దేవునిని వెంబడించిన శారా


శారా

దేవునిని వెంబడించిన శారా

మా నాన్నగారి పరిచర్య రీత్యా మేము అనేక ప్రాంతాల్లో నివసించాల్సి వచ్చింది, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ప్రియులను పరిచయస్తులను విడిచి పెట్టాల్సి వచ్చినప్పుడు ఎంతో బాధ కలిగేది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారుతూ ఉన్నప్పుడు మాకుండే సౌకర్యాలు కూడా మారిపోతూ ఉండేవి. ఈ క్రమంలో మేము రకరకాల ఇండ్లలో ఉండాల్సి వచ్చేది.

సరిగ్గా నాలుగువేల సంవత్సరాల క్రితం ఒక అత్యంత ధనవంతురాలు ఉండేది. వారి ఆస్తిపాస్తులకు వ్యాపారాలకు లోటు లేకుండా ఓ పెద్ద కుటుంబంతో చక్కని జీవనాన్ని గడుపుతున్నారు. వారు ఉంటున్న ఊరు అనే ప్రాంతం వ్యాపారాలకు అనువైన ప్రాంతంగా ఉండేది. ఒక మంచి ఇల్లు, ప్రేమించే కుటుంబం, పరిచయస్తులైన అనేకమంది మనుషులు, వారితో చక్కని స్నేహబంధం ఈ జీవితానికి ఇది చాలా నొప్పిగా అనిపిస్తున్న పరిస్థితుల్లో తన భర్తను దేవుడు దర్శించడం జరిగింది. 

దేవుడు తన భర్తను దర్శించి తాను ఉంటున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళమని చెప్పడం జరిగింది. వారికి ఆస్తి ఉంది కానీ పిల్లలు లేరు, ఇప్పుడు వారికి ప్రత్యక్షమైన దేవుడు తాము ఆరాధిస్తున్న సూర్యచంద్రుల దేవుడు వంటి వాడు కాదు, ఆయనే నిజమైన దేవుడు. ఆయన మాట చొప్పున చేస్తే వారికి సంతానాన్ని ఇవ్వడమే కాకుండా వారిని గొప్ప జనముగా చేస్తానని తెలియపరిచాడు.

ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పుడు కుటుంబాన్ని విడిచి పెట్టాలా? మేము ఉంటున్న ప్రాంతాన్ని విడిచి పెట్టాలా? వ్యాపారాన్ని వదులుకోవాలా? ఇక్కడ అంతా మంచిగానే ఉంది కదా, మేము వెళ్లే ప్రాంతం ఎలా ఉండబోతుందో, అక్కడ మనుషులు ఎలా ఉంటారో, మేము ఎక్కడ ఉండాల్సి వస్తుందో, ఇవన్నీ ఖచ్చితంగా ఒక స్త్రీకి కలిగే ప్రశ్నలు. మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటున్న వ్యక్తి పేరు శారా. శారాకు కూడా ఖచ్చితంగా ఈ ప్రశ్నలు కలిగి ఉండొచ్చు, కానీ ఆమె దేవుడిని నమ్మింది అని చెప్పొచ్చు

దేవునిని వెంబడించింది

 విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను. -హెబ్రీయులకు 11:11

 దేవతలను విడిచి నిజ దేవునిని వెంబడించింది:

వీరు సూర్యచంద్రులను దేవునిగా ఆరాధించేవారని చరిత్ర తెలియజేస్తున్నది. తెరహు విగ్రహాలు తయారు చేసేవాడని కూడా యూదులు చెప్తుంటారు. తన భర్త దేవుని ప్రత్యక్షత పొందిన తర్వాత తాను ఆరాధిస్తున్న అసత్య విధానాలను విడిచిపెట్టి నిజ దేవుని వెంబడించడానికి తాను తీర్మానం చేసుకున్నది. మన జీవితంలో మనం దేవుని ఎరగకముందు ఏ విధంగా ఉన్నా, సత్యము మనకు తెలియపరచబడిన తర్వాత దానికి లోబడి మన అసత్య విధానాలన్నిటిని విడిచిిిపెట్టవలసిన వారమైయున్నాము. థెస్సలోనిక లో ఉన్న సంఘం ఇదేవిధంగా చేసింది

మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియ జెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవముగలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, -1 థెస్సలొనికయులకు 1:9

ప్రతి స్త్రీ మొదటిగా దేవునిని వెంబడించేదిగా ఉండాలి, తన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, దేవునిని ప్రేమించేదిగా, దేవుని ఆజ్ఞలను పాటించేదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ జీవితం ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది, అలా ఉండలేకపోయినా హవ్వ ఏ విధంగా పతనం చెందిందో గడిచిన భాగంలో మనం నేర్చుకున్నాము.

 ప్రియ సహోదరి నీ జీవితంలో నిజ దేవుడు ఎవరో గుర్తించావా? నీ జీవితంలో దేవునిని ప్రేమిస్తూ ఆయనను వెంబడించే వ్యక్తివిగా ఉన్నావా? దేవుని వెంబడించే ఈ జీవితం, మన కుటుంబాలలో మన బాధ్యతలు సరిగా నెరవర్తించుటకు సహాయం చేస్తుంది.

పిల్లలు లేకపోయినా…. వెంబడించింది

శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానము లేదు. -ఆదికాండము 11:30

చాలామంది దేవునిని వెంబడించే క్రమంలో మొదట తమకు దేవుడు ఏదైనా మేలు చేస్తే ఆ తర్వాత ఆయనను వెంబడిస్తామనే కలిగి ఉంటారు, దేవుడిచ్చిన వాగ్దానాల మీద వారు విశ్వాసముంచక, మొదట దేవుడు వారు కోరుకున్నదేదో వారికి చేయాలని ఆశిస్తారు. ఇక్కడ శారా విషయం కూడా మనం ఆలోచిస్తే , దేవుడు తమకు పిల్లలను ఇస్తానని చెప్పిన తర్వాత, మొదట మనకు దేవుడు పిల్లల్ని ఇస్తే ఆ తర్వాత మనం ఆయన చెప్పిన మాట విందాము అని ఆవిడ భావించి ఉండొచ్చు, అంతేకాదు దేవునిపై విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టుగా మనం ఇక్కడి నుండి బయలుదేరి వెళ్తే దేవుడు చేస్తానన్నది చేయకపోతే మనము విడిచిపెట్టి త్యాగపూరితంగా ఆయనను వెంబడించినందుకు ప్రయోజనం ఏంటి? అని శారా ఆలోచించలేదు. హెబ్రీ గ్రంథకర్త ఆమెను గూర్చి చెప్పినట్టుగానే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని నమ్మింది.

తండ్రిని కోల్పోయినప్పటికి దేవునిని వెంబండించింది.

ఏ ఆడపిల్ల జీవితంలోనైనా తండ్రి మీద అమితమైన పెంచుకునేవారుగా ఉంటారు. ఈ జీవితం ఒక ప్రయాణం కనుక ఇందులో కొంతమందిని మనం ఖచ్చితముగా కోల్పోతాము. శారా జీవితంలో కూడా కొంత దూరం వచ్చిన తర్వాత తన తండ్రియైన తెరహును కోల్పోవడం జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు వారు హారాను లో ఉన్నారు. నిజముగా తనను ఓదార్చువారు ఎవరూ ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తన వారందరిని ఊరు లో వదిలిపెట్టి వచ్చారు కదా! అయినా దేవునితో తన ప్రయాణమును కొనసాగించింది.

మన జీవితంలో మనము ఎంతో మందిని కోల్పోయినప్పటికి మనం దిగులు చెందక, దూషించక, సణగక ముందుకు సాగేవారముగా ఉండాలి. 


విశ్వాసంతో వెంబడించింది

దేవుని యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తి ఆయన ఉన్నాడని, తనను వెదకే వారికి ఫలము దయ చేస్తాడని నమ్మాలి.

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. -హెబ్రీయులకు 11:6

దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి తన విశ్వాసాన్ని క్రియలలో చూపించవలసి యున్నది.

ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. -యాకోబు 2:17

ఇక్కడ శారా దేవుని యందు విశ్వాసముంచింది అని అనడానికి రుజువు ఏంటి అంటే తాను తాను ఉంటున్న ప్రాంతాన్ని దేవుని మాట చొప్పున విడిచి పెట్టడం.

దేవునిని వెంబడిస్తున్న ప్రియా సహోదరి, ఆయన ఉన్నాడని నమ్ముతున్నావా? విశ్వాసంతో ఆయనను వెంబడిస్తున్నావా? ఫలము దయ చేస్తాడని ఆయనను వెంబడిస్తున్నావా? విశ్వాసమును బట్టి దేవుడు నీ యొద్ద నుండి ఏమి కోరుతున్నాడో దానిని జీవితంలో కనబరుస్తున్నావా?

గుడారాల్లో నివసిస్తూ వెంబడించింది

శారా భర్త అయినా అబ్రహాము ఉంటున్న ఊరు అనే ప్రాంతంలో వారికి ఒక డూప్లెక్స్ హౌస్ ఉండేదని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇప్పుడు దేవుని మాట చొప్పున ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన శారా, దేశదిమ్మరుల వలె అనేక ప్రాంతాలు తిరుగుతూ, వారి భవిష్యత్తు జీవితం అంతా దాదాపు 62 సంవత్సరాల పాటు గుడారాల్లోనే నివాసాన్ని కొనసాగించారు. వారు సుదీర్ఘంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ స్థలము కొనగల ఇల్లు నిర్మించుకునే ఆర్థిక సామర్థ్యం వారికి ఉన్నప్పటికీ పునాదులు గల పట్టణము కొరకు ఎదురుచూస్తూ ఈ లోకము శాశ్వతము కాదని మాటిమాటికి జ్ఞాపకం చేసే గుడారాల్లోనే వారు నివసించారు. ఖచ్చితంగా మంచిగా నిర్మించబడిన ఒక ఇంటిలో ఉన్న అన్ని వసతులు, గుడారంలో సాధ్యం కాదని మనము గ్రహించవచ్చు.

విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి. -హెబ్రీయులకు 11:9

దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న మనం అందరం, శారా జీవితాన్ని ఒక వైపు చూస్తూ ఆయన కొరకు మనము ఏమి విడిచిపెట్టాం? అనేదాన్ని లోతుగా ఆలోచిద్దాం. ఈ అంశంలో నేర్చుకున్న దాన్నిబట్టి ఏమున్నా లేకపోయినా, అవి దేవుని వద్ద నుండి పొందుకునే అంతవరకు వాటి కొరకు ఎదురు చూడక, ఆయన ఇచ్చిన పిలుపును నెరవేర్చుటకు, విశ్వాసంతో త్యాగపూరితంగా దేవునిని వెంబడించుటకు తీర్మానించుకుందాం.

కార్యాచరణ : 

 దేవునిని వెంబడించుటకు గాను దేవుడు నిన్ను విడిచి పెట్టమన్న విషయాలను (నీకు అవగాహన ఉన్నంతలో) రాసుకుని వాటిలో నీవు ఇప్పటికి ఎన్నింటిని విడిచిపెట్టావో, ఇంకా ఎన్నింటిని విడిచి పెట్టవలసి ఉన్నదో, ఆలోచించుకొని , విడిచి పెట్టవలసిన ఇతర అంశాలను విడిచిపెట్టుటకు తీర్మానం చేసుకొని దేవుని సహాయాన్ని అందుకొరకు కోరుకొనండి.

పునర్విమర్శ లేదా చర్చించుట కొరకు ప్రశ్నలు :

- ఫీబే సమూయేలు 

Post a Comment