భయపడకు - భక్తి కలిగియుండు - దేవుడే బలమునిస్తాడు

     భయపడకు 

భక్తి కలిగియుండు 

దేవుడే బలమునిస్తాడు  

    


    జీవితం దుర్భరంగా అనిపిస్తోందా??  ఏమి చేయాలో దిక్కు తోచడం లేదా??  శరీరములో వ్యాధులు ఇంక నువ్వు ఎంత కాలం బ్రతుకుతావులే అని వెక్కిరింపుగా నవ్వుతున్నాయా! నీ తోటి వారి మరణం నిన్ను బాధిస్తూ, భయపెడుతున్నదా?? 

   నేనే లేకపోతే నా పిల్లల గతి ఏమిటో అని ఆందోళన పడుతున్నావా?? భక్తిహీనుల క్షేమం నీ భక్తిని ప్రశ్నిస్తూ, భక్తి చేసి ఏమి లాభం లే అనే భావం కలిగిస్తోందా?? ఆర్ధిక ఒత్తిడి, అప్పుల సమస్య ఆత్మహత్య వైపు నడుపుతున్నదా?

     ఈ కరోనా వైరస్ వలన ఇంకా కుంగిపోతున్నావా? చుట్టూ ఉన్న పరిస్థితులు మనసులో శాంతి లేకుండా చేస్తున్నాయా ?? 

   బలపరచి బాగుచేయవలసిన డాక్టర్లు భయపెడుతున్నారు. వైద్యం చేయవలసిన వైద్యశాలలు వ్యాపారం చేస్తున్నాయి. పట్టించుకోవలసిన ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. పరిస్థితి చేయి దాటి పోయింది. 

    ఇప్పుడు నేను ఏమి చేయాలి?? ఎవరికి చెప్పాలి?? ఎవరిని అడగాలి?? ఇలా ఆలోచిస్తూ అధిక సమయం చింతాక్రాంతుడవై గడుపుతున్నావా? నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావా?? 

    ఓ భక్తిహీనుడు అలా ఉంటాడు కానీ  దేవుని యందు భయం భక్తి కలిగిన మనం అలా ఉండుటకు వీలు లేదు. ఎందుకంటే భక్తి భయం తన యందు కలిగివుండే వారి విషయంలో దేవుడు ఇలా చేస్తాడు.... 


" యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును. 

 

యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు. దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును. అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు  వాడు భయపడడు. 

                     

వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును ".  (కీర్తన 112)

నన్ను బలపరచిన ఈ మాటలు మిమ్మల్ని కూడా బలపరుస్తాయి అని ఆశిస్తూ....

ఆర్. సమూయేలు

Post a Comment