ప్రోత్సహించు దేవుడు

ప్రోత్సహించు దేవుడు

(యెహోషువ 1-7)

 ఇశ్రాయేలీయుల చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసింది. ఒక అద్భుతమైన నాయకుడు తన నాయకత్వం నుండి  విరమించుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు, ఇప్పుడు వారికి ఒక నాయకుడు కావాలి. 

ఆ అద్భుతమైన నాయకుడు తాను వైదొలగక ముందే తన స్థానంలో ఒక నాయకున్ని ఏర్పాటు చేసినప్పటికీ, ఆ నాయకుడు ఇప్పుడు ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టలేదు. 

ఈ పరిస్థితుల్లో  దేవుడు ఆ నాయకుడ్ని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశారు   నిజంగా మన దేవుడు మనలను ప్రోత్సహించువాడై ఉన్నాడు, మోషే స్థానంలో నాయకుడుగా నియమించబడిన యెహోషువను  ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా ప్రోత్సహించాడో తెలుసుకుందాం రండి. 

మాట ద్వారా (1,2)

 దేవుని యొక్క మాట ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది, యెహోషువ గ్రంథం  మొదటి రెండు అధ్యాయాల్లో మాట ద్వారా కలిగిన ప్రోత్సాహాలను మనం చూడవచ్చు.  

దేవుడే మాట్లాడి ప్రోత్సహించాడు

యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన మోషే మృతినొందెను. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. -యెహోషువ 1:1-3

 మోషే మరణం ఇశ్రాయేలు ప్రజలను మరి విశేషంగా యెహోషువాను ఎంతో కలత పెట్టి ఉండవచ్చు.  ఆయన యొక్క మరణాన్ని బట్టి కొంతకాలం దుఃఖపడినప్పటికీ , ఇప్పుడు తేరుకొని వారి ఎదుట ఉన్న ప్రయాణాన్ని కొనసాగించాలి. 

ఇదే విషయాన్ని దేవుడు యెహోషువకు తెలియజేస్తూ ఆయనను ప్రోత్సహిస్తూ పై మాటలు చెప్పాడు. దేవుడు చెప్పిన ఈ మాటల్లో ఆజ్ఞ ఉన్నది ఆయన ఇచ్చే భరోసా కూడా ఉన్నది.

 దేవుడు నేటికీ కూడా మనల్ని అందరినీ తన మాటలు చేత ప్రోత్సహిస్తున్న వాడుగా ఉన్నాడు. దేవుని మాటలను బట్టి ప్రోత్సహించబడి  ఆయన ఆజ్ఞలను నెరవేర్చుటకు ముందుకు కొనసాగుదాం. 

వాగ్దానం ఇచ్చి ప్రోత్సహించాడు

నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. -యెహోషువ 1:5,6

 దేవుడు యెహోషువకు గొప్ప వాగ్దానం ఇచ్చి ప్రోత్సాహాన్ని కనబరిచాడు.  మీరు వెళ్ళండి ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాను అని చెప్పిన దేవుడు ఈ వచనంలో మరింతగా తన మాటల ద్వారా  యెహోషువను ప్రోత్సహించాడు. మోషేకు తోడైయుండినట్లు తోడై ఉంటానని చెప్పాడు, తనను విడిచి పెట్టనని  ధైర్యంగా ఉండాలని ఉండమని కూడా ప్రోత్సహించాడు. అన్నిటికి మించి భవిష్యత్తును తెలియజేశాడు , యెహోషా వలన సాధ్యపడే విషయాలను తెలియపరచడం జరిగింది.

 దేవుని వాగ్దానాలు మన జీవితంలో ఎంతో ప్రోత్సాహాన్ని మనకు కలిగించాలి. యెహోషువకి ఇవ్వబడిన వాగ్దానం  మనము స్వతంత్రించుకోనగలము. ప్రభువైన ఏసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా సదా కాలం నీతో కూడా ఉన్నానని చెప్పాడు. కాబట్టి మనము దేవుని వాగ్దానముల మీద ఆనుకొని ఆయన కార్యములు కొరకై  ముందుకు కొనసాగే వరంగా ఉండాలి. 

ప్రజల విధేయత తీర్మానం ద్వారా ప్రోత్సహించాడు

అందుకు వారు నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము;  మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును గాక. -యెహోషువ 1:16,17

 యెహోషువతో దేవుడు తెలియజేసిన మాటలను  యెహోషువా ఇశ్రాయేలు ప్రజలతో పంచుకున్నాడు. అయితే ప్రజలు యొద్ద నుండి వచ్చిన స్పందన కూడా యెహోషువలో చాలా గొప్పగా ప్రోత్సహించి ఉంటుందని చెప్పవచ్చు. 

మేము మోషేను ఏ విధంగా గౌరవించామో  ఆయనకే విధంగా లోబడ్డామో నిన్ను కూడా ఆ విధంగా గౌరవించి నీ మాట వింటాము నీకు లోబడతాము అని ప్రజలు తెలియజేయడం మాత్రమే కాక, దేవుడు నీకు తోడై ఉండాలని కోరుతూ ఆశీర్వచనాలు వారు పలికారు.

 ప్రతి నాయకునికి ప్రజల యొద్ద నుండి కూడా ప్రోత్సాహం అవసరం. ఒక తీర్మానం చేసుకొని  ఒక పనిని ప్రారంభించి మనం ముందుకు వెళ్తుండగా  కొంతమంది మనకు సహకరిస్తారు, కొంతమంది మనల్ని వ్యతిరేకిస్తారు. 

కొంతమంది మనకు సలహాలు ఇస్తారు  కొంతమంది మనలను కృంగదీస్తారు. బాధ పెట్టేవారు వ్యతిరేకించేవారు కృంగదీసే వారు ప్రతి తరంలోను ఉంటారు. మనలను కృంగదీసే వారి మీద మనం దృష్టి పెట్టకుండా, మనకు సహకారము అందించేటువంటి ప్రోత్సాహం అందించేటువంటి వారి వైపు చూస్తూ దేవుడు మనకిచ్చిన కర్తవ్యం  నెరవేర్చుటకు ముందుకు కొనసాగాలి. 

శత్రువుల ఆలోచనలు తెలియజేసి ప్రోత్సహించాడు

యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశ మందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. -యెహోషువ 2:9,11

 ఎరికో పట్టణాన్ని వేగుచోడ్డానికి వెళ్ళిన వేగులు వారికి రాహాబు అనే వేశ్య ద్వారా  వినిపింప చేయబడిన మాటలు ఆ ప్రాంత ప్రజల యొక్క  భయమును ఆలోచనను వ్యక్తం చేశాయి. 

ఒకప్పుడు ఆ దేశ ప్రజలను చూచి ఇశ్రాయేలు ప్రజలు యొక్క పెద్దలు  భయపడి ఆ దేశంలో అడుగుపెట్టడానికి  అయిష్టతను కనబరిచి  జీవితాన్ని శాపభరితంగా మార్చుకున్నారు. 

కానీ ఇప్పుడు  ఈ నూతన తరానికి ఆ ప్రజల మనోగతం  ఏమిటో తెలియపరచడం ద్వారా  దేవుడు ఎంత సునాయాసంగా ఆ పట్టణాలను వీరు వశం చేస్తాడో  వీరు అర్థం చేసుకోగలరు. కచ్చితంగా రాహాబు పలికిన మాటలు వేగులవారిని యెహోషువను ఇశ్రాయేలు ప్రజలను ఎంతో ప్రోత్సహించి ఉంటాయి సందేహం లేదు.

 ఎవరి గురించే అయితే మనం భయపడుతున్నామో వారే మన గురించి భయపడుతున్నారని మనం తెలుసుకున్న దినాన్న మన మనసులో కలిగే భావాలు ఏంటి? దేవుడు దేనికైనా సమర్ధుడు  మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే మనలను ప్రోత్సహించుటకు ఆయన ఏమైనా చేయగలడు. 

క్రియలు ద్వారా (3-6)

 దేవుడు మాటల ద్వారా మాత్రమే కాదు క్రియల ద్వారా కూడా ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సహించినవాడుగా ఉన్నాడు. ఆయన మాటల దేవుడు అనడం కన్నా చేతల దేవుడు అనవచ్చు. మాట ఇచ్చి తప్పిపోకుండా ఉండటం ఆయనకున్న గొప్ప లక్షణం. ఇప్పుడు వరకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన మాటల ద్వారా ఎలా ప్రోత్సహించాడో చూసారు, మరి వారిని ప్రోత్సహించడానికి ఆయన ఏ విధమైన క్రియలు వారి పక్షాన జరిగించాడం తెలుసుకుందాం రండి.  

యొర్ధాను నీళ్లను నిలిపివేసి

అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణ సముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. -యెహోషువ 3:15,16

 ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుండి బయలువెళ్లినప్పుడు ఎర్ర సముద్రం వారిని అడ్డగించగా, దేవుడు అద్భుత రీతిగా వారికి అందులో మార్గాన్ని ఏర్పరిచాడు. అయితే ఆ సమయంలో వారికి మోషే నాయకుడిగా ఉండి, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్య మధ్యవర్తిత్వం వహించాడు. 

ఇప్పుడు మోషే లేడు, ఇంతకాలం మోషే దేవుని మాట చొప్పున కొనసాగుతూ వారి కళ్ళ ఎదుట ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే యెహోషువ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ వంతు వచ్చింది. 

యొర్ధాను వారి ఎదుట ఉన్నది. మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను అనే దేవుని వాగ్దానం యెహోషువకు ఉన్నది. ఇప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తూ  ఇశ్రాయేలు ప్రజలు ఎదుట యెహోషువను గొప్ప చేస్తూ వారి మార్గమును సుగమము చేస్తూ యోర్థను తాను నీళ్లను ఏకరాశిగా నిలిపివేసి వారిని ముందుకు నడిపించాడు.  

యెరికో గోడలు కూల్చి

ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. -యెహోషువ 6:1,5

 యోర్థను దాటిన తర్వాత వారు ఎరుక గోడలను ఎదుర్కోవాల్సి వచ్చింది. పొట్టేలు కొమ్ముల బూరల వలన ,  ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాస సహితమైన కేకల వలన ఎత్తయిన ఆ గోడలు కూల్చి  ఏరుకో పట్టణాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీన పరుచుకునే విధంగా దేవుడు సహాయం చేశాడు. సైన్యాధిపతిగా యెహోషువ ఇది మొదటి విజయం కాకపోయినప్పటికీ సంపూర్ణ నాయకుడిగా ఆయనకు ఇది మొదటి విజయం.

 మనుషులకు సాధ్యం కాని కార్యములను దేవుడు మన జీవితాల్లో జరిగిస్తూ , మన ఆత్మీయ ప్రయాణం ముందుకు కొనసాగునట్లు చేస్తూ ఉండగా, తన క్రియల ద్వారా దేవుడు మనకు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ  ఆయన మన ఎదుట ఉంచిన పందెంలో  ముందుకు కొనసాగేవారంగా ఉండాలి. 

పాపముకు తావు ఇవ్వొద్దు

అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. -యెహోషువ 7:5,21

 ఇశ్రాయేలు ప్రజలకు యెరికో పట్టణం మీద యుద్ధం అనేది మొదటిది కనుక, దానికి సంబంధించిన సొమ్మంతా  దేవుని ధనాగారంలోకి  తీసుకురాబడాలని ఆయన కోరుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులలో ఒకడైన ఆకాను అనే వ్యక్తి దేవుడు వద్దన్న వాటి మీద ఆశను పెంచుకొని వాటిని దొంగిలి తన డేరాలో దాచి పెట్టుకున్నాడు. 

ఆయన చేసిన ఈ పనిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క తర్వాతి యుద్ధంలో ఓడిపోయారు, 36 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. నాయకుడైన యెహోషువా కృంగిపోయాడు. దీనంతటికి కారణం ఆకాను చేసిన పాపమే.

 పాపమునకు మనము తావు ఇవ్వడం ద్వారా కొన్ని ఆత్మకార్యాలు మన జీవితంలో కుంటుపడిపోతాయి. దేవుడు తన మాటల ద్వారా క్రీయల ద్వారా మనల్ని ప్రోత్సహిస్తూ ఉండగా, దేవుడు ఇచ్చు కృప ద్వారా ఆయనకు విధేయులమై కొనసాగుటకు పాపమునకు తావివ్వక కొనసాగుటకు నిర్ణయం తీసుకుందాం. 

Post a Comment