన్నో అద్భుత కార్యములు ఆయన జరిగించాడు

మనుషుల పాపముల కొరకు ప్రాణమును పెట్టాడు

ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను. -యోహాను 10:18

యేసయ్య చంపబడలేదు గాని , మనందరి కొరకు తనకు తానే తన ప్రాణమును అర్పించాడు, మూడోవ దినాన పునరుద్దానుడై తిరిగి లేచాడు. 40 దినాల పాటు మనుషులకు కనబడి ఆరోహణమై మరల తండ్రి వద్దకు చేరాడు.

మన కొరకు ఆదరణ కర్తను పంపాడు

యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమ్మీద ఉన్నటువంటి సమయంలో ఆయన వెళ్లి ఆదరణ కర్తను పంపుతానని వాగ్దానం చేశాడు. ఆయన చేసిన ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తాను తిరిగి లేచిన 50వ దినాన పరిశుద్ధాత్మను నిత్యము మనతో ఉండుట కొరకై పంపడం జరిగింది.

అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. -అపో.కార్యములు 2:4

పరిశుద్ధాత్ముని రాక సంఘము మరి ఎంతగానో అభివృద్ధి చెందడానికి దోహద పడింది. దేవుడు తన ఆత్మ ద్వారా పేతురు, పౌలు అను తన సేవకులను బలపరిచి ఎన్నో గొప్ప కార్యాలు, యూదులలోను అన్యజనులలోను, జరిగిస్తూ దేవుని రాజ్యము విస్తరించినట్లుగా సహాయం చేశాడు. ఇందుమూలముగా యేసుక్రీస్తు వారిని గూర్చిన విషయాలు యెరుషలేములోనూ , యూదయ సమరయ ప్రాంతములలోను, భూ దిగంతముల వరకు వ్యాప్తి చెందుతూ అనేక సంఘములు ఏర్పడుటకు కారణమయ్యింది.

మనము క్షేమాభివృద్ధినొందునట్లు సేవకులను నియమించాడు

పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను. -ఎఫెసీయులకు 4:13

అయితే సంఘము వృద్ధి చెందుతూ ఉండగా, సమస్యలు కూడా వృద్ధి చెందాయి. అనేకమైన అబద్ధ బోధలు సంఘములోనికి వచ్చేసాయి. ఇవి సంఘమును కకావికలం చేస్తూ ఉండగా సంఘము క్షేమాభివృద్ధి నొందునట్లు దేవుడు పరిచర్య ధర్మమును నియమించాడు. మనము ఈ పరిచర్య ధర్మంలో కొనసాగుతూ ముందుకు సాగాలి.

మనకు జీతం ఇచ్చుటకు యేసుక్రీస్తు వారు రానై ఉన్నాడు

ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి. -యూదా 1:20,21

మన కొరకు దిగివచ్చిన దేవుడు, మన కొరకు ఆదరణ కర్తను పంపినవాడు, మనకు జీతం ఇచ్చుటకు త్వరలో రానై ఉన్నాడు.

ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. -ప్రకటన గ్రంథం 22:12

ఆయన రాకడకు ముందుగా జరగవలసిన కొన్ని సూచనలు జరిగిన పిమ్మట యేసుక్రీస్తు వారు తాను వాగ్దానం చేసిన రీతిలోనే మరలా ఆయన దిగివస్తాడు, పరిశుద్ధులందరినీ తనతో పాటు తీసుకువెళ్లడానికి ఆయన దిగి వస్తాడు.

కాబట్టి జీవించుచున్న మనము యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి మనుష్యకుమారునిగా వచ్చాడో, తెలుసుకొని మన పాపముల కొరకు ఆయన చేసిన బలియాగమును అర్థం చేసుకొని, మన జీవితంలో పరిశుద్ధాత్ముని ద్వారా దేవునితో సహవాసం చేస్తూ, దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటూ, దేవుని ప్రేమలో చల్లారక, మనము సిద్ధపడి, అనేకులను సిద్ధపరుస్తూ ఆయన రాకడ కొరకై ఎదురు చూద్దాం.

Post a Comment