మనము కోరినది దేవుని యొద్ద నుండి పొందుట ఆశీర్వాదమా?? శాపమా??

మన దేవుడు ప్రేమగల దేవుడు, మనకేది మంచిదో, ఏది చెడ్డదో ఆయనకు బాగా తెలుసు. మనకేది ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతి దానిని దాని సమయాల్లో మనకు ఇస్తాడు.

పరిచయం :

 దేవుడు మనకు ఇచ్చే ప్రతిది శ్రేష్ఠమైనదే. దేవుని వాక్యమును ప్రేమించు ప్రతి ఒక్కరికి అతిశ్రేష్టుడైన   యేసయ్య నామములో శుభములు కలుగును గాక.

అందరూ బాగున్నారా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మన్నాతో పోషిస్తూ సీనాయి పర్వతం వరకు నడిపించిన దానిని గురించి తెలుసుకున్నాము కదా! ఈనాటి భాగములో సంఖ్యాకాండము 11వ అధ్యాయము ద్వారా ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం!

మన దేవుడు సమతుల్యత కలిగిన దేవుడు అని చెప్పొచ్చు. ఆయన ప్రేమామయుడు మాత్రమే కాదు, తీర్పు తీర్చేవాడు కూడా అనే సంగతి మనం గ్రహించాలి.

మనము దేవునికి వ్యతిరేకంగా తొలగిపోతున్నప్పుడు, కొన్నిసార్లు ఒక తండ్రి వలే మనలను దారిలోనికి తీసుకురావడానికి బెత్తం ఉపయోగించేవాడిగా దేవుడు ఉంటాడు. ఇంకో రకంగా చెప్పాలంటే  మనలను క్రమశిక్షణలో పెట్టడానికి కొన్నిసార్లు ఆయన మనతో కఠినంగా వ్యవహరిస్తాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి.

 దేవుడు ఏ విధంగా క్రమశిక్షణలో పెడతాడు, ఎవరిని క్రమశిక్షణలో పెడతాడు? ఆ క్రమశిక్షణ మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? దీనికి సమాధానాన్ని ఈ భాగంలో చూద్దాం. 

చాలా సార్లు దేవుడు మన జీవితంలో మనము అడిగింది ఇచ్చి మనలను క్రమశిక్షణలో పెడతాడు. ఒక రకముగా చెప్పాలంటే అదే దేవుడు మనకు వేసే శిక్ష అని చెప్పవచ్చు. మన ఇష్టానికి మనలను విడిచిపెట్టడం దేవుని క్రమశిక్షణలో భాగమే.

ఇశ్రాయేలు ప్రజలు అప్పటికి ఒక సంవత్సర కాలముగా దేవుడు ఇస్తున్న మన్నాను తింటున్నారు. కాని ఇప్పుడు వారి ఆశలు వారు ఐగప్తులో తినిన చేపల మీదకు మళ్ళి, సణుగుతూ, మాంసం కోసం ఏడుస్తున్నారు.

ఇది దేవునికి  నచ్చలేదు, ఇది ఒక రకముగా దేవుని చిత్తమును తృణికరించి, వారి సొంత చిత్తమును కోరడమై యున్నది.

 మన జీవితంలో మనం ఇలా చేయడం కూడా దేవునికి నచ్చదు, దేవుడు మన జీవితంలో మనలను ప్రేమించి మన శ్రేయస్సు కోరి మనకు వేటిని అనుగ్రహిస్తున్నాడో, వాటిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోయేవారంగా ఉండాలి.

 కానీ మనం చాలా సందర్భాల్లో  దేవుడు అనుగ్రహించిన వాటికి కృతజ్ఞతలు చెల్లించడం పక్కనుంచి ఆయనకు కోపం రేపే విధంగా అది లేదు ఇది లేదు అని సణుగుతూ ఉంటాం.

 దేవుడు మనకు ఇచ్చిన వాటిని బట్టి  సంతోషించడం మాని, ఇవ్వని వాటిని బట్టి ఇవ్వబోతున్న వాటిని బట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తాము.

 మన దేవుడు ప్రేమగల దేవుడు, మనకేది మంచిదో, ఏది చెడ్డదో ఆయనకు బాగా తెలుసు. మనకేది ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయన ప్రతి దానిని దాని సమయాల్లో మనకు ఇస్తాడు.

 కొన్నిటిని తనకు మాత్రమే తెలిసిన కారణాల నిమిత్తమై  మనకు ఇవ్వకుండా ఆపివేస్తాడు. కొన్నిసార్లు వాటిని భవిష్యత్తులో మనకి ఇవ్వాలనేది ఆయన ఉద్దేశమై ఉంటుంది.

ప్రతి తల్లి ప్రతి తండ్రి దీని అర్థం చేసుకోగలరు, పిల్లలకు మనం ఇచ్చే వస్తువులు, వారి వయసును బట్టి మనం ఇస్తాం కదా. వారికి మనం పెట్టే ఆహార పదార్థాలు  వారి ఆరోగ్య స్థితిని బట్టే పెడతాం కదా.

 దేవుని చేత సృజింపబడిన మనకే ఇంత మేధస్సు ఉంటే, మనల్ని సృజించిన దేవునికి ఇంకెంత మేధస్సు ఉంటుందో ఆలోచించండి. అందుకే దేవుడు ఇవ్వని వాటి గురించి సనుగుతో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం  దేవునికి ఏమాత్రం నచ్చదు.

 ఖచ్చితంగా ఈ అనుభవం పొందినవారు, దాని గుండా వెళ్ళిన  ప్రతి ఒక్కరు దీన్ని మంచిగా అర్థం చేసుకోగలరు. తండ్రులు కుటుంబాన్ని నడిపించేవారు ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలరు.

 మనం ఇలా దేవుడు మనకు ఇవ్వని వాటిని గురించి  ఏడుస్తూ సనుగుతుంటే దేవుడు ఏం చేస్తాడు?  

మనము ఇలా చేసినప్పుడు మనము అడిగింది ఇచ్చి మనకు దేవుడు తీర్పు తీర్చుతాడు, లేదా క్రమశిక్షణలో పెడతాడు.

వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను. -కీర్తనలు 106:15

 నువ్వు అడిగావు కదా తీసుకో అన్నట్టుగా దేవుడు ఇచ్చే విధానం ఉంటుంది. దాని ద్వారా తర్వాత ఏమి జరిగినా దానికి మనమే బాధ్యులం, ఎందుకంటే అది కావాలని అడిగింది మనమే.

 ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు వారు కోరినట్టుగా మాంసాన్ని ఇచ్చాడు. కానీ ఎన్ని రోజులు వారికి మాంసం ఇచ్చాడో తెలుసా? 

వీరికి నెల రోజుల పాటు దేవుడు మాంసం పెట్టాడు, ఇంకో రకముగా చెప్పాలంటే వారు చచ్చేవరకు పెట్టాడు అని చెప్పవచ్చు.

కాబట్టి ప్రార్ధన చేసేటప్పుడు దేవుని చిత్తమును కోరుకొనండి, సొంత చిత్తమును వీడండి.

 ప్రియ యవనస్తులరా, మీ జీవిత భాగస్వామి కొరకు ప్రార్థిస్తున్నారా? మీ చిట్టా దేవుని ఎదుట పెట్టి  దానిమీద ఆయన ముద్ర వేయాలని కోరుకుంటున్నారా? దయచేసి ఆ పని చేయకండి.

 మీకు ఎవరు సరైన వ్యక్తులో, దేవునికి తెలుసు, ఆయన చిత్తం జరగాలని కోరుకోండి. అలా కాదు మీ చిత్తమే జరగాలని మీరు కోరుకుంటున్నట్లయితే, ఆ తర్వాత కలగబోయే పర్యవసానాలకు కూడా సిద్ధపడి ఉండండి.

 ఒక రోగి కొరకు ప్రార్థన చేసే సమయంలో కూడా, దేవుని చిత్తం జరగాలని కోరుకోండి.

ముగింపు :

 మన ఇష్టము కాక దేవుని చిత్తమును కోరుకుంటూ దీవెనలు పొందుదాం. ప్రభు చిత్తమైతే మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్. 

Post a Comment