నూతనపరచు దేవుడు


నూతనపరచు దేవుడు  (సంఖ్యా. 20-ద్వితీ 34)

నూతనపరచు దేవుడు 

(సంఖ్యా. 20-ద్వితీ 34)

తిరుగుబాటు చేసిన వారు అవిధేయులైన వారు ఒకవైపు నశించిపోతున్నప్పటికీ దేవుని ప్రణాళిక చొప్పున వాగ్దాన దేశమును స్వతంత్రించుకునే యాత్ర కొనసాగుతూనే ఉన్నది. 

ఇందులో దేవుడు ఎప్పటికప్పుడే నూతనమైన రీతిలో తన ప్రజలను నడిపించినవాడుగా ఉన్నాడు, ఆయన మన జీవితాలను కూడా ఎప్పటికప్పుడే నూతనపరిచేవాడుగా ఉన్నాడు. 

నూతనపరిచే మన దేవుడు ఇశ్రాయేలీయుల పక్షంగా ఏమి చేశాడో తెలుసుకుందాం రండి.

నూతన ప్రారంభం అనుగ్రహించాడు (20)

మోషేపై అసూయతో మాట్లాడిన మిరియము అహరోనులు మరణించడాన్ని మనము ఈ అధ్యాయములో చూడవచ్చు. ఇంతకాలం ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన మోషే సహితము ఈ అధ్యాయంలో తప్పిపోయిన వాడుగా ఉన్నాడు.

ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేని ఓ సందర్భంలో అసహనాన్ని ప్రదర్శించి, దేవుడు బండతో మాట్లాడమని చెబితే, ఇశ్రాయేలు ప్రజలను ద్రోహుల రా అని సంబోధిస్తూ కర్రతో ఆ బండను రెండుసార్లు కొట్టాడు.

ఇది దేవునికి ఏమాత్రం నచ్చలేదు, కాబట్టి వాగ్దానదేశంలో అడుగుపెట్టే అవకాశం మోషేకు కూడా లేకుండా పోయింది. ఇది బాధ కలిగించే విషయమే అయినా చేదైన వాస్తవంగా ఉన్నది.

ఖాళీ చేయబడిన ఈ పాత్రల నిమిత్తమై దేవుడు నూతనమైన వ్యక్తులను ఎన్నుకున్నాడు. నూతన తరాన్ని ముందుకు నడిపించడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు.

మన దేవుడు నూతన ప్రారంభం ఇచ్చే దేవుడు. మనుషులు మారతారు ఏమో కానీ దేవుని పని ఏమాత్రం ఆగదు. కనుక బుద్ధి కలిగి నడుచుకుంటూ దేవుని పనిలో మన పాత్రను మనము నిర్వర్తించే వారం గా ఉండాలి

నూతన కార్యాలు /విజయాలు(21, 22)

ఇశ్రాయేలీయులు ఇలా కొనసాగుతూ ఉండగా వారికి కొన్ని యుద్ధాలు కలిగాయి, అయితే దేవుడు ఆ యుద్ధములన్నిటిలో నుండి వారికి విజయాన్ని అనుగ్రహించారు. 

ముఖ్యంగా ఈ ప్రజలు కూడా దేవునిపై సనిగిన విధానాన్ని బట్టి ఆయన కోపాగ్నికి గురికావాల్సి వచ్చింది, అందులో భాగంగా ఈసారి దేవుడు వారి మీదకు సర్పములను పంపించాడు. 

సర్ప కాటుకు గురై అనేక మంది బాధింపబడుతూ మోషే యొద్దకు రాగా మోషే వారిని నిమిత్తమై దేవుని వద్దకు వెళ్లాడు, అప్పుడు దేవుడు వారికి విడుదల కలగాలంటే మోషే ఒక ఇత్తడి సర్పమును తయారుచేసి దానిని ఒక స్తంభం మీద ఎత్తుగా ఉంచాలని, ఎవరైతే దాని వైపు చూస్తారో వారందరూ బ్రతుకుతారని దేవుడు చెప్పాడు. 

ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో సర్వలోకము నిమిత్తమై కల్వరి సిలువలో వేలాడే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఆయన వైపు చూసిన వారందరూ పాపపు విషయము నుండి విరిచి వేయబడి నెమ్మది పొందేవారుగా ఉంటారు. 

మోషే ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా చేశాడో, ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూసారో వారందరికీ దేవుడు చెప్పినట్టుగానే విడుదల కలిగింది.

ఈ రీతిగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ, వారి మీదకు వచ్చిన గొప్ప గొప్ప రాజులను కూడా ఓడించిన వాడుగా ఉన్నాడు. వారిలో యష్ బోను రాజు అయిన షిహము, భాషను రాజైన ఓగు అనేవారు కూడా ఉన్నారు.

ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ నూతన తరమునకు తోడైయుండి వారి పక్షమున నూతన కార్యాలు చేస్తూ వచ్చాడు.

నూతన సవాలు (22-25)

అలా కాలం దొర్లిపోతూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు మోయాబు సరిహద్దు వరకు వచ్చేశారు, షిత్తీమనే ప్రాంతంలో వారు ఉండగా వారి యొక్క జనసంఖ్యను చూచిన మోయాబు రాజైన బాలాకు భయపడి, ఈ ప్రజలను శపించడానికి సోదిగాడైన మాంత్రికుడైన బిలామును పిలిపించాడు. 

మొదట్లో అతడు రావడానికి ఒప్పుకొనకపోయినా, ఎట్టకేలకు బిలాము బాలాకు ఇచ్చేటువంటి బహుమానమును ఆశించి బయలుదేరి వచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలను శపించే అవకాశం దేవుడు అతనికి ఇవ్వలేదు. 

తాను ఇశ్రాయేలు ప్రజలను శపించలేకపోయినప్పటికీ, బాలాకును తృప్తి పరచడానికి బిలాము ఒక చెడ్డ ఉపాయము చెప్పాడు. ఆ ఉపాయమునకు దొరకకుండా తప్పించుకోవడమే ఇశ్రాయేలు ప్రజల ముందు ఉన్న గొప్ప సవాలు.

ఇంతకీ బిలాము చెప్పిన ఆ ఉపాయం ఏంటంటే, మోయాబు స్త్రీలలో అందమైన వారిని ఇశ్రాయేలు యవ్వనస్తులతో స్నేహం చేసే విధంగా చేసి పేయూరు కొండమీద బయలదేవతకు జరిగే పండుగకు ఆహ్వానమును తెలిపి, వారు విగ్రహారాధనలోను వ్యభిచారంలోనూ పాలు పంపులు పొందే విధంగా చేస్తే వాళ్ల దేవుడే వారిని నాశనం చేస్తాడు అని చెప్పడం జరిగింది.

ఈ సవాలను జయించడంలో ఇశ్రాయేలీయులు దాదాపుగా విఫలమయ్యారు అనే చెప్పాలి, దేవుని ఆజ్ఞల పట్ల అంతగా అవగాహన లేని ఈ ప్రజలు మోయాబు స్త్రీలతో స్నేహం చేసి బిలాము వేసిన పథకంలో చిక్కుకున్నారు. 

తద్వారా ఈ ప్రజల మీదకు తెగులు రావడం 24 వేల మంది ఆ తెగులుతో చనిపోవడం జరిగింది. ఎలియాజురు కుమారుడైన ఫినేహాసు దేవుని పక్షముగా రోషముగలవాడై ప్రవర్తించేంతవరకు దీనికి పరిష్కారం దొరకలేదు.

మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉండగా మనలను నాశనము చేయడానికి ఆలోచన కలిగిన సాతాను బిలాము వంటి సోదిగాండ్రు ఎంతమందిని ఉపయోగించుకుని మనకు వ్యతిరేకమైన పన్నాగాలెన్నో పన్నుతూ ఉంటాడు. 

అయితే ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్య అవగాహన కలిగి వాటిని మనము జయించే వారం గా ఉండాలి. ఈ సవాలును స్వీకరించి సాతాను పై జయము పొందేవారంగా మనం ఉండాలి, అలాంటి జయ జీవితము ప్రభువు మనకు అనుగ్రహించును గాక.

నూతన హెచ్చరికలు (26-ద్వితీ. 34)

మోషే వాగ్దానదేశంలో అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయింది, వాగ్దాన దేశంలో అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్న ప్రజలు దేవుని కార్యములను గూర్చి, ఆయన నిబంధన ఆజ్ఞలను గూర్చి అవగాహన లేనివారుగా ఉన్నారు. 

అలాంటి పరిస్థితులలో వారిని ప్రోత్సహిస్తూ వారు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత నడుచుకోవాల్సిన విధివిధానాలను తెలియపరుస్తూ మోషే ఎన్నో హెచ్చరికలు చేయడం జరిగింది. ఈ హెచ్చరికలు సంఖ్యాకాండం 26వ అధ్యాయము ప్రారంభమై ద్వితీయోపదేశకాండముతో ముగుస్తాయి.

దేవుడు తన గ్రంథము ద్వారా మన ఆత్మీయ యానము నిమిత్తమై అనేకమైన హెచ్చరికలు ఇస్తూ ఉండగా వాటిని శ్రద్ధతో గైకొని మన ఆత్మీయ జీవితంలో ప్రభువుకిష్టంగా జీవించుటకు ప్రయాస పడదాం. అలాంటి భాగ్యము ప్రభువు మనకు దయచేయును గాక ఆమెన్.

Post a Comment