అవిశ్వాసమును కనబరిచిన హవ్వ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడైన బిల్లీ గ్రహం గారు ఒక సందర్భంలో ఇలా అన్నారు " బైబిల్ లో చేప యోనాను మింగింది అని రాయబడింది, నేను దాన్ని సంపూర్ణంగా నమ్ముతున్నాను, అంతేకాదు అదే బైబిల్లో యోనా చేపను మింగాడు అని రాయబడినా నాకు నమ్మడానికి ఎలాంటి అభ్యంతరం లేదు " అని చెప్పాడు. ఈ మాటలు తనకు దేవుని వాక్యం పట్ల ఉన్న విశ్వాసాన్ని తెలియపరుస్తున్నాయి.
దేవుని నోట నుండి వచ్చిన మాట ఏదైనా అది ఎంత సత్యమైనదో ఎంత ఖచ్చితమైనదో దాని విషయంలో దేవుడు ఎంత నమ్మకంగా ఉంటాడో మనం తెలుసుకొనవలసి ఉన్నది. దేవుని వాక్యం పట్ల ఇలాంటి అచంచలమైన విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు వారి జీవితంలో ఎన్నడూ కదలింపబడరు. సాతాను ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన అలాంటి వారిని పడగొట్టడం అంత సులువు కాదు. ఎవరైతే దేవుని వాక్యం పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచరో వారు ఖచ్చితంగా సాతానుకు ఎరవుతారు. సరిగ్గా హవ్వ జీవితంలో అదే జరిగింది.
సాతాను మాటలను నమ్మింది :
అందుకు సర్పము మీరు చావనే చావరు - ఆదికాండము 3:4
హవ్వ సాతానుతో తన సంభాషణను కొనసాగిస్తూ దేవుని ఆజ్ఞలకు కలుపుతూ, కుదిస్తూ చులకన చేస్తూ, ఆ పండును తింటే మేము చనిపోతామంట అని మాట్లాడిన సందర్భంలో సాతాను చక్కెర పూసిన అబద్ధాన్ని చాలా చక్కగా చెప్పింది, అదే " మీరు చావనే చావరు "అనే మాట.
ఎవరికైనా ఇక్కడ కొంత విచక్షణ కావాలి, ఎవరి మాట నమ్మాలి? తనను ప్రేమించి, సృజించి పోషిస్తూ కాపాడుతూ తనతో చక్కని సహవాసము కలిగి ఉన్నా దేవుని మాటలను నమ్మాలా? లేదా సాతాను మాటలు నమ్మాలా?
నేడు మోసపోతున్న అనేక మంది యువతులను చూడండి, 20 ఏళ్ల పాటు కని పెంచిన తల్లిదండ్రుల మాటల కంటే 20 రోజుల క్రితం పరిచయమైన ప్రియుడి మాటలు తియ్యగా ఉంటాయి కదా, నరకప్రాయమైపోతున్న కుటుంబాలు, విచ్ఛిన్నమవుతున్న సంబంధాలు బలైపోతున్న అనేక మంది యువతులను చూస్తుంటే చాలా బాధ కలుగుతున్నది.
సత్యం చెప్పులు తొడుగుకునే లోపల అసత్యం ఊరంతా తిరిగి వచ్చింది అనే సామెత ఉండేది, నిజానికి మనలో అనేకులు అసత్యాన్ని నమ్మినంత త్వరగా సత్యాన్ని నమ్మము. చెడును అంగీకరించినంత త్వరగా మంచిని అంగీకరించము. మోసం చేసే వారిని నమ్మినంత త్వరగా నమ్మకస్తులను నమ్మము. చెడ్డవాడిని నమ్మినంత త్వరగా మంచివాన్ని నమ్మము.
దేవుని వాక్యం పట్ల ఉన్న భయము నిన్ను ఇప్పటివరకు పవిత్రతలో నడిపిస్తున్నట్లయితే, "పర్వాలేదులే ఒక్కసారికి ఏమీ కాదులే " అని సాతాను తన అనుచరులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ చెవిలో చెప్పే అసత్యాలను నమ్మకుండా ఉండుటకు జాగ్రత్త పడు.
ఇక్కడ పూర్తిగా హవ్వ విశ్వాసం దేవుని వైపు నుండి సాతాను మాటలు వైపుకు మళ్ళింది, నేటికీ అనేక మంది అదే దుస్థితిలో ఉన్నారు అలాంటి వారిలో నీవు చేరవద్దు, అలా చేరిన వారిని అగ్నిలో నుండి లాగినట్టు బయటకు లాగే ప్రయత్నం చెయ్.
ఇక్కడ సాతాను చెప్పిన మీరు చావనే చావరనే మాట అర్థసత్యం. వారు ఆ పండు తిన్న వెంటనే ప్రాణమైతే పోదు, కానీ ఆత్మీయంగా మరణించేవారుగా ఉంటారు. సాతానుకు రెండవ విషయం కూడా తెలుసు కానీ మోసగించడానికి కేవలం సగం విషయమే చెప్పడం జరిగింది. మన జీవితాలను పాడు చేయడానికి సాతాను చెప్పే అర్థసత్యములను నమ్మక, మనకు మేలుకరంగా దేవుడు రాయించి ఉంచిన సర్వ సత్యమును సంపూర్ణ సత్యమును విశ్వసించి దీవించబడేవారుగా ఉందాం.
దేవుని మంచితనాన్ని అనుమానించింది
ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా -ఆదికాండము 3:5
మీరు ఆ పండు తిను దినమున దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు అని సాతాను చెప్పడం జరిగింది. ఇక దానినిబట్టి దేవుడు తన యొద్ద నుండి ఏదో దాచిపెడుతున్నట్టుగా హవ్వ భావించడం జరిగింది. విశ్వాసం అంటే ఒక రకంగా మనలను అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకొని ఆయనను నమ్మడమై ఉన్నది. దేవుడు మంచివాడని నమ్మిన ఏ వ్యక్తి అయినా దేవుడు తనకు అన్యాయం చేస్తాడని గాని, మేలుకరమైనది ఏదైనా తనకు దూరం చేస్తారని గాని భావించరు. ఒకవేళ నిజంగా దేవుడు అన్యాయం చేసినా, మేలుకరమైన కొన్నిటిని దూరం చేసినా వాటి వెనక దేవునికున్న మంచి ఉద్దేశ్యముల యందు విశ్వాసముంచి ఒక విశ్వాసి కొనసాగే వారుగా ఉంటారు.
మా నాన్నగారు ఒక మాట చెబుతూ ఉండేవారు అదేమిటంటే దేవునిని సంపూర్ణంగా నమ్మిన వ్యక్తికి ఇక చక్కలిగిలి ఉండదు అని అంటాడు. దేవుడు కొన్ని నీకు దూరం చేసినా, కొన్నిటిని నీకు ఇంకా దగ్గర చేయకపోయినా దేవుని మంచితనం యందు నీవింకను విశ్వాసముంచుతున్నావా? ఇంకా ఎంతకాలం అనుమానాలతో అసత్యాలను నమ్ముతూ మోసపోతారు?? సత్య వాక్యము యందు స్థిరమైన విశ్వాసం నేర్పరచుకో కదిలింప పడకుండా నిన్ను నడిపించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి