అనుగ్రహించు దేవుడు
ఆయన తన పండ్రెండుమంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టుటకును, ప్రతివిధమైన రోగమును ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరచుటకును, వారికి అధికార మిచ్చెను. - మత్తయి సువార్త 10:1
యేసు క్రీస్తు వారు ఏదో ఇచ్చినట్లుగా ఈ వచనం తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ మూడు ప్రశ్నలకు సమాధానమును చూద్దాం .
- ఎవరు ఇచ్చారు?
- ఎవరికి ఇచ్చారు??
- ఏమి ఇచ్చారు???
1. మనం కలిగి ఉన్న ప్రతిది దేవుడు ఇచ్చినదే. దానిలో అనుమానం లేదు. శ్రేష్ఠమైన ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నుండి మాత్రమే వచ్చింది. కాబట్టి కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సి ఉంది.
2. యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఇచ్చారు. శిష్యుడు అనగా ఒక గురువు దగ్గర ఉంటూ ఆయన మాటలు వింటూ నేర్చుకొనే తత్వం గలవాడు. అలా ఉంటే కచ్చితంగా ఒక దినము శిష్యుడు కూడా గురువు వలె ఉంటాడు, దానిలో అనుమానం లేదు.
అయితే మనం శిష్యుల వలె దేవుని సన్నిధిలో ఉన్నామా? అనుదినం ఆయన దగ్గర నుండి నేర్చుకొంటూ ఉన్నామా? ఆదిమ క్రైస్తవులకు, క్రైస్తవులు, విశ్వాసులు, అన్నా పేరు కన్నా శిష్యులు అనే పేరునే యెక్కువ గా వాడారు. కాబట్టి యేసు ప్రభువు సన్నిధిలో శిష్యులమై "నా దగ్గర నేర్చుకోండి" అని ఆయన ఇచ్చిన పిలుపు కు లోబడి నేర్చుకుందాం. దిన దినము ఆయన వలె మారడానికి ప్రయత్నం చేద్దాం.
3. యేసు ప్రభువు వారు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. మరో సువార్తికుడు రాసిన విధముగా ఆయన వారికి వరము ఇచ్చాడు అని చెప్పవచ్చు. మిగతా వారికి ఆ వరము లేదు. దేవున్ని మనం వెంబడించి నడిస్తే మనకు కచ్చితంగా దైవికమైన వరములు యెన్నో ఆయన ఇస్తారు.
ఇప్పటికే దేవుడు మనకు యెన్నో తలాంతులు ఇచ్చి ఉంటాడు. నీలో ఉన్న వరమును గుర్తించి, దానిని మండించుకుంటూ దేవుని నామమును మహిమ పరచుదాం. నీకు యే వరము లేదని దిగులు చెందక దేవునికి దగ్గరగా నడువు ఆయనే తగిన కాలమున నిను గొప్ప చేస్తాడు.
ఆర్. సమూయేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి