శారా భర్త కొరకు అబద్దమాడింది
ఒకసారి జాన్సన్ తన ఇంట్లో ఉండగా, ఆయనతో మాట్లాడడానికి తన స్నేహితులు వచ్చారు. అయితే వారితో మాట్లాడడానికి ఇష్టం లేని జాన్సన్ తన భార్యను పిలిచి నేను ఇంట్లోలేనని వారితో చెప్పు అని అన్నాడు. జాన్సన్ భార్య బయటకు వెళ్లి, ఆ స్నేహితులతో నా భర్త ఇంట్లో లేనని చెప్పమన్నాడు అని చెప్పింది.
బహుశా మీరందరూ ఇంత తెలివిగా, నిజాయితీగా ప్రవర్తించక, మీ జీవితంలో ఎన్నోసార్లు మీరు అబద్ధాలు ఆడి ఉండి ఉండొచ్చు.
ఒక అబద్ధానికి కారణాలు ఎన్నో! అవకాశం కోసం, అభిమానం కోసం, పరువు కోసం, ప్రాణం కోసం, ప్రేమ కోసం పెట్టుబడి కోసం, బహుమానం కోసం బ్రతుకుతెరువు కోసం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అబద్ధము ఆడని సందర్భాలు ఉండనే ఉండవేమో. కానీ ఈ పాఠములో భార్యలు అబద్ధాలు ఆడటానికి ఒక రెండు కారణాలు చూద్దాం.
విశ్వాస పరీక్షలో విఫలమైన శారా ఐగుప్తుకు ప్రయాణమై సమీపంగా చేరారు, ఐగుప్తుకు సమీపిస్తుండగా అబ్రహాములో నూతనమైన భయం మొదలైంది. శారా చాలా సౌందర్యవంతురాలు, శారా యొక్క సౌందర్యాన్ని బట్టి తన యొక్క ప్రాణానికి ముప్పు కలుగుతుందని అబ్రహాము భయపడ్డాడు.
కాబట్టి అబ్రహాము తన ప్రాణమును కాపాడుకోవడానికి శారతో, నేను నీ అన్ననని, నీవు నా చెల్లెలు అని ఇక్కడున్న ప్రజలతో చెబుదాం అని అన్నాడు.
ఈ భాగంలో అబద్ధం ఆడటానికి అబ్రహాము సిద్ధంగా ఉన్నాడు, ఆ అబద్ధానికి బలం చేకూరునట్లుగా శారాను కూడా సిద్ధపరుస్తున్నాడు.
దేవునిపై ఆధారపడడం మానేసినప్పుడు, మన సమస్యల మధ్య ఆయన పరిష్కారం కొరకు చూడకుండా మన పరిధిలో మన సామర్థ్యం చేత వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి ఆలోచనలు ఇలాంటి నిర్ణయాలే కలుగుతాయి.
శారా అబ్రహాముకు చాలా విధేయురాలు, ఆమె ఈ అంశంలో కూడా అబ్రహాముకు విధేయత చూపించింది. ఎందుకు శారా అబ్రహాముకు విధేయత చూపుతూ ఈ అంశంలో అబద్ధమాడింది
భవిష్యత్తును గూర్చిన భయాన్ని బట్టి :
మనలో చాలామంది అబద్ధమాడటానికి, కొన్నిసార్లు మాట దాటవేయడానికి భవిష్యత్తును గూర్చిన భయమే కారణం. భవిష్యత్తును గూర్చిన ఈ భయం కొన్నిటిని దాచే విధంగా, కొన్నిటిని మార్చే విధంగా చేస్తూ ఉంటుంది.
నా గురించి ఈ విషయాలు తెలిస్తే మా సంబంధం ఏమవుతుందో, మా భవిష్యత్తు ఎలా మారుతుందో అని కొన్ని విషయాలు దాచి పెడుతూ ఉంటాం. ఇంకొన్ని సందర్భాల్లో అదే భయాన్ని బట్టి మరికొన్ని విషయాలు మార్చి చెబుతూ ఉంటాం.
మీరు మీ జీవితంలో ఇలాగే చేశారా? అబ్రహాము భయపడినట్టుగానే శారా కూడా భయపడింది అని చెప్పవచ్చు. ఐగుప్తు దేశ ప్రజలకు భార్యాభర్తలిద్దరూ ఇక్కడ భయపడ్డారు.
వాళ్ళిద్దరూ భార్యాభర్తలని తెలిస్తే, శారా సౌందర్యాన్ని ఆశించిన ఐగుప్తు పురుషులు అబ్రహామును చంపి తనను బ్రతుకనిస్తారని, లేదా తనను వారితో తీసుకువెళ్తారని భయపడి శారా ఈ విధంగా చెప్పింది.
ఈ విధమైన భవిష్యత్తును గూర్చిన భయం, మనలోనూ రకరకాల సందర్భాల్లో వ్యక్తమౌతూ ఉండొచ్చు. కానీ అసలు ఈ భయానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే మనకు దేవుని భయం లేకపోవడమేనంటాను.
ఈ సందర్భాల్లో మనకు భయం కలిగినప్పటికీ మనము దేవుని భయము కలిగిన వారమైతే, దీనిని సునాయాసంగా జయించగలిగే వారముగా ఉంటాం, లేదా కష్టమైనా నష్టమైనా ఈ సందర్భంలో మనుషుల కంటే దేవునికి భయపడడానికే తీర్మానం చేసుకునేవారముగా ఉంటాము .
మనుషులకు భయపడి అబద్ధమాడాము, మరి దేవునికి భయపడలేదా? అబద్ధము దేవునికి ఏమాత్రం ఇష్టము కాదు. సందర్భం ఏదైనా అది సమర్ధించదగినదైతే కాదు.
మన ఆత్మీయ జీవితాల్లో మనుషుల భయం కంటే దేవుని భయమును ఎక్కువగా కలిగి ఉన్నామా లేదా అనేది ఆలోచించాలి.
మనుషులను గూర్చిన భయము, భవిష్యత్తును గూర్చిన భయము మనలను ఈ చెడ్డ విధానాల్లో నడిపిస్తున్నట్లయితే, దేవుని గూర్చిన భయము, అదే భవిష్యత్తును గూర్చిన భయము మనలను సన్మార్గంలో నడిపించాలి.
అబద్ధమాడిన వారి యొక్క భవిష్యత్తు దేవుని ఎదుట ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించగలిగితే, అబద్దానికి చాలా అడుగులు దూరంలోనే మనం ఆగిపోతాం.
శారా చేసినట్టుగా మనము మన యొక్క జీవితాల్లో ఆమె తన భర్త ప్రాణం కోసం ఆలోచించింది, మనం మన పరువు కోసం, కొన్నిసార్లు ప్రాణం కోసం, కొన్నిసార్లు మంచి భవిష్యత్తు కోసం, కొన్నిసార్లు లోన్లు కోసం, కొన్నిసార్లు కొన్ని దెబ్బలు తప్పించుకోవడం కోసం, ఇంకొన్నిసార్లు కొన్ని తిట్లు తప్పించుకోవడం కోసం, అబద్ధాలాడి తప్పిపోయిన ఉండి ఉంటాం.
మనమెవరము పరిపూర్ణులం కాదు, ఈ బలహీనతతో ఎన్నోసార్లు మనం వేధించబడి ఉండొచ్చు, గడిచిన గత కాలంలో ఈ అంశంలో మనం తప్పిపోయిన విధానాన్ని బట్టి దేవుని ఎదుట క్షమాపణ కోరుకొని, ఆయన కృప చేత దీనిని జయిస్తూ మరలా నూతనంగా ఆత్మీయ అడుగులు వేయటానికి సిద్ధపడదాం.
భర్త మీద ఉన్న ప్రేమను బట్టి :
శారా ఎందుకు అబద్దమాడింది అంటే భవిష్యత్తును గూర్చిన భయం మాత్రమే కాదు, భర్త మీద ఉన్న ప్రేమ కూడా కారణమే. శారా తన భర్తను ఎంతగానో ప్రేమించింది కనుక, ఈ సమయంలో తాను ఈ విధంగా చెప్పకపోతే తన భర్త ప్రేమకు తాను దూరం అవుతానని, తన భర్త యొక్క ఉనికి లేకుండా పోతుందని భావించి తన భర్త మీద ఉన్న ప్రేమను బట్టి అబద్ధమాడింది అని చెప్పొచ్చు.
మీరందరూ మీ భర్తలను ప్రేమించేవారే, మీ ప్రేమకు మీ భర్తల మీద మీరు పెంచుకున్న అభిమానానికి వారి యొక్క పరువును కాపాడటానికి వారి ప్రేమను తిరిగి పొందటానికి మీరు పడుతున్న ప్రయాస అభినందనీయం.
అయితే ఈ సందర్భంలో మీ భర్త మీద మీకున్న ప్రేమను బట్టి అబద్ధమాడే పరిస్థితి ఉంటే దానిని బట్టి మిమ్మల్ని మెచ్చుకోవాలో బాధపడాలో అర్థం కావడం లేదు.
నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నా గురించి నువ్వు ఈ విధంగా చెప్పాలి అని అబ్రహాము చెప్పి ఉండకపోవచ్చు కానీ ఇలా చెప్పే భర్తలు ఉన్నారా లేరా? నీ భర్త మీద మీకున్న ప్రేమ మిమ్మలను దేవుని ఎదుట దోషులుగా నిలబెడితే మీకు ఇష్టమేనా?
దేవుడా లేదా భర్త అని కోరుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరూ దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు భర్తను ప్రేమించుట కంటే, లేదా ప్రేమించినంత కంటే ఎక్కువగా దేవునిని ప్రేమించుటకు నేర్చుకోవాలి.
భర్తను ప్రేమించి ఆయనను సంతోష పెట్టడానికి, ఆయన పరువును కాపాడడానికి, అబద్ధాలాడి ఉండుంటే, మరి దేవునిని సంతోషపెట్టేది ఎప్పుడు, నీవు దేవుని బిడ్డగా బ్రతికేది ఎప్పుడు? ఆలోచించండి.
ఈ అంశమును ముగించటానికి ముందుగా భర్తతో సంబంధం లేకుండా ప్రమేయం లేకుండా మీకు మీరుగా అబద్ధాలాడే స్వభావం మీకు ఉన్నట్లయితే దానిని విడిచి పెట్టండి.
ఒకవేళ శారా ఉన్న పరిస్థితుల మీ జీవితంలో ఏర్పడితే, ఆ సమయంలో భవిష్యత్తుకు, భర్తకు, ఇతర మనుషులకు భయపడుట కంటే లేదా భయపడినంత కంటే దేవునికి ఎక్కువగా భయపడడానికి నిర్ణయం చేసుకోండి. భర్త కంటే దేవునిని ఎక్కువగా ప్రేమించడానికి నిర్ణయం చేసుకోండి.
ఈ రెండు నిర్ణయాలు చేయడం ద్వారా దేవుని పట్ల మీరు కనబరుస్తున్న ప్రేమను బట్టి దేవుని భయము మీరు కలిగి జీవిస్తున్న విధానాన్ని బట్టి జీవముగల దేవుడు మీరున్న పరిధిలో మీరున్న పరిస్థితుల్లో మీకు అవసరమైన సహాయం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా, భిన్నంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు.
రుచి చూచి తెలుసుకోండి, అనేక మందికి మాదిరిగా నిలవండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్.
పునర్విమర్శ ప్రశ్నలు
- మీ జీవితంలో అబద్ధంలాడ్టానికి కారణమేమిటి?
- ఈ పాఠంలో చర్చించిన రెండు అంశాల్లో మీ ప్రవర్తన ఎలా ఉంది?
- ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో వస్తే మీరేం చేస్తారు?
- దేవుని పట్ల ఉన్న భయము, ప్రేమ మన జీవితంలో మనం అన్నిటినీ జయించగలుగునట్లుగా సహాయం చేస్తుందని నమ్ముతున్నారా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి