దేవుడే మన పరిపాలకుడు

దేవుడే మన పరిపాలకుడు


దేవుడే మన పరిపాలకుడు

పునరుద్దరించు దేవుడు (యెహోషువ 8-12)

ఇశ్రాయేలీలు హాయి పట్టణం మీద ఓడిపోయిన తర్వాత, దేవుడు చెప్పిన మాట వారి మధ్య ఉన్న పాపమును వారు పరిహరించుకున్న తర్వాత దేవుడు మరల ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చాడు. వ్యూహరచన తానే తెలియపరచి, శత్రువును బోల్తా కొట్టిస్తూ అద్భుత విజయాన్ని ఇశ్రాయేలు ఖాతాలో ఆయన వేశాడు. 

అయితే వెంటనే మరలా ఇశ్రాయేలు నాయకులు తప్పిపోవడం జరిగింది. దేవుడు అక్కడున్న ప్రజలతో నిబంధన చేయవద్దని, కనికరము చూపవద్దని తెలియపరచినప్పటికీ, గిబియోనియులు చేసిన మోసానికి, దేవుని సహాయము కోరకుండానే బలైపోయి సిగ్గుపరచబడ్డారు. ఆ తదుపరి యెహోషువాని ఎదుర్కొనడానికి ఐదుగురు రాజులు కలసి యుద్ధానికి వచ్చినప్పటికీ దేవుడు సృష్టిని సహితము తన సేవకుని ప్రార్థనకు అనుగుణంగా అదుపు చేస్తూ ఆ రాజులందరి పైన విజయాన్ని అనుగ్రహించారు.

ఈ భాగంలో ఇశ్రాయేలీయులు పాపముల మూలంగా కొన్ని బలహీనతల మూలంగా తప్పిపోయి దేవునికి అవిధేయులైనప్పటికీ వారు దాని విషయమై దేవుని ఎదుట పశ్చాతాపబడిన తర్వాత దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించినవాడుగా ఉన్నాడు. నేటికీ మన జీవితంలో కొన్నిసార్లు మనం తప్పిపోయినప్పటికీ మరలా విధేయత కలిగి దేవుని వద్దకు తిరిగి రాగలిగినట్లయితే ఆయన మనలను పునరుద్ధరించేటువంటి వాడుగా ఉంటాడు.

పంచిపెట్టు దేవుడు (యెహోషువ 13-24)

అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు తాను చేసిన వాగ్దానమును నెరవేరుస్తూ, ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని పంచిపెట్టాడు, దేవుడు పంచిపెట్టిన ఈ భూభాగం యుద్ధంలో గెలిచినది కాదు, డబ్బులు ఇచ్చి కొన్నది అంతకన్నా కాదు. ఈ రెండు కానప్పుడు దేవుడు తన దాన్ని ఎలా పంచిపెట్టగలడు? దేవుడే సమస్త భూమికి యజమానియై యున్నారు. కాబట్టి తాను ఎవరికి దాని ఇవ్వదలుచుకుంటే వారికి దానిని ఇస్తాడు, ఎవరిని ఆ చోటు నుండి తోలివేయాలని ఆయన అనుకుంటే వారిని అక్కడి నుండి ఆయన పంపించి వేస్తాడు. వాస్తవానికి ఈ భాగములో ఇశ్రాయేలు కంటే ముందు నివసిస్తున్న ఏడు జాతుల ప్రజలను దేవుడు వెళ్ళగొట్టి వీరికి ఈ భాగాన్ని అప్పగించాడు.

భూభాగాన్ని పంచిపెట్టే ప్రక్రియలో రూబేనీయులు గాదీయులు మనషే అర్ధ గోత్రపువారు యోర్దానుకు అవతలి భాగాన వారి కోరిక మేరకు భూభాగాన్ని పొందారు. మిగతా గోత్రాల వారికి వారి గోత్రం యొక్క సంఖ్యను బట్టి ఎక్కువ సంఖ్య ఉన్నవారికి ఎక్కువ భూభాగాన్ని తక్కువ సంఖ్య ఉన్న వారికి తక్కువ భూభాగాన్ని కేటాయించడం జరిగింది. ఇందులో చీట్లు వేసే విధానాన్ని అనుసరించారు. ఎవరికి కేటాయించిన భూభాగాన్ని వారికై వారే ఆ ప్రాంత ప్రజలను వెళ్ళగొట్టి దానిని సొంతం చేసుకోవలసి ఉన్నది. ఈ పంచిపెట్టే కార్యక్రమం ముగిసిన తర్వాత యెహోషువ మరణించాడు.

దేవుడే మన పరిపాలకుడు (న్యాయధిపతులు - 2 దినవృత్తాంతములు )

యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులకు నాయకులెవరు ఏర్పాటు చేయబడలేదు, దేవుడే వారికి నాయకుడిగా ఉండి వారిని నడిపించాలన్న ఉద్దేశంతోటి దేవుడు ఆ విధంగా చేయడం జరిగింది.

యెహోషువ మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు దేవుడు చెప్పిన మాట చొప్పున వారి భూభాగాలను అక్కడున్న ప్రజలను వెళ్ళగొట్టి సొంతం చేసుకొనడంలో విఫలం చెందారు. కొంతమంది వారిని బానిసలుగా చేసుకున్నారు గానీ పూర్తిగా వారిని వెళ్ళగొట్టలేదు.

ఈ ప్రజలు దేవుని పట్ల చూపిన ఈ అవిధేయత, వారిని ఇంకా దేవునికి విరోధముగా మార్చి వేసింది అని చెప్పవచ్చు. ఎందుకనగా దేవుడు అసలు వీరిని వెళ్ళగొట్టమని చెప్పడానికి గల ముఖ్యమైన కారణం, వారి ద్వారా ఇజ్రాయిల్ యొక్క పవిత్రత చెడగొట్టబడకూడదని. వారిని అలాగే ఉంచడం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ ప్రజలు చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను నేర్చుకుని ఆయన దృష్టికి పాపులయ్యారు.

ఇలా ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు, న్యాయవంతుడైన దేవుడు వారిని క్రమశిక్షణలోనికి తీసుకురావడం కోసం ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన ఆయనే ఆ చుట్టుపక్కలు ఉన్న దేశాల వారికి ఈ ప్రజలను బానిసలుగా అప్పగించాడు. 

వారు మరల కొన్ని సంవత్సరాలు ఆ బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత వారు దేవునికి మొరపెట్టిన విధానాన్ని బట్టి ఆయన మరల వారి కొరకు రక్షకులను పుట్టించాడు, ఈ రక్షకులే న్యాయాధిపతులని పిలువబడ్డారు. వాస్తవానికి న్యాయాధిపతులు అనగా న్యాయము తీర్చేవారు అని కాదు గాని, దేవుని పక్షంగా బానిసత్వంలో ఉన్న వారిని యుద్ధం చేసి పోరాడి విడిపించే వారిని అర్థం చేసుకోవాలి. 

ఇశ్రాయేలీయులు విడుదల పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా పాపం చేసి మరలా దేవుని కోపానికి గురై బానిసలుగా మార్చబడేవారు, తర్వాత మరలా దేవుడు వారిని వారి యొక్క మొరను ఆలకిస్తూ ఇంకొక రక్షకుని ఏర్పాటు చేసి విడిపించేవాడు. ఈ చక్రం ఈ విధంగానే కొనసాగుతూ వచ్చింది, దీనిని ఆలోచిస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా ఇదే విధంగా ఉందని స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. 

ఇలా ఈ న్యాయాధిపతులు ఒత్నియేలు మొదలుకొని సమూయేలు యొక్క కుమారుల వరకు చాలామంది పనిచేశారు. సమూయేలు కుమారుల కాలానికి వచ్చేసరికి వారు లంచగొండిలుగా, న్యాయమును తిప్పేసేవారుగా మారిపోయినందుకు ఇశ్రాయేలీయుల ప్రజలు తమకు కూడా ఇతర దేశాల వారికి వల్లే ఒక రాజు కావాలని కోరుకున్నారు. 

సమూయేలుకు ఆ నిర్ణయం ఏ మాత్రం నచ్చకపోయినా, దేవునికి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ ప్రజలు కోరుకున్నది వారికి అనుగ్రహిస్తూ సౌలు అనే వ్యక్తిని వారికి మొదటి రాజుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఈ విధంగా కోరుకోవడం ద్వారా దేవుడే వారిని పరిపాలించాలని విధానానికి వారు అడ్డు తగిలిన వారుగా ఉన్నారు. 

సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ మొదట్లో నమ్మకంగా ఉన్న తర్వాత దేవునికి అవిధేయుడయ్యాడు, సౌలు యొక్క విధేయతను బట్టి సమూయేలు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చగా, ఆయన స్థానంలో దావీదును రాజుగా ఏర్పాటు చేశాడు. 

దావీదు దేవునికి ఇష్టముగా నడుచుకొనుచున్న విధానమును బట్టి దావీదు యొక్క సింహాసనాన్ని నిత్యమూ స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన కుమారులలో ఎవరో ఒకరు ఖచ్చితంగా సింహాసనం మీద ఉంటారని దేవుడు చెప్పాడు. 

ఈ దావీదు ఇశ్రాయేలు చరిత్రలో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు, ఈయన రచయిత గాయకుడు, వాయిద్య కారుడు, యుద్ధ వీరుడు అన్నిటికి మించి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈయన రాసిన దాదాపు 100 కీర్తనలు పరిశుద్ధ గ్రంధంలో మనకు కీర్తన పుస్తకంగా ఇవ్వబడింది.

ఆ కారణం చేత దావీదు తర్వాత ఆయన కుమారుడైన సొలోమోను, ఆ తర్వాత రెహబాము ఇలా ఎంతోమంది పరిపాలించిన వారుగా ఉన్నారు. ఈ సలోమాను మహా జ్ఞాని అయి ఉన్నాడు, ఆయన తన జ్ఞానమంతా ఉపయోగించి జీవిత పరమార్ధాన్ని తెలియపరచుటకు చేసిన ప్రయత్నమే ప్రసంగి గ్రంధం. ఆయన యవ్వన కాలంలో రచించిన ప్రేమ కావ్యమే పరమగీతము.

అయితే రెహబాము కాలములో జరిగిందేంటంటే ఐక్యరాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం రెండు ముక్కలుగా చేయబడటం జరిగింది, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు కూడా పది గోత్రాలు ఒక రాజ్యంగాను, రెండు గోత్రాలు ఒక రాజ్యాంగాను ఏర్పడ్డాయి. 

పది గోత్రాలు ఉన్న రాజ్యాన్ని ఇశ్రాయేలు రాజ్యం అని లేదా ఉత్తర రాజ్యం అని పిలిచారు, ఈ రాజ్యము క్రీస్తు పుర్వము 722వ సంవత్సరం వరకు నిలిచి ఉన్నది, వీరు దేవునికి చూపిన అవిధేయతను బట్టి ఆ తర్వాత అష్షురు చెరలోనికి ఈ రాజ్యము వెళ్లిపోయింది. ఈ రాజ్యాన్ని యరోభాము మొదలుకొని మొత్తం మీద 19 మంది రాజులు పరిపాలించారు. అయితే వీరిలో ఒక్కలు కూడా దేవునికి ఇష్టమైన వారు లేకపోవడం ఆశ్చర్యకరం.

రెండు గోత్రాలు కలిగిన రాజ్యమును దక్షిణ రాజ్యమని లేదా యూదా రాజ్యం అని పిలిచేవారు. ఈ రాజ్యాన్ని దావీదు కుమారులు పరిపాలించారు, 19 మంది రాజులు, ఒక రాణి ఈ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఈ 20 మందిలో కనీసం ఎనిమిది మంది దేవునికి ఇష్టంగా జీవించారు. 

అందుకేనేమో బహుశా 722వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజ్యము కూలిపోయినప్పటికీ, దాదాపు 150 సంవత్సరాలకు పైగా పశ్చాత్తాప పడి దేవునికి ఇష్టంగా జీవించడానికి దేవుడు ఈ రాజ్యానికి అవకాశం ఇచ్చాడు. ఈ ప్రజలు కూడా తీరు మార్చుకొనకుండా దేవునికి అవిధేయంగా నడుచుకున్న విధానాన్ని బట్టి క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో ఏ దేవుడైతే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడో అదే దేవుడు బబులోను ప్రజలకు బానిసలుగా వీరిని అప్పగించాడు.

దేవుడు ఈ ప్రజలను బానిసలుగా ఇతర దేశాలకి అప్పగించుటకు ముందుగా అనేకమంది ప్రవక్తలను ఆయా రాజులు పరిపాలిస్తున్న కాలంలో వారి వద్దకు పంపి వారిని హెచ్చరించినవాడుగా ఉన్నాడు, ఆ ప్రవక్తలు దేవుని పక్షాన పలికిన ప్రవచనాలే నేడు మనము కలిగి ఉన్న ప్రవక్తల గ్రంధాలు.

ప్రియులారా దేవునికి ప్రియమైన జీవితాన్ని మనం జీవిస్తే, ఆయనను మన జీవితంలో రాజుగా చేసుకొని కొనసాగితే దేవుడు మన జీవితాన్ని శిఖరం పై నిలబెడతాడు, ఆయనకు అవిధేయులమై మనము కొనసాగిన యెడల దేవుడు మనలను క్రమశిక్షణలో పెడుతూ కొన్నిసార్లు తీవ్రంగా మనలను శిక్షించాల్సి కూడా వస్తుంది. కాబట్టి ప్రభువుకి లోబడి జీవించే ప్రయత్నం మనం అన్ని సందర్భాల్లో చేద్దాము.


తిరిగి రప్పించు దేవుడు (ఎజ్రా, హగ్గాయి, జెకార్య, నెహెమ్యా)

అయితే ఈ బానిసత్వం 70 సంవత్సరాలు మాత్రమే కొనసాగింది.


రక్షించు దేవుడు - రోషముగలవాడు (ఎస్తేర్, మాలాకి ).

Post a Comment