తేజస్సుగలవాడు



తేజస్సుగలవాడు


తేజస్సుగలవాడు

శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. -కీర్తనలు 45:3

తేజస్సు అనే పదానికి కార్యనెరవేర్పుగల సామర్ధ్యం, ప్రకాశము, వెలుగు, గొప్పతనం, శోభ అనే అర్ధములు చెప్పవచ్చు. రాజులకు తేజస్సు ఉండాలి అని అంటారు. ఇక్కడ రాయబడిన తేజస్సు అనే ఈ పదము కత్తిని గూర్చి చెప్పబడింది అని కొంతమంది వ్యాఖ్యాన కర్తల అభిప్రాయం. 

నీ గొప్పతనముకు కారణమైన కత్తిని ధరించుకొనుము అని కోరహు కుమారులు అడుగుతున్నట్టు వారి భావం. ఈ భావము సరైనదే అయినప్పటికీ మనము దీనిని విడదీసి కూడా చూడవచ్చు. అలా విడదీసి చూస్తే తేజస్సు అనగా ప్రకాశము, లేదా వెలుగు అని అర్థం చేసుకొనవచ్చు. 

గడచిన భాగములో ఆయన ఖడ్గము ద్వారా ఏమి సాధిస్తాడో తెలుసుకున్నాము గనుక ఈ భాగములో ఆయన తేజస్సు గురించి ఆలోచన చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తువారు గొప్ప తేజస్సుగలవాడుగ ఉన్నాడు.

ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. -ప్రకటన గ్రంథం 1:16
ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది అని మనము ఇక్కడ చూస్తున్నాము. పత్మాసు ద్విపములో యోహాను ఈ దృశ్యమును చూసాడు కాని దానికంటే ముందే యోహానుకు ఈ అనుభవం ఉన్నది. యేసుక్రీస్తువారు రూపాంతరము పొందినప్పుడు వారు దీన్ని చూసారు.
ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను. -మత్తయి 17:2
అపొస్తలుడైన పౌలు తాను సౌలుగా ఉన్నప్పుడు ఈ అనుభవమును పొందాడు.
రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. -అపో.కార్యములు 26:13

యేసుక్రీస్తు వారి ముఖము ఎంతో తేజస్సు కలిగింది, కాని ఆ ముఖము మీదనే చాలా మంది ఉమ్ము వేసారు.

 అప్పుడు వారు ఆయన ముఖముమీద ఉమ్మివేసి, ఆయనను గుద్దిరి; -మత్తయి 26:67

వెలుగు కలిగిన చోట చీకటి ఉండలేదు, వెలుగు మూలముగా రహస్యమైన బయలుపడతాయి, యేసుక్రీస్తు వారి తేజస్సుగల ముఖమును నిదానించి చూచిన కొలది, మనలోని మచ్చలు బహిర్గతం అవుతాయి.

మా దోషములను నీవు నీ యెదుట నుంచుకొని యున్నావు నీ ముఖకాంతిలో మా రహస్యపాపములు కనబడుచున్నవి. -కీర్తనలు 90:8

 ఇక్కడ మోషే మాట్లాడుతున్నది తండ్రియైన దేవుని గురించి, అయితే ఇక్కడ మనం దృష్టి పెట్టాల్సింది ముఖ కాంతి వలన కలిగే మేలు మీదనే దృష్టి పెట్టాలి. 

తేజస్సుగల యేసుక్రీస్తు వారు, లేదా ఆయన ముఖము లేదా ఆయన మాటలు మనకు దారి చూపగలడు, మన తప్పులు వెల్లడి చేసి దిద్దుకొనే అవకాశం ఇవ్వగలరు, అయితే ఇదే ముఖము పై మనము ఉమ్మి వేసేవారముగా ఉంటే అనగా ఆయన మాటలను తృణీకరించి  మన తప్పులను దిద్దుకొనకుండా కొనసాగిన వారంగా ఉన్నట్లయితే మనము పశ్చాతాపడవలసి ఉన్నది. 

 ఎందుకంటే భవిష్యత్తులో ఆయన సూర్యుని ప్రకాశమునకు మించిన తేజస్సు కలిగిన వాడుగా ఉంటాడు, గనుక అది మనలను మండించగలదు, సూర్యుని ప్రకాశము వలన దీవెనే కాదు కొన్నిసార్లు తీర్పు కూడా ఉంటుంది కనుక ఆ దినము రాకముందే తేజస్సుగల ప్రభువును ఆశ్రయించి దీవెనలు పొందుదాము.

Post a Comment