దేవుని నియామకమును గుర్తించిన హవ్వ



దేవుని నియామకమును గుర్తించిన హవ్వ
Eve-7

దేవుని నియామకమును గుర్తించిన హవ్వ 

    పిల్లలను కనినప్పుడు తల్లి హృదయం సంతోషంతో నింపబడటం మాత్రమే కాకుండావారి యొక్క ఎదుగుదలను చూస్తూ ఉన్నప్పుడు రకరకాలైన అనుభూతులను ఆమె పొందుతుంది. ఇందులో కొన్ని మంచి అనుభవాలు, మరికొన్ని హృదయమును బాధించే అనుభవాలు ఉంటాయి. ఇందుకు హవ్వ అతీతురాలు కాదు, తాను కూడా ఒక తల్లిగా సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఈ భాగంలో ఒక తల్లిగా తన అనుభవించినటువంటి బాధలు, దానికి బదులుగా దేవుడు అనుగ్రహించిన సంతోషం ఆమె జీవితంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హవ్వ పొందిన బాధ

    తాను కనిన తన మొదటి కుమారుడైన కయీనును చూచి మొదట్లో తాను చాలా సంతోషించి ఉండి ఉంటది, ముద్దు ముద్దు మాటలు, బుడిబుడి నడకలు, చేసే చిన్న చిన్న అల్లరి పనులు ఇవన్నీ బాల్యము కౌమారం అంటే ఎరగని ఆదాము హవ్వలకు ఎంతో సంతోషాన్ని కలిగించి ఉంటాయి. దేవుడు వెంటనే వారికి మరొక కుమారుని అనగా హేబేలును ఇవ్వడం కూడా వారి సంతోషాన్ని రెట్టింపు చేసి ఉంటాయి.

దేశ దిమ్మరిగా మారిన కుమారుడు

    పిల్లలు ఎదుగుతూ ఉండగా ఇద్దరూ రెండు వేరువేరు పనులలో (ఒకరు వ్యవసాయదారుడుగా, ఇంకొకరు గొర్రెల కాపరిగా) స్థిరపడడం కూడా వారికి సంతోషాన్ని కలిగించి ఉంటాయి, కానీ ఆ పిల్లలిద్దరూ దేవునికి బలి అర్పించడానికి నిర్ణయించుకున్న రోజున వారి పెద్ద కుమారుడైన కయీను ప్రవర్తించిన తీరు తీసుకువచ్చిన బలి వారిని ఆశ్చర్యానికి బాధకు గురి చేసి ఉంటుంది. 

    హేబేలు చక్కని బలిని అర్పించి దేవుని వలన మెప్పు పొందినప్పుడు హవ్వ ఎంత సంతోషించి ఉండి ఉంటుందో, కయీను యొక్క అర్పణ నిరాకరించబడినప్పుడు, దేవునికి తన పెద్ద కుమారుడు ఇష్టుడు కాడనే సంగతి తెలిసినప్పుడు ఆమె అంతకంటే ఎక్కువగా బాధపడి ఉండి ఉండొచ్చు. అయితే అంతకంటే బాధ కలిగించే మరొక విషయం ఏమిటంటే కయీను తన తమ్ముడి విషయంలో అసూయ కలిగి ఉన్నాడు అనే సంగతి, ఆ అసూయ పగగా మారి హేబేలు యొక్క ప్రాణం తీసే వరకు వెళ్ళినప్పుడు ఇక ఆమె బాధను వర్ణించలేము. కయీను మీద కోపం వచ్చి ఉండొచ్చు, ఒక వైపు అతని మీద కోపం కలుగుతున్న మరోవైపు దేవుడు అతనికి విధించిన క్రమశిక్షణను చూస్తే హవ్వ మనసు ఎంతో బాధపడి ఉంటుంది.

ప్రాణం కోల్పోయిన కుమారుడు

    పిల్లలను కనినప్పుడు ఉన్న సంతోషం కంటే, ఆ పిల్లలు మంచి లక్షణాలు కలిగి ఎదుగుతూ దేవునికి ఇష్టులుగా సమాజానికి ప్రయోజనకరంగా ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఇలాంటి సంతోషం కలిగించిన కుమారుడిగా హేబేలు ఉన్నాడు. కానీ ఆ కుమారుడినే కయీను చంపడం, హవ్వ హృదయాన్ని ఎంతో కలచివేసి ఉంటుంది. 

    బహుశా ఈ కుమారుడు కోసం హవ్వ ఎంతగానో ఎన్నో దినాలు పాటు ఏడ్చి ఉంటుంది. చావంటే ఏంటో వారికి అప్పటికి ఇంకా తెలియదు, తన కళ్ళముందే తన కంటే ముందుగా తన కుమారుడు చనిపోవడం, అది కూడా తన కడుపును పుట్టిన మరొక కుమారుడు చేతిలో చంప పడటం హవ్వ హృదయాన్ని ఎంతగా బాధపరచి ఉంటుందో, ఒక్క క్షణం ఆమె స్థానంలో ఉండి ఆలోచించండి.

హవ్వ పొందిన బదులు

    దేవుడు హవ్వ పట్ల దయ కలిగి కుమారులను కుమార్తెలను అనుగ్రహించాడు, అయితే వారిలో ఒక్కడైన కయీను, తన తమ్ముడైన హేబేలును చంపాడు తాను దేవుని శాపమునకు గురై దేశదిమ్మరిగా మారిపోయాడు.

    హవ్వకు ఈ రెండు విషయాలు రెండు శూలముల వలె గుండెల్లో దిగబడి ఉండి ఉంటాయి. ఏ తల్లి తట్టుకోగలదు చెప్పండి! ఇద్దరు పిల్లలు అంటే రెండు కళ్ళే కదా, ఒక కన్ను వచ్చి ఇంకొక కన్నును పొడుస్తూ ఉంటే, ఒక కన్నును పోగొట్టుకోగలమా? ఇంకొక కన్నును ఆపగలమా? బిడ్డను కోల్పోవడం ఏ తల్లి కైనా చాలా బాధాకరం, అది గర్భంలో బిడ్డనైనా లేదా ఎదిగిన బిడ్డనైనా.

    హవ్వ ఇలా ఎంతకాలం బాధను అనుభవించిందో తెలియదు! కానీ ప్రతిదానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, మరలా కొంతకాలానికి హవ్వను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆమెకు మరొక కుమారుని అనుగ్రహించాడు. అప్పుడు ఆమె మాట్లాడిన మాటలను చూడండి. 

ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. -ఆదికాండము 4:25

    మన దేవుడు బదులు నియమించేవాడు, దేవుడు తన చిత్తానుసారంగా మనం పోగొట్టుకున్న ప్రతి దానికి, అనుభవిస్తున్న ప్రతిదానికి బదులు నియమించే వాడుగా ఉన్నాడు. గర్భస్రావమై తల్లి కాలేకపోయానన్న బాధతో ఉన్నవా? వేదనతో కన్న పిల్లలను సమాధి చేయడం చూడలేకపోయావా? ఎదిగిన కుమారులు పిల్లలు పనికిరాకుండా పోవటాన్ని తట్టుకోలేక పోతున్నావా, గుర్తుంచుకో మన దేవుడు బదులు నియమించేవాడు. 

    బిడ్డల అవసరత నీకుంటే తన చిత్తానుసారంగా దేవుడు వారిని నీకు అనుగ్రహిస్తాడు. కయీను దేవుని సంబంధి కాకుండా పోయాడు, దేవునికిష్టుడిగా ఉన్న హేబేలు మరణించాడు, దేవునిని సేవించే భవిష్యత్ తరం ఎవరనే విషయం ప్రశ్నార్థకమైంది. కానీ దేవుడు షేతును అనుగ్రహించి ఆ లోటును తీర్చాడు. హేబేలు వలే షేతు కూడా దేవుని ఉద్దేశములు నెరవేర్చేవాడుగా జీవించారు, తన కుమారుని భక్తిలో పెంచుతూ గొప్ప ఆత్మీయ ఉజ్జివముకు వారు కారణమయ్యారు. ఒక తల్లి గాని దేని విషయంలో బాధింపబడుతున్నా, దేవుడు నియమించిన బదులు కొరకు ఎదురు చూడు! 

    నీవు బిడ్డలను పోగొట్టుకున్నప్పటికీ దేవుడు మరలా నీకు బిడ్డలను అనుగ్రహించాడా, దానినిబట్టి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించు, అంతేకాదు ఒకప్పుడు నీవున్న స్థితిలో ఈరోజు ఎంతమంది ఉన్నారో వారందరికీ నీ జీవితం ద్వారా దేవుని కార్యములు వివరించుట ద్వారా ఆదరణ కలిగించుటకు తీర్మానించుకో. ఇక ముగింపులో దేవుడు మనం అనుభవిస్తున్న ప్రతి శ్రమలన్నిటికీ బదులు అనుగ్రహించేవాడై ఉన్నాడు ఆ విశ్వాసంతో కుటుంబ జీవితంలోనూ ఆధ్యాత్మిక జీవితంలోనూ ఎదురయ్యే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొందాం, అలాంటి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించును గాక ఆమెన్.

సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును. -యెషయా 61:3

- Rephidim Ministries 

Post a Comment