మిర్యాము చురుకైనది
హాయ్ పిల్లలు బాగున్నారా? నేను ఇప్పుడు మీకు ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను, మీరందరూ సిద్ధమేనా! Stand… మీరు ఇంకా కూర్చున్నారు ఏంటి? Sit…. అయ్యో మీలో ఇంకా కొంతమంది నిలబడే ఉన్నారే. (ఈ ఆటను కొద్దిసేపు ఆడించి వారిలో విజేతలు ఎవరో కనుగొనండి, ఆట పూర్తయిన తర్వాత విజేతను ముందుకు పిలిచి… పిల్లలను ఈ ప్రశ్న అడగండి) పిల్లలు ఈ అమ్మాయి/ అబ్బాయి ఈ ఆటలో ఎందుకు గెలిచారు? ( పిల్లల్ని సమాధానం చెప్పనివ్వండి). వాళ్లు మంచిగా సమాధానం చెప్తే సరే, చెప్పలేకపోతే పాఠం చివర్లో దీనికి సమాధానం చెబుతానని చెప్పండి.
పిల్లలు మిర్యాము గురించి మనము ఏమేమి నేర్చుకున్నాం మీకు గుర్తుందా?? మిర్యాము విధేయురాలు, శ్రద్ధగలది, ధైర్యవంతురాలు అని తెలుసుకున్నాం. మిర్యాము తన తమ్ముడికి కావలి కాస్తూ , నది దగ్గరే ధైర్యంగా నిలబడి ఉంది కదా! ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? ఒక జరగరాని సంఘటన జరిగింది! రాకూడని ఒక వ్యక్తి ఆ వైపు వస్తూ ఉన్నారు, ఇప్పుడు ఆ సమయంలో అక్కడికి ఎవరు వచ్చినా మిర్యాముకు భయమే కదా! బుట్టలో ఉన్న బాబుకి ఏమవుతుందో, ఎవరైనా ఆ బాబుని ఏమైనా చేస్తారేమో, అని చాలా భయమేస్తుంది.
కానీ ఈసారి అక్కడకు వచ్చింది ఎవరో తెలుసా? ఏ రాజు గారైతే మీ పిల్లల్ని నదిలో పడవేయమని చెప్పాడో ఆ రాజు గారి కుమార్తె అక్కడికి వచ్చింది, రాజు గారి కుమార్తె ఒక్కతే రాదు కదా, తన స్నేహితురాళ్ల తోటి అక్కడికి వచ్చింది. ఇప్పుడు మిర్యాము స్థానంలో మీరు ఉంటే ఏమి కోరుకుంటారు? ఒకటి బాబు ఏడవకూడదు, రెండు వారు ఎందుకు వచ్చారో వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళాలి, మూడు ఈ బుట్ట వాళ్లకి కనబడకూడదు బుట్ట గురించి వాళ్ళు పట్టించుకోకూడదు. అసలు రాజు గారి కుమార్తె అక్కడికి రాగానే అబ్బా ఇప్పుడు ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది ఇక్కడికి అని మిర్యాముకు అనిపించి ఉండొచ్చు.
స్నానం చేయడానికి అక్కడకు వచ్చిన రాజకుమార్త, అలా ఒడ్డున నడుస్తూ జమ్ములో ఉన్న ఆ బుట్టను చూడనే చూసింది, అయ్యో ఇంకేముంది? అంతే ఇక తమ్ముడు పని అయిపోయినట్టే అని మిర్యాముకు అనిపించి ఉండొచ్చు. బుట్టను చూసిన ఆమె మౌనంగా ఉందా? లేదు తన స్నేహితులను పంపించి ఆ బుట్టను తెప్పించింది. మిర్యాము గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి కదా, ఒకవేళ మిర్యాము స్థానంలో మీరుంటే చాలా టెన్షన్ పడేవారు కదా! ఆమె బుట్టను తెప్పించడమే కాకుండా దాన్ని తెరచింది, ఇంకేముంది అందులో ఉన్న బాబు ఆమెకు కనబడ్డాడు. అప్పుడే ఆ బాబు పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు, ఇప్పుడు మిర్యాము ఏమని అనుకోని ఉండొచ్చు!
ఇంకేముంది అంతా అయిపోయింది, మా అమ్మ కష్టం, నేను కావాలి కాయటం అంత వ్యర్థమైపోయింది, ఇంకేముంది బాబుని విసరి నదిలో పడవేస్తది అని అనుకోని ఉండొచ్చు. కానీ అలా జరగలేదు, ఏమైందో తెలుసా, రాజు గారి కుమార్తె ఆ బాబుని అలానే చూస్తా ఉంది, ఆమెకి చాలా జాలేసింది. పైగా ఆ బాబు తన తండ్రి నదిలో పడవేయమని చెప్పిన హెబ్రీ పిల్లల్లో ఒకడు అని కూడా ఆమెకు అర్థమైంది. ఇన్ని అర్థమైన తర్వాత కూడా ఆ బాబుని ఆమె విసిరి నదిలో పడవేయకుండా అలాగే చూస్తా ఉంది, దేవుడే ఆమెకు అంత మంచి మనసు కలుగజేసాడు.
పిల్లలు మనము కూడా దేవుని మీద నమ్మకం ఉంచితే అసాధ్యం అనిపించిన కొన్ని పరిస్థితుల్లో కూడా మన ఊహించని రీతిలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు, ఇప్పుడు ఇక అక్కడే ఉన్న మిర్యాము దగ్గరకు వెళ్ళింది, వెళ్లి రాజు గారి కుమార్తెతో ఏం చెప్పిందో తెలుసా? అమ్మో మీరైతే రాజు గారి కుమార్తె దగ్గరికి వెళ్లి మాట్లాడతారా? భయం కదా, అందుకే మిర్యాము ధైర్యవంతురాలు అని నేర్చుకున్నాం. దేవుడే ఆమెకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. మిర్యాము దగ్గరకు వెళ్లి " నీ కొరకు ఈ బాబుని పెంచడానికి నేను ఒక దాదిని పిలుచుకొని వచ్చేదా " అని అడిగింది.
అబ్బా ఎంత చురుకైనది. చూడండి తాను ఎంతసేపు దూరంగా ఉండాలో అంత సేపు దూరంగా ఉన్నది, ఎప్పుడు దగ్గరకు వెళ్లాలో అప్పుడు వెంటనే దగ్గరకు వెళ్ళిపోయింది. అలాంటి చురుకుతనం మనందరికీ కావాలి, ఇంతకుముందు పోటీలో వాళ్లు గెలవడానికి కారణం ఏంటి చురుకుతనమే. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక మీరు మందంగా కాక చురుకుగా ఇంట్లోనూ, స్కూల్లోనూ, దేవుని మందిరంలో ఉండటానికి సహాయం చేయమని దేవునిని ప్రార్థించండి.
మిర్యాము అడిగిన ప్రశ్నకు రాజకుమార్తె ఏమి సమాధానం చెప్పిందో, తర్వాత మిర్యాము ఏం చేసిందో, బుట్టలోని బాబు సంగతి ఏమైందో వచ్చేవారం తెలుసుకుందాం!
కార్యాచరణ :
కంఠత వాక్యము :
సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. -సామెతలు 12:27
- ఆర్ . సమూయేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి