దేవుని ప్రణాళికలన్నీ మేలుకే
నిజంగా మనుషులు మనకి ఏమి చేయాలని ఉద్దేశించినా, దేవుని యొక్క ప్రణాళిక మేలు నిమిత్తమై ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఆ కీడును కూడా దేవుడు మేలుగా మార్చగలడు.
పరిచయం :
మన జీవితంలో సమస్య గుండా వెళ్తున్నప్పుడు, ఏమి చేయాలో అర్ధం కాక కొన్ని సార్లు, దేవుని చిత్తము ఏమిటో అర్ధం కాక ఇంకొన్ని సార్లు సతమౌతుంటాము.
ఇటువంటి స్థితిలో ఉన్న వాక్యాన్వేషులకు శుభములు తెలియజేస్తూ మిమ్మలను ప్రేమతో రెఫీదీమ్ వాక్య ధ్యాన సమయముకు ఆహ్వానిస్తున్నాను.
అందరూ బాగున్నారా, ప్రణాళికగల దేవునిని గురించి ఆదికాండము 12-50 అధ్యాయములలోని భక్తుల జీవితం ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నాం కదా! సమస్యలలో తొందరపడక, దేవుని ప్రణాళిక కొరకు కనిపెట్టుకుంటే ఏమి జరుగుతుందో ఈనాటి భాగములో తెలుసుకుందాం.
మన దేవుడు ముందస్తు ప్రణాళికలు చేసే దేవుడని తెలుసుకున్నాం కదా, ఆయన తన ప్రణాళికలో భాగంగా యాకోబు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించే క్రమంలో యోసేపును ఐగుప్తుకు పంపాడు అని తెలుసుకున్నాము. అయితే యోసేపు ఐగుప్తుకి ఎలా చేరాడో తెలుసా? యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద పగ పట్టి ఆయనను ఒక బానిసగా అమ్మి వేశారు, అలా యోసేపు ఐగుప్తుకు రావడం జరిగింది.
ఐగుప్తులో యోసేపు చాలాకాలం బానిసగానే ఉన్నాడు ఎట్టకేలకు దేవుడు కలుగజేసుకొని యోసేపును ఐగుప్తును పాలించే స్థాయిలో నిలిపాడు, యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించిన తర్వాత యాకోబు కొన్నాళ్ళకి చనిపోయాడు, ఆ సమయంలో యోసేపు యొక్క అన్నలు ఎంతో భయపడి, ఇప్పుడు యోసేపు ఐగుప్తును పాలిస్తున్నాడు, మనం గతంలో ఆయనను అమ్మేశాం కదా అది మనసులో పెట్టుకొని మనకు కీడు చేస్తాడేమో అని ఆలోచిస్తున్న సందర్భంలో యోసేపు ఇలా అంటాడు
మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. -ఆదికాండము 50:20
నిజంగా మనుషులు మనకి ఏమి చేయాలని ఉద్దేశించినా, దేవుని యొక్క ప్రణాళిక మేలు నిమిత్తమై ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఆ కీడును కూడా దేవుడు మేలుగా మార్చగలడు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయనపై అసూయ చెందిన వారందరూ మేము గెలిచామని భావించారు, కానీ ఆ మరణము ద్వారా పాపము సాతాను యొక్క బానిసత్వము నుండి మానవాళికి దేవుడు విడుదలను కలిగించాడు.
మీ జీవితంలో మనుషులు నీకు కీడు చేయ ఉద్దేశిస్తున్నారని బాధపడుతున్నావా, దేవుడు దాన్ని మేలుకై మారుస్తాడు. తమ జీవితంలో నెరవేరని వాగ్దానాలను గట్టిగా నమ్మి తమ తర్వాతి తరాలకు వాటిని బోధించి ఆ మార్గంలో నడిపించిన విశ్వాస వీరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు అను వారి మార్గంలో మనం కూడా నడుస్తూ ప్రణాళిక గల దేవునికి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకుందాం. యోసేపు తాను చనిపోతూ కూడా తన తర్వాత వారికి ఇదే మాట చెప్పాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలను ఆ ప్రాంతానికి తీసుకు వెళ్ళండి అని చెప్పాడు.
కష్టాలు మన జీవితంలో కలిగినా, మనము క్రమశిక్షణలో పెట్టబడినా మనుషులు మనలను ద్వేషించినా దేవుడు వాటన్నిటినీ మనకు మేలుగా మారుస్తాడు.
కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి మనలను పలకరించినా దాని వెనక ఆయనకున్న ప్రణాళిక మేలును ఉద్దేశించినదై ఉన్నదని గ్రహించండి. సమస్యలు కూడా మేలుకై ఆయన ఉద్దేశించాడని తెలుసుకోండి.
ప్రస్తుతము అనుభవిస్తున్న కష్టం మీద కాక ప్రణాళిక గల దేవుడు దాని వెనక దాచి ఉంచిన మేలు మీద మన దృష్టి నిలిపి ముందుకు సాగుదాం, అలాంటి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.
ముగింపు :
మన మేలుకై ప్రణాళిక చేయు దేవుడు మనకు ఉన్నాడు గనుక, జీవితంలో కలిగే కష్ట నష్ట బాధలకు కుమిలిపోక, దేవుడు ఇచ్చు ఫలితం కొరకు ఓపికతో కనిపెట్టుకుందాం. ప్రభువు చిత్తమైతే మరొక భాగముతో మళ్ళీ కలుద్దాం! అంతవరకు ప్రభువు కృప మనకు తోడైఉండును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి