ఏదేను తోట లో మంచి చెడ్డల చెట్టు ఎందుకు? దాని వలనే పాపం, మరణం వచ్చింది కదా?


ఏదేను తోట లో మంచి చెడ్డల చెట్టు ఎందుకు? దాని వలనే పాపం, మరణం వచ్చింది కదా?
Q/A-09

ఏదేను తోట లో మంచి చెడ్డల చెట్టు ఎందుకు? దాని వలనే పాపం, మరణం వచ్చింది కదా? 

    ప్రేమ గల సృష్టికర్త అయిన దేవుడు తన నోటి మాటతో అద్భుతంగా ఈ సృష్టిని కలుగజేసి, తన స్వరూపంలో తన పోలికలో నరుని నిర్మించి తనకు ఈ సృష్టిని అప్పగించి, అనుభవించమని కాయమని చెప్పాడు. దేవుడు మనిషిని సృజించినప్పుడు స్వేచ్ఛాజీవులుగా వారిని చేశాడు. 

    ఎవరైనా ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు, మనము నొక్కే బటన్ ప్రకారంగా, తిప్పే తాళాన్ని బట్టి ఆ వస్తువు ప్రవర్తించాలని కోరుకుంటాం. ఇక ఇందులో మనం తయారు చేసిన వస్తువుకి ఎలాంటి స్వేచ్ఛ లేదు, మనం ఏది చెప్తే అది అలా చేయాలి. దేవుడు మనలను ఇలా తయారు చేయలేదని గమనించాలి. 

    దేవుడు మన యొద్ద నుండి దేనిని బలవంతంగా కాక స్వేచ్ఛ పూర్వకంగానే పొందాలని ఆశిస్తున్నవాడిగా ఉన్నాడు. అందుకే మనిషికి స్వేచ్ఛనిచ్చాడు, మనిషి తనకిష్టమైనది ఏదైనా చేయొచ్చు, అది మంచైనా చెడ్డ అయినా చేయడానికి అడ్డమేమీ లేదు. 

    రెండవదిగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు తాను కలిగించిన సృష్టి మొత్తంలో( దేవదూతలతో సహా) చెడ్డది అంటూ ఏదీ లేదు.

 దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను. .......-ఆదికాండము 1:31

    దేవుడు కలిగించిన దేవదూతలు, మనుషులు చెట్లు జంతువులు అన్నీ మంచివే. అయితే దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించి పడిపోయిన దేవదూతలే నేడు సాతానుగా దెయ్యాలుగా మనుగడలో ఉన్నాయి. 

    మనిషి తాను పడిపోయిన స్థితిని బట్టి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు గాని దేవుడు కలిగించినప్పుడు మనిషి ఈ విధంగా లేడు! అలాగే ఏదేను తోటలో దేవుడు ఏర్పాటు చేసిన మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షముగాని, హవ్వను మోసపరుచుటకు ఉపయోగించబడిన సర్పము గానీ అన్ని మంచివే.

    ఇక్కడ ఆ చెట్టులో లేదా పండులో ఎలాంటి ప్రత్యేకత లేదు, ఒక పండితుడు అభిప్రాయ పడినట్టుగా భౌతికంగా ఆ పండులో సి విటమిన్ కొంత పీచు పదార్థం ఉండి ఉండొచ్చు. అంతేగాని ఆ పండు తినడం వల్లనే ఆదాము హవ్వల పరిస్థితి ఇలా మారలేదు! ఆ చెట్టును లేదా పండును అక్కడ ఉంచుటను బట్టి మానవుడికి ఈ దుస్థితి ఏర్పడలేదు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది?

మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. - ఆదికాండము 2:16,17 

    ఈ మాటలు దేవుడు ఆదాముతో చేసిన నిబంధనను గురించిన మాటలై ఉన్నవి. ఈ నిబంధనలో దేవుడు వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఈ ఆజ్ఞ వారిని పరీక్షించడానికి ఇవ్వబడిన ఆజ్ఞ. మొదట్లో చెప్పినట్టుగానే స్వేచ్ఛ పూర్వకంగా మానవులు దేవుని ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు, ఇప్పుడు తలను ప్రేమిస్తారో లేదో చూడడానికే ఆ చెట్టును, ఆ చెట్టును గూర్చి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. 

    కాబట్టి ఇక్కడ ముఖ్యమైనది పండు తినడం కాదు గాని ఆజ్ఞను మీరడం. సమస్య చెట్టు వల్ల రాలేదు గాని ఆజ్ఞను మీరినందువల్ల వచ్చింది. దేవుడు తాను బలవంతంగా ప్రేమింపబడాలని కోరలేదు, ఈ ఆజ్ఞ ద్వారా వారు తనను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలనుకున్నాడు.

మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. -1 యోహాను 5:3

    దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరు దేవుని ఆజ్ఞలను గైకొనేవారుగా ఉండాలి, ఆయన మనము గైకొనలేని భారమైన ఆజ్ఞలు ఎన్నడూ మనకివ్వలేదు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలను గైకొనే వారం గా ఉన్నప్పుడు దీవెనను చూస్తాము , దేవుని ఆజ్ఞను మీరేవారముగా ఉన్నప్పుడు శాపమును చూడవలసి వస్తుంది. 

    ఇదే క్రమంలో కొంతమంది దేవుడు ఉంటే మరి దుష్టత్వం ఎందుకు ఈ లోకంలో ఉందని ప్రశ్నిస్తూ ఉంటారు? దేవుడు ఉంటే చెడ్డ పనులు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు ఎందుకు ఆ చెడ్డ పనులను ఆపడం లేదు? చెడ్డ పనులు జరగడానికి కారణం దేవుడు కాదు గాని మనిషికున్న స్వేచ్ఛ. 

    దేవుడు మనిషికున్న స్వేచ్ఛను భంగం చేసేవాడు కాదు కనుక ఒక చెడ్డ పని చేయడానికి పూనుకున్న సమయంలో దేవుడు ఆ వ్యక్తిని ఆపడు. అందుకే ఇక్కడ హవ్వ పాపం చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఆపలేదు. దేవుడు హెచ్చరిస్తాడు ప్రోత్సహిస్తాడు, కానీ నీ స్వేచ్ఛకి నీ నిర్ణయానికి దాన్ని విడిచిపెడతాడు. చెడును ఆపటానికి ఆయనకు సమర్థత ఉంది, ఒకరోజున ఆయన పని చేస్తాడు. 

    ఇంకొంతమంది మనిషికి అసలు ఈ స్వేచ్ఛ ఎందుకు ఇచ్చాడు? దేవుడు చెప్పింది చేయమంటే బాగుండేది కదా! లేకపోతే ఈ స్వేచ్ఛని తీసేస్తే మంచిది కదా అంటారు, దేవుడు స్వేచ్ఛను తీసేసినప్పుడు చెడు చేయడానికి మాత్రమే స్వేచ్ఛను మనం కోల్పోము గాని మంచి చేయడానికి ఉన్న స్వేచ్ఛను కూడా మనం కోల్పోతాం. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన స్వేచ్ఛను దేవుని అధికంగా ప్రేమించి ఆయన ఇచ్చిన వాటితో తృప్తి చెందుతూ ఆయన ఉద్దేశములు నెరవేర్చడానికి ఉపయోగిద్దాం, మన స్వేచ్ఛను చెడ్డవాటికి ఉపయోగించి మన జీవితాలను నాశనం చేసుకునే బుద్ధిహీనమైన పని చేయవద్దు.

- Rephidim Ministries  

Post a Comment