![]() |
| Junior -06 |
మిర్యాము వివేకముగలది
హాయ్ పిల్లలు బాగున్నారా, మిర్యాము జీవితం నుంచి మీరు నేర్చుకుంటున్న పాఠాలు మీకు నచ్చుతున్నాయా? ఇప్పటివరకు మిర్యాము గురించి ఆమె విధేయురాలని, శ్రద్ధగలదని, ధైర్యవంతురాలని, చురుకైనదని తెలుసుకున్నాము. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకుందాం.
మిర్యాము రాజకుమార్త కొరకు బాబును పెంచడానికి ఒక దాదిని తీసుకువచ్చేదా అని అడిగింది కదా! దానికి రాజకుమార్తే సరే అని ఒప్పుకుంది. ఇక ఇప్పుడు మిర్యాము ఎక్కడికి వెళ్లాలి దాది అంటే ఎవరిని తీసుకురావాలి? బాబుకు పాలు ఇవ్వాలి, మంచిగా చూసుకుని చక్కగా పెంచాలి, మరి దానికి ఎవరిని తీసుకురావాలి?
మిర్యాము స్థానంలో మీరు ఉంటే ఏం చేస్తారు? ఎవరో ఒకరు మంచివారిని చూసి తీసుకొస్తారా? మిర్యాము ఏం చేసిందో తెలుసా? రెండో ఆలోచన లేకుండా ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మను పిలుచుకుని వచ్చింది, పిలుచుకొని వచ్చి ఈమె దాది అని పరిచయం చేసింది. ఎంత తెలివైన అమ్మాయి మిర్యాము.
ఈ దాదియే ఆ బాబు వాళ్ళ అమ్మ అని రాజ కుమార్తెకు తెలియదా! తెలిసే అవకాశం లేదా? పోలికలను బట్టి అయినా గుర్తు పట్టొచ్చు కదా! ఏమో ఏమైనా కానీ మిర్యాము మాత్రం దేవునిపై భారం మోపి ఆ బాబుని పెంచడానికి వాళ్ళ అమ్మనే దాదిగా తీసుకొచ్చింది. రాజకుమార్తె మిర్యాము తీసుకువచ్చిన దాదిని చూడగానే ఈ బిడ్డను తీసుకువెళ్లి నా కొరకు పాలు ఇచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను అని చెప్పింది. ఇక వెంటనే ఆ అమ్మగారు బాబుని తీసుకుని వెళ్లి రాజకుమార్తె కొరకు పాలిచ్చి పెంచుతూ ఉన్నది. ఆ బాబు కొంచెం పెద్దవాడైన తర్వాత ఆ బాబుని రాజ కుమార్తె వద్దకు ఆయన తీసుకొని వచ్చింది, అప్పుడు ఆ రాజకుమార్తె ఆ బాబుకి మోషే అని పేరు పెట్టింది.
చూశారా పిల్లలు, మిర్యాము యొక్క వివేకాన్ని బట్టి మరియు తనకున్న ఇతర లక్షణాలన్నిటిని బట్టి దేవుని సహాయం చేత వారి తమ్ముడు తిరిగి మరల వాళ్ళ ఇంటికి వచ్చాడు, ఇక ఇప్పుడు భయపడుతూ బాబుని పెంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ బాబు రాజకుమార్తె కొడుకుగా పిలవబడుతున్నాడు. కాబట్టి దేవుడు చేసిన ఈ మంచి కార్యాన్ని బట్టి ఆయనను స్తుతించండి , ఆయనపై విశ్వాసము ఉంచండి , అంతేకాదు మిర్యాము వలె వివేకము కలిగి ఉండటానికి సహాయం చేయమని దేవునిని ప్రార్థించండి.
మనకు కూడా మిర్యాము వంటి వివేకము కావాలంటే ఏం చేయాలి, మనకు వివేకాన్ని ఇచ్చేవాడు దేవుడే కనుక ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయన చెప్పిన మాటను మనము వినాలి. అప్పుడు దేవుడు మనకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు తోటి మిర్యాము గూర్చిన పాఠాలు ముగిస్తున్నాను, మరలా మరొక అంశంతో కలుసుకుందాం.
కంఠత వాక్యము
నీ దేవుడైన యెహోవా……..మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు…. -1 రాజులు 2:3
- Rephidim Ministries

కామెంట్‌ను పోస్ట్ చేయండి