![]() |
| Eve -4 |
అవిధేయతను కనపరిచిన హవ్వ
విశ్వాసము విధేయతను తీసుకొస్తుంది, అవిశ్వాసము అవిధేయులుగా మారుస్తుంది. సాతాను మన మనసులు పై దాడి చేసి దేవుని వాక్యం పట్ల ఆయన మంచితనం పట్ల అనుమానాలు కలుగజేసి, మన విశ్వాసాన్ని దెబ్బ తీసి, తన మోసపు మాటలు మనము నమ్మునట్లు చేసి మన కళ్ళు మనమే పొడుచుకునే విధంగా చేస్తాడు. సాతాను మొదట మనలను మోసం చేసి ఆ తర్వాత నాశనం చేస్తాడు. దేవుని వాక్యం పట్ల అవిశ్వాసాన్ని కనబరిచిన హవ్వ అవిధేయత ద్వారా పతనం చెందడానికి తర్వాత స్థాయికి వెళ్ళిపోయింది. హవ్వ ఎందుకు ఎలా అవిధేయత చూపిందో తెలుసుకుందాం రండి.
అవిధేయతకు కారణం
ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా -ఆదికాండము 3:5
దేవుని స్థానాన్ని కోరుకొనడం
లూసిఫర్ దేవుని స్థానమును కోరుకొని తన సైన్యంతో పాటుగా పరము నుండి పడద్రోయబడ్డాడు. ఇప్పుడు భూలోకంలో మనుషులందరూ తనను దేవునిగా ఆరాధించునట్లు, లేదా మనుషులు తమను తాము దేవునిగా భావించుకొనునట్లు చేయడంలో తీరిక లేకుండా ఉన్నాడు.
హవ్వకు చెప్పిన అబద్ధాలే మనకును చెబుతూ మోసగిస్తూ తన ఆలోచనను నెరవేర్చుకుంటున్నాడు. ఇప్పటివరకు హవ్వ కళ్ళు మూయబడినట్లుగా, ఆ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పాడు, ఇప్పుడు వారు అజ్ఞానులుగా ఉన్నట్లుగా మీరు ఆ పండు తింటే జ్ఞానులైపోతారు అని చెప్పాడు. మీరు దేవుని లాగా ఉంటారు అని చెప్పాడు.
దేవుడు అప్పటికే మనిషికి ఆయన స్వరూపాన్ని అనుగ్రహించాడు, తన జ్ఞానమును మనుషులలో నింపారు. ఇంకా అవసరమైతే దేవునిని అడిగితే అది ఎంతైనా ఆయన వారికి అనుగ్రహిస్తాడు, కానీ ఈ లోగానే సాతాను చేస్తున్నటువంటి మోసం మనుషులను ఏ వైపు నడుపుతున్నదో ఆలోచించండి
మనము దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి చెంది జీవించాలి, ఆయన ఇచ్చిన వాటిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, మనకు ఇవ్వబడిన స్థానములలో నమ్మకంగా దేవుని సేవించాలి, మనకు నియమింపబడని వాటిని అపేక్షించి దాని వలన కలిగే ప్రయోజనాలను పొందాలని ఆశించకూడదు, మనము ఎప్పటికీ దేవుని స్థానమును కోరుకొనకూడదు.
ఓ రకంగా చెప్పాలంటే సాతాను తాను ఏమైతే చేయలేకపోయిందో దానిని హవ్వను చేయమన్నట్లుగా ప్రోత్సహిస్తున్నది. హవ్వ ఎదుర్కొన్న ఈ శోధనను నేడు అనేకులు ఎదుర్కొంటున్నారు, నీవు కూడా ఒకవేళ ఈ అంశాలు శోధింపబడుతున్నావేమో ఆలోచన చేసుకో.
అవిధేయత చూపిన విధానం
స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను; -ఆదికాండము 3:6
సాతాను అవిధేయత చూపడానికి మనలను ప్రోత్సహిస్తాడు కానీ ఎట్టకేలకు ఆ చర్యలో మనము పాలు పుచ్చుకునే విధంగా ఆయన చేయలేడు. హవ్వ ఇక్కడ తనకు తానుగా అవిధేయత చూపింది. తనకు రెండు స్వరాలు వినబడ్డాయి, ఏ స్వరానికి లోబడి నడుచుకోవాలని తన చేతుల్లో ఉన్న విషయం. హవ్వ సాతాను మాటకు లోబడాలని నిర్ణయించుకొని ఆ క్రమంలో తాను చూడడం, ఆశించడం, తీసుకోవడం చేసింది.
నాటినుండి నేటి వరకు మన పతనంలో ఈ మూడు మెట్లు ఉంటూనే ఉన్నాయి. పతనము చెందిన అనేకులు చూడడంతోనే ప్రారంభించి, దాని మూలంగా ఆశలు పెంచుకొని, చేయి చాచి వాటిని దొంగతనంగా తీసుకుని దేవునికి అవిధేయత చూపారు. ఏమి చూస్తున్నాము మనం జాగ్రత్త వహించాలి, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పివేయుము అని దేవుని ప్రార్థించాలి మన కన్నులు తిప్పి వేసుకునే వారంగా కూడా ఉండాలి మన కన్నులతో ఒక నిబంధన కలిగి జీవించే వారం గా ఉండాలి.
హృదయంలో కలిగే ప్రతి వ్యర్థమైన ఆశలకు అవునని చెప్పవద్దు, న్యాయబద్ధము కానీ ఏ కోరికకు లొంగిపోవద్దు. దేవుడు మనకు ఇచ్చే వరకు వేచి చూద్దాం, దేవుని పిల్లలమైన మనము దొంగతనంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి? బహుశా హవ్వ ఇక్కడ భయపడుతూ భయపడుతూ ఆ పండును తీసుకొని ఉండి ఉండొచ్చు. ఇక్కడ ఆమె తీసుకుని తినడం మాత్రమే కాకుండా ఆదాముకు కూడా దాన్ని ఇచ్చింది.
సాతాను ఆదామును శోధించలేదు కారణమ బాధ్యతను హవ్వ తీసుకున్నది కనుక. సాతాను ఒక వైపు అంటించి మౌనంగా సంతోషంగా ఆ నాటకం అంతటిని చూస్తూ ఉండి ఉంటాడు. మన జీవితాలు పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి, అయితే సాతాను వాటిని మనం నెరవేర్చకుండా మనలను పాడు చేసి నాశనం చేయడానికి హవ్వ దగ్గర వాడిన అవే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే అస్త్రాలను ఉపయోగిస్తూ ఉన్నాడు కనుక జాగ్రత్త పడదాం.
అవిధేయత ఫలితం
అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి. -ఆదికాండము 3:7
బహుశా ఆ పండు తినకముందు, తింటున్న సమయంలో ఈ క్షణం తర్వాత తన జీవితం సంపూర్ణంగా మారిపోతుంది అని హవ్వ భావించి ఉండవచ్చు. నిజంగానే హవ్వ జీవితం మారిపోయింది, కానీ అది మంచికి మారిందా? చెడుకు మారినదా?
ఆ పండు తింటే జ్ఞానం కలుగుతుందని హవ్వ దాన్ని తీసుకున్నది, కానీ తాను పొందుకున్న జ్ఞానం ఏంటి, దిగంబరిని అనే జ్ఞానమే. సర్పము తనను మోసం చేసిందన్న సంగతి హవ్వకు మెల్లగా అర్థమైంది.
అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను. -ఆదికాండము 3:13
మోసపోయిన హవ్వ ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు, కానీ ఆమె జీవితం మన ఎదుట ఒక పాఠం గా ఉన్నది. త్వరపడి ఈ పాఠమును నేర్చుకుందాం. అపవాదికి చోటివ్వక, దేవుని ఆజ్ఞలను చులకన భావంతో చూడక, దేవుని పట్ల అవిశ్వాసమును, అవిధేయతను కనబరచక మన ఆత్మీయ జీవితాలను భద్రపరుచుకొనుటకు జాగ్రత్త పడదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.
- Rephidim Ministries

ఆమెన్
రిప్లయితొలగించండికామెంట్ను పోస్ట్ చేయండి