సమస్య రాక ముందే దేవుడు పరిష్కారమును సిద్దపరుస్తాడు

 

సమస్య రాక ముందే  దేవుడు పరిష్కారమును సిద్దపరుస్తాడు

సమస్య రాక ముందే దేవుడు పరిష్కారమును సిద్దపరుస్తాడు

మన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు, మనకు సంభవించబోయేవి, మనము ప్రవర్తించబోయే విధానము అన్నిటినీ దేవుడు ఎరిగినవాడుగా ఉండి వాటి మధ్య తన ఉద్దేశాలు నెరవేర్చుకొనుటకు ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేసేవాడుగా మన దేవుడు ఉంటాడు. నీవు జన్మించక ముందే నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, రాబోయే 10-15 సంవత్సరాల్లో నీ జీవితంలో ఏమి జరగాలో దేవుడు ముందుగానే ఉద్దేశించాడు. నీకు కలగబోయే కష్టనష్టాలు అన్నిటిలో నుండి విమోచించడానికి, బలపరచడానికి, కాపాడడానికి, దేవుడు ఇప్పటికే నీ కొరకు పరిష్కారాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు.

పరిచయం :

సమస్య వచ్చిన తర్వాత ఏమి చేయాలి ఏమి చేయాలి అని తొందరపడడం మానవుని విధానం. కాని దేవుడు సమస్య రాక ముందే పరిష్కారములు సిద్ధము చేసే వాడుగా ఉన్నాడు.

దేవుని వాక్యము కొరకు ఆసక్తిగల ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ మిమ్మలను ప్రేమతో రెఫీదీమ్ వాక్య ధ్యాన సమయముకు ఆహ్వానిస్తున్నాను.

అందరూ బాగున్నారా, ఈ సృష్టి పట్ల, ఈ సృష్టిలో ఉన్నవాటికి సంభవించబోయే విషయాల పట్ల ఆయనకు ఉన్న జ్ఞానమును, సమస్యల కొరకు ఆయన సిద్దపరచే పరిష్కారములను ఆదికాండము 12-50 అధ్యాయముల లోని భక్తుల జీవితముల ద్వారా తెలుసుకుందాం.

మనం కొన్నిసార్లు ఊహతో ప్రణాళికలు చేసి సర్వజ్ఞానులమన్నట్టు మాట్లాడతాము. కానీ దేవుడు నిజంగానే సర్వజ్ఞానియై ఉన్నాడు గనుక జరగబోవునదేదో ఆయనకు ముందుగానే తెలుసు గనుక, తాను ఎన్నుకున్న ప్రజలకు మేలు చేయు నిమిత్తమై చాలా ముందస్తు ప్రణాళికలు ఆయన కలిగి ఉంటాడు. 

ఈ లోకంలో ఉన్నది ఏది దేవునిని ఆశ్చర్యపరచలేదు, కారణం దేవుడు సమస్తమును ఎరిగిన వాడుగా ఉన్నాడు.

సంతానము లేని స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు ఎన్నుకొని నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానమును నిలబెట్టుకుంటూ  100 సంవత్సరాల వయసులో అబ్రహాము శారాలే ఊహించని తరుణంలో వారికి ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆయన పేరే ఇస్సాకు.

ఈ ఇస్సాకును దేవుడు దీవించి ఇద్దరు పిల్లలను ఇచ్చాడు, వారిలో ఒక అతని పేరు ఏశావు, మరొకని పేరు యాకోబు. దేవుడు తన ప్రణాళికను కొనసాగించడానికి యాకోబును ఎన్నుకున్నాడు.

తాను ఎన్నుకున్న యాకోబును ఒక పెద్ద కుటుంబముగా చేశాడు, ఈ పెద్ద కుటుంబానికి భవిష్యత్తులో ఒక కరువు రాబోతున్నది. 20 సంవత్సరాల్లో రాబోయే కరువు నిమిత్తమై దేవుడు ముందుగానే ప్రణాళికలు చేశాడు. ఆ కరువులో ఆ కుటుంబాన్ని కాపాడడానికి ప్రణాళిక చేస్తూ యాకోబు కుమారుడైన యోసేపును ఐగుప్తుకు దేవుడు పంపించాడు.

అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. -ఆదికాండము 45:5

ఇందులోను దేవునికొక ఉన్నతమైన దూరదృష్టి ఉన్నది. దేవుడు అబ్రహాముకు తాను నివసిస్తున్న కనాను దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు, అది తనకు ఎప్పుడు సొంతం అవుతుంది అని అబ్రహాము అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తూ, ఈ ప్రాంతంలో ఇప్పటికే నివసిస్తున్న అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు. 

కాబట్టి నీ సంతానపు వారు తామెరగని దేశంలో 400 సంవత్సరాల పాటు బానిసలుగా ఉండి శ్రమను అనుభవిస్తారు, ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో వారు ఇక్కడికి తిరిగి వస్తారు, ఇక్కడ ఉన్న వారిని వెళ్లగొట్టి దీనిని స్వాధీనం చేసుకుంటారు అని చెప్పాడు.

ఈ దేవుని ప్రణాళిక అర్థం కాని చాలామంది యూదులు ఎవరి దగ్గర నుంచో ఆ భూమిని లాక్కున్నట్టుగా మాట్లాడతారు, అక్కడ ఉన్న వారిని పంపించి వేయడం కూడా కొంతమందికి నచ్చదు. దేవుడు ఇక్కడ ఉన్న వారిని ఎందుకు పంపించి వేస్తున్నాడు? దేవుని విధానమే అది, తనకు అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని తుడిచి వేయడమే.

ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. -ఆదికాండము 15:13-16

ఈ ప్రజలకు 400 సంవత్సరాల సమయం ఇచ్చాడు, ఈ సమయంలో వారు వారి జీవితాన్ని మార్చుకుంటే వారి పట్ల దేవుని ఉద్దేశాలు మరో రకంగా ఉండేవి, అయితే ఇక్కడ వారు మార్చుకుంటారో లేదో కూడా దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. 

అయితే వారు మార్చుకోకపోతే వారి అక్రమమునకు దేవుడు శిక్ష విధించే స్థాయికి వారు చేరుకుంటారు కనుక దేవునికి ఇష్టము లేని జీవితాన్ని వారు జీవిస్తున్నందుకు వారిని అక్కడి నుండి తొలివేసి, తనకిష్టమైన జీవితాన్ని జీవించే వారికి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసేవాడిగా దేవుడు ఉంటాడు. 

అబ్రహాముకు దేవుడు చెప్పిన ఈ మాటల్లో భాగంగా ఐగుప్తులో నివసించడానికి మొదటిగా యోసేపును దేవుడు పంపించాడు, ఆ తర్వాత యాకోబు కుటుంబాన్ని కూడా దేవుడు పిలిపించాడు.

మొత్తానికి కరువు సంవత్సరాలు వచ్చాయి ఆ కరువు సంవత్సరాల్లో ఐగుప్తుకు చేరిన యోసేపు ఒక ఆర్దిక మంత్రి హోదాలో ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయన కాలములో యాకోబు కుటుంబం 70 మందిగా కరువును తప్పించుకొనడానికి ఐగుప్తుకు చేరిన వారుగా ఉన్నారు. దేవుడు ఎంత ముందస్తుగా తన ప్రణాళికలు చేస్తున్నాడో గమనించండి.

 మన విమోచనను గూర్చిన ప్రణాళిక, యేసుక్రీస్తు వారి సిలువ మరణము ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాలనే ప్రణాళిక, మానవులు పాపము చేసినప్పుడు దేవుని మనసులో నుండి హడావుడిగా పుట్టినది కాదు, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకొరకు నియమించబడ్డారు.

మన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు, మనకు సంభవించబోయేవి, మనము ప్రవర్తించబోయే విధానము అన్నిటినీ దేవుడు ఎరిగినవాడుగా ఉండి వాటి మధ్య తన ఉద్దేశాలు నెరవేర్చుకొనుటకు ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేసేవాడుగా మన దేవుడు ఉంటాడు.

 నీవు జన్మించక ముందే నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, రాబోయే 10-15 సంవత్సరాల్లో నీ జీవితంలో ఏమి జరగాలో దేవుడు ముందుగానే ఉద్దేశించాడు.

నీకు కలగబోయే కష్టనష్టాలు అన్నిటిలో నుండి విమోచించడానికి, బలపరచడానికి, కాపాడడానికి, దేవుడు ఇప్పటికే నీ కొరకు పరిష్కారాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు.

 సమస్యలను చూచి దిగులు చెందకు, సమస్త మెరిగిన దేవునికి మౌనంగా నిన్ను నీవు అప్పగించుకో, ఆయన మీద ఆనుకో, ఆయన నీ కొరకు ముందస్తుగా తయారు చేసిన ప్రణాళికలను అవసరమైన సమయంలో నెరవేర్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు.

ముందస్తు ప్రణాళికలు మా కొరకు సిద్ధపరుస్తున్న దేవా, అన్ని సందర్భాల్లో నీ మీద ఆనుకొని ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగిపోయే భాగ్యము మాకు దయచేయండి. 

ముగింపు :

ఆమెన్,  దేవుని మీద ఆనుకొని ఆయన ప్రణాళిక కొరకు ఎదురు చూసే వారి జీవితములను ఆయన సుందరముగా నిర్మిస్తాడు. 

 ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడైయుండును గాక. ఆమెన్. 

Post a Comment