శారా భర్తకు లోబడింది - సహకరించింది
డాక్టర్ బిల్లీ గ్రహం గారు ప్రపంచ సువార్తికరణ నిమిత్తమై ఆశ కలిగి ఉన్న సమయంలో తన భార్య అయిన రూత్ గ్రహం గారి తోటి మాట్లాడుకున్న విషయాలను ఆలోచిస్తే అవి ఇలా ఉన్నాయి. మీరు సేవ చేయండి నేను కుటుంబాన్ని పిల్లలను నడిపిస్తాను అని ఆవిడ ఆయనతో చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా సేవను గూర్చి తనకు కొన్ని ప్రణాళికలు ఉన్నప్పటికీ తన భర్త కలిగి ఉన్న ఆలోచనల నిమిత్తమై తాత్కాలికంగా వాటిని ఆమె పక్కన పెట్టింది.
ప్రతి పురుషుని యొక్క విజయం వెనక స్త్రీ ఉంటుంది అని నానుడి ఉంది. ఇది శారా జీవితం కూడా సరిగ్గా సరిపోతుంది. గడిచిన భాగంలో మనం నేర్చుకున్నట్టుగానే అబ్రాహాము ఊరు అనే పట్టణంలో ఆయన నివసిస్తుండగానే దేవుడు ఆయనకు తన పిలుపునిచ్చాడు. ఈ పిలుపుకు తాను లోబడాలి అంటే తనవారినందరినీ, తనకు అలవాటు అయిన పరిసరాలను అనుకూల వాతావరణాన్ని విడిచిపెట్టి తాను బయటకు రావాలి. దేవుడు ఆయనకి పిలుపునిచ్చిన సమయానికి అబ్రహాము వివాహితుడిగా ఉన్నాడు. దేవునిని వెంబడించే క్రమంలో వివాహితులకు అవివాహితులకు వ్యత్యాసం ఉంటుంది. ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి తాను తీసుకున్న ఏ నిర్ణయం అయినా స్వతంత్రంగా అమలపరచగల సామర్థ్యం కలిగి ఉంటాడు, కానీ వివాహితుల విషయంలో అది సాధ్యం కాదు.
మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింట నుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురాలైన యెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దాని గూర్చి ఊరకొనిన యెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన యెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువక పోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీద నుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించిన యెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన యెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును. విధవరాలుగాని విడనాడబడినదిగాని తన మీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును. ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కు కొనినయెడల నేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనిన యెడలనేమి, తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలు చును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లను గూర్చియు, ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మ్రొక్కుబడిని, తన్ను తాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దుచేయవచ్చును. -సంఖ్యాకాండము 30:3 -13
కుటుంబము పిల్లలు కలిగిన వారి విషయంలో పరిస్థితి మరోలా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవాలన్న, దానిని అమలు పరచాలన్న ఇక్కడ ఎంతోమందిని ఒప్పించాలి, కొన్నిసార్లు వారికి వ్యతిరేకంగా కూడా కఠినంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు అబ్రహాము జీవితము మినహాయింపు ఏమీ కాదు. దేవుని పిలుపు తనకు కలిగిన తర్వాత తాను ఆ పిలుపుకు స్పందించాలి అంటే మొదటిగా దానిని తన భార్యతోను, తన వారందరితోనూ ఆయన దాన్ని పంచుకోవాలి. అబ్రహాము దాన్ని శారా తోనూ తన వారందరూ పంచుకున్నప్పుడు వారి యొక్క స్పందన ఎలా ఉండి ఉంటుంది? అనుకూల స్పందన వారిలో కలిగిందా? ప్రతికూలంగా వారు స్పందించారా?
ఇలాంటి పరిస్థితుల్లో అవగాహన రాహిత్యం, భవిష్యత్తును గూర్చిన ఆందోళన కలిగిన స్త్రీలు ప్రతికూలంగా ఆలోచించి అమరిక కలిగిన జీవితాన్ని విడిచిపెట్టి ఏమవుతుందో తెలియని అడుగు వేయడానికి ఇష్టపడకపోవచ్చు. చాలామంది భర్తలకు దేవుడిచ్చిన పిలుపుకు లోబడాలి అనే ఆశ ఉన్నప్పటికీ, ఆత్మీయ జీవితంలో మంచిగా ఎదగాలని, పరిచర్యలో పాలు పంపులు కలిగి ఉండాలని ఉద్దేశాలు కలిగినప్పటికీ వారు ఆ విధంగా చేయలేకపోవడానికి చాలాసార్లు భార్యలే కారణం.
భార్యలు ఉద్దేశపూర్వకంగా కారణమవుతున్నారు అని నేను చెప్పడం లేదు కానీ, కొన్నిసార్లు కొంతమంది ఆ విధంగా కూడా కారణమవుతున్నారు. అయితే మరికొన్ని సందర్భాల్లో పైన చెప్పినట్టుగానే వారి యొక్క అవగాహన రాహిత్యం అమరిక గల జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోవటానికి భర్తలు ఆ విధంగా ముందుకు వెళ్ళలేక పోతున్నారు. ఇక్కడ మనం శారా జీవితాన్ని గమనిస్తే దేవుడు అబ్రహాముకు ఇచ్చిన పిలుపును బట్టి ఆమె ఏ విధంగా స్పందించింది?
దర్శనమును పంచుకుంది :
అబ్రహాము తనకు కలిగిన దర్శనాన్ని బట్టి దేవుని పిలుపుకు విధేయుడై ముందుకు సాగుటకు నిర్ణయించుకొనగా దానితో శారా కూడా చక్కగా చేతులు కలిపింది అని మనం చెప్పవచ్చు. కుటుంబాల పట్ల మనం ఒక దర్శనాన్ని కలిగి ఉండాలి, లేదా దర్శనం కలిగిన భార్యతో గాని లేదా భర్తతో గాని మనము ఏకీభవించాలి. మనం దర్శనం కలిగి ఉండకుండా దర్శనము కలిగిన వారితో ఏకీభవించకుండా ముందుకు సాగే ప్రయత్నం మూర్ఖత్వమే.
నిజానికి దేవుడు భర్తను కుటుంబానికి తలగా ఏర్పాటు చేశాడు. కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత భర్త మీద ఉన్నది. దైవికమైన ఉద్దేశాలు తను కలిగినవాడై, దేవుని దర్శనమును పొంది కుటుంబమును తాను నడిపించవలసి యున్నది. తనకు కలిగిన దైనిక ఉద్దేశాలను బట్టి దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని బట్టి భర్త కుటుంబాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు భార్య దానికి లోబడకపోతే, భర్త కలిగి ఉన్న దర్శనాన్ని పంచుకోకపోతే ఆ కుటుంబంలో ఆ దర్శన నెరవేర్పును మనం చూడలేం. కాబట్టి అబ్రహాము దేవుని దర్శనాన్ని బట్టి తాను ముందుకు వెళ్ళగలిగాడు అంటే ఖచ్చితంగా శారా ఆ దర్శనాన్ని పంచుకుంది అని చెప్పొచ్చు.
ప్రియ సహోదరి, ఆత్మీయుడైన భర్తను నీవు కలిగి ఉన్నావా? దైవికమైన ఉద్దేశాలతో నీ భర్త నిన్ను నీ కుటుంబాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తుండగా నీవు నీ భర్త యొక్క దర్శనముతో చేతులు కలిపి ముందుకు సాగుతున్నావా? ఆలోచించుకో.
సహకరించింది :
తెర ముందు ప్రత్యక్షమయ్యే చాలామందిని ఎంతో బాగా మనం మెచ్చుకుంటూ వారిని ఘనపరిచే వారం గా ఉంటూ ఉంటారు, కానీ వారాల తెర ముందుకు రాగలిగారంటే తెర వెనుక ఉన్న ఎంతోమంది పడుతున్న కష్టం కారణమనే సంగతి చాలా సందర్భాల్లో గ్రహించము.
మనం కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ రచయిత కృతజ్ఞతలు తెలిపే వారిలో చాలా సందర్భాల్లో తన భార్య పేరు రాయడం జరుగుతుంది, పుస్తకాన్ని కష్టపడి రాసింది భర్త అయితే మరి అక్కడ భార్య పేరు ఎందుకు అని చాలా కాలం పాటు అది అర్థం కాలేదు, కానీ నిజానికి మనం ఆలోచిస్తే ఆ రచయితలు ప్రస్తావించినట్టుగానే ఈ పుస్తకం రాయడానికి భార్య భర్తకు సమయాన్ని ఇవ్వకపోతే, తగినంత పరిశోధన చేయడానికి వెసులుబాటు కల్పించకపోతే ఆ పుస్తకము వెలుగు చూడడం అసాధ్యం.
ప్రత్యక్షంగా తన మాటలు అందులో ఆమె చేర్చలేకపోవచ్చు, కానీ పరోక్షంగా ఆమె సహకారం లేనిదే అది సంపూర్ణం కాదనేది సత్యం. భర్త తీసుకునే నిర్ణయాల్లో చేయదలచిన పనులన్నిటిలో భార్య యొక్క సహకారం ఎంతో అవసరం. ఒక పని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టాలన్న కొన్నిటితో తెగతెంపులు చేసుకోవాలన్న ఉభయుల సమ్మతి తప్పనిసరి. ఈ విషయాలు తెలుసుకుంటుండగా నీ భర్తకు నీవు సహకరిస్తున్నావా? ఆయన ముందుకు వెళ్లడానికి నీవు తోడ్పడుతున్నావా? ఆయనను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నావా?
భర్తకు లోబడింది :
ఈ ఆత్మీయ ప్రయాణంలో అబ్రహాము తీసుకున్న అన్ని నిర్ణయాలు శారాకు ఇష్టంగా అనిపించాయా? ఏమో అనిపించకపోయి ఉండొచ్చు కూడా. దేవుడు అబ్రహాముకిచ్చిన పిలుపుకు తాను సంపూర్ణంగా లోబడలేక పోవడానికి కారణం అబ్రహామా? శారానా లేక ఆయన కుటుంబమా?? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మని దేవుడు అబ్రహంతో చెప్తే అబ్రహాము తన తండ్రి అయిన తెరహును, తన అన్న కుమారుడైన లోతును వెంటబెట్టుకుని వచ్చాడు. దీనికి కారణం ఎవరనుకోవాలి? బంధువులను విడిచి పెడుతున్న వారు, తండ్రి ఇంటి సంబంధీకులను కూడా విడిచి పెట్టాలంటే మనసు అంగీకరించక ఇలా చేశారా? ఇందులో శారా ప్రమేయం ఏమైనా ఉన్నదా? మనకు తెలియదు, బైబిల్ ఈ విషయాల్లో మౌనంగా ఉన్నది.
కానీ శారా జీవితాన్ని మొత్తాన్ని పరిశీలిస్తే ఆమె ఎక్కువ సందర్భాల్లో తన భర్త మాటకు విధేయురాలుగా ఉన్నట్టు, పరిస్థితి ఏదైనా ఆయనకు అప్పగించుకున్నట్టు మనం చూడవచ్చు. ఒకవేళ దేవుని పిలుపుకు సంపూర్ణంగా లోబడలేకపోవటానికి ఇక్కడ శారా ఒక కారణమైనప్పటికీ మనకు ఒక పాఠాన్ని ఆమె నేర్పిస్తుంది.
నీకు నచ్చిన నచ్చకపోయినా దైవిక క్రమానికి లోబడి నీ భర్తకు నీవు లోబడటం మంచిది. దేవునిని ఆయన వెంబడించుటలో కుంటివాడు కాకుండునట్లుగా ఆయన కలిగి ఉన్న దర్శనాన్ని పంచుకొని, ఆయనకు సహకరిస్తూ ఆయనకు లోబడుతూ ముందుకు సాగడం ఎంతైనా మంచి విషయమై ఉన్నది.
ఈ అంశమును మనం ముగించడానికి ముందు ఈ ఆఖరి విషయాన్ని ఆలోచిద్దాం, అబ్రహాము తన ఆత్మీయ ప్రయాణంలో ఎప్పుడైనా కృంగిపోయాడా? బలమైన వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఆయన కనబడుతున్నాడు, కృంగిపోయిన సందర్భాలు ఉండొచ్చేమో కానీ స్పష్టంగా మనకు తెలియపరచబడలేదు. అయితే తన భర్త క్రుంగిపోయినప్పుడు, ఒక భార్యగా శారా ఆయనను ఖచ్చితంగా ప్రోత్సహించి ఉంటుంది అని మనం భావించవచ్చా?? ఆలోచించండి.
పునర్విమర్శ ప్రశ్నలు :
- దేవుని విషయంలో ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని, దానికి ఆయన కుటుంబం నుండి కలిగే స్పందనలను సంఖ్యాకాండం 30: 3-13తో పోల్చి చూడండి.
- భార్యగా శారా తన భర్త విషయంలో తాను ఎలా వ్యవహరించిందో మూడు విషయాలు తెలపండి.
- శారా నిన్ను వ్యక్తిగతంగా ఏ విషయంలో సవాలు చేస్తున్నది?

కామెంట్‌ను పోస్ట్ చేయండి