God will make a way /అయ్యో! నాకు ఎవరూ లేరే అని కుమిలిపోకు!!/Telugu christian thoughts 2021


God will make a way /అయ్యో! నాకు ఎవరూ లేరే అని కుమిలిపోకు!!/Telugu christian thoughts 2020

  

అయ్యో! నాకు ఎవరూ లేరే అని కుమిలిపోకు!!

  జీవితంలో పెద్దమనుషుల అండ ఉంటే ఏమైనా చేయగలుగుతామని చాలా మంది భావించి వారి దయను పొందడానికి చాలా ఎక్కువగా ప్రాకులాడతారు. అయితే కొన్నిసార్లు మనకు మేలు చేస్తామన్న పెద్ద మనుషులే వారి సొంత ప్రయోజనాల కొరకు మనలను ఇబ్బందులలో పడవేస్తారు. మరి కొన్ని సార్లు మనకు తెలిసిన పెద్దవారు ఎవరూ ఉండరు, అలాంటి పరిస్థితిలో మనకు దిక్కు ఎవరు? ఏ పెద్దమనుషుల అండ లేని ఓ యువకుడు ఒక పెద్దమనిషి వలన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏమి చేసాడో ఈ క్రింది భాగములో చూద్దాం. 

    యాకోబు అనే ఆసామికి యోసేపు అనే ముద్దుల కొడుకు ఉన్నాడు, ఆ తండ్రికి ఇంకా 11 మంది కొడుకులు ఉన్నాగాని యోసేపు మీదనే ఎక్కువ ప్రేమ చూపించడం వలన దానిని తట్టుకోలేని యోసేపు అన్నలు ఆయనను బానిసగా అమ్మివేసారు. బానిసగా ఆయనను కొనుకున్న వారు ఆయనను ఐగుప్తు లోనికి తీసుకువచ్చి అమ్మివేయగా అక్కడ ఒక పెద్ద పోలీస్ అధికారి ఆయనను తన బానిసగా కొనుక్కొని ఇంటికి  తీసుకువెళ్లాడు. ఆ ఇంట్లో కొంత కాలం ఉన్న తర్వాత ఆ ఇంట్లో ఉన్న పోలీస్ అధికారి భార్య యోసేపు మీద ఆశపడి ఆయనను శోధించి వేధించింది. యోసేపు ఏమాత్రము తనకు లొంగకపోయేసరికి, యోసేపును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశముతో తనను పాడుచేయడానికి అతను ప్రయత్నించాడని తన భర్తకు చెప్పి చెరసాలలో వేయించింది.

    యోసేపు దేశము కాని దేశములో ఉన్నాడు,  తండ్రి వలె తనను చేరదీసిన పోలీస్ అధికారే తనను అపార్థం చేసుకొని చెరసాలలో వేయించాడు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? తండ్రి లేడు, తల్లిని ఎప్పుడో కోల్పోయాడు, పెద్దమ్మలు కూడా తండ్రి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు తాను ఇక్కడ ఒంటరిగా దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు.  

    అలా యోసేపు తాను చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తూ చాలా కాలంగా చెరసాలలో ఉన్నాడు. అయితే తాను ఉన్న దీన స్థితిని బట్టి దిగులు చెందక అక్కడ పని చేయుటకు, సేవ చేయుటకు తనకు కలిగిన అవకాశములను చక్కగా ఉపయోగించుకొంటూ ముందుకు సాగాడు.  దేవుడు తనకు అన్ని అక్కడ అనుకూలపరచాడు .  

    చెరసాల ఎంత మంచిగా ఉన్నా సరే  జీవితకాలం అక్కడే ఉండిపోవాలని ఏ వ్యక్తి ఆశించడు. ఒకవేళ వారు అక్కడే ఉద్యోగం చేసే వారైతే తప్ప మిగతావారు ఎవరు కూడా ఆ విధంగా కోరుకొనరు. అలాగే యోసేపు అక్కడ ఉన్న అధికారులతో మమేకమై కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ కొనసాగుతున్నప్పటికీ వీలైనంత త్వరగా అక్కడ నుండి బయటకు రావాలని ఆశించాడు. 

    అయితే తాను అందుకొరకు ఏమి చేయగలడు? తనను అక్కడ చెరసాలలో వేసింది ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి, ఆయనను కాదని తనకు సాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ తనకు ఎవరైనా సాయం చేయాలంటే వారు మరొక ఉన్నత స్థాయి లేదా జాతీయ స్థాయి అధికారులై ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో యోసేపు ఏమి చేయగలడు? తన నిర్దోషత్వమును ఏ విధంగా నిరూపించుకోగలడు? యోసేపు లాంటి పరిస్థితిలో నేడు మగ్గిపోతున్న ఖైదీలు చాలా మంది ఉన్నారు.  

    మనము అలాంటి  పరిస్థితిలో ఉంటే ఎవరైనా గొప్ప లేదా పెద్దవారి చేత సిఫార్సు చేయించడానికి ప్రయత్నం చేస్తాము. అలా చేయడానికి పెద్దవారితో సంబంధాలు ఏర్పాటు చేసుకొనడానికి వాటిని పెంచుకొనడానికి ప్రయత్నం చేస్తాము. మంచి న్యాయవాదిని మన పక్షముగా వాదించడానికి ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటే ఆ ప్రయత్నం కూడా చేస్తాము. 

    కానీ యోసేపు ఇక్కడ ఏమి చేయగలడు? బయటకు వెళ్లలేని పరిస్థితి, తన వారు ఎవరూ అక్కడ లేరు. ఒకవేళ తనవారు ఎవరైనా ఉంటే వారు తనను బయటకు తీసుకురావడానికి తాము చేయగలిగిన ప్రయత్నాలు చేసేవారే కానీ యోసేపు ఇక్కడ ఒంటరివాడుగా మిగిలిపోయాడు. ఇలాంటి పరిస్థితిలో దేవుడే ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులను ఖైదీలుగా చెరసాలకు పంపాడు.

    ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజసంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. - ఆది 40:2.3

    కఠిన పరిస్థితిలో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తించాలి అనే దానికి యోసేపు ఒక చక్కని ఉదాహరణ. తాను ఉన్న చెరసాలకు ఖైదీలుగా వచ్చిన ఆ ఉన్నత అధికారులకు అయన తనను తాను తగ్గించుకొని పరిచర్య చేసాడు. 

    ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. - ఆదికాండము 40:4 

    సేవ చేయడంలోనూ ఏదో ఆశించి సేవ చేసేవారు ఉంటారు. వారి వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉండదని వారు భావిస్తే వాళ్ళ ముఖం కూడా చూడరు. మొత్తానికి యోసేపు నిస్వార్ధముగా వారికి సేవ చేసాడు అని చెప్పవచ్చు, 

    వారు ఖైదీలుగా చెరసాలకు వచ్చినప్పుడు వారి వలన తనకు ఏమైనా లాభం కలుగుతుందని యోసేపు ఆలోచన చేసి ఉంటాడా? అవకాశమే లేదు అన్పిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కలలు కనే వరకు ఎవరి భవిష్యత్ ఏమిటో అనుదానిని గూర్చి స్పష్టత లేదు. 

    కాబట్టి జీవితములో  కఠిన పరిస్థితిలు ఏర్పడినప్పుడు మనము ఆ స్థితిలో ఏమి చేయగలము అను దానిని గూర్చి ఆలోచించాలి. దిగులు విచారాలు పరిస్థితిని ఏమాత్రము చక్కదిద్దలేవు.  యోసేపు వంటి దిక్కు తోచని, ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని స్థితిలో ఉంటే యోసేపు వంటి విశ్వాసము, సత్ప్రవర్తన, సేవాభావం కలిగియుండి దేవుని పై భారం మోపుతూ ముందుకు సాగితే దేవుడే ఏదో ఒక దారి చూపుతాడు. 

    నేను ఒంటరివాడను, చేతకానివాడను అని కుమిలిపోవడం వలన ప్రయోజనం లేదు. మనకంటే మెరుగైన పరిస్థితులు కలిగియున్న వారిని చూచి వ్యసనపడడం వలన కూడా ఒరిగేది ఏమి లేదు. దాని వలన మన మనసు పాడవుతుంది తప్ప మేలు కలగదు.  

    యోసేపు జీవితంలో రోజులు గడుస్తుండగా కొంత కాలమునకు చెరసాలకు వచ్చిన ఆ ఉన్నత అధికారులు కలలు కన్నారు, వారికి దేవుడే ఆ కలలు ఇచ్చాడు అనడంలో సందేహం లేదు, దీని వలన యోసేపు కలలకు భావం చెప్పగల సమర్డత కలిగిఉన్నాడని పానదాయక అధిపతి తెలుసుకోవాలి, భవిష్యత్ లో ఫరోకు కల వచ్చినప్పుడు యోసేపును గూర్చి ప్రస్తావించాలి. దాని ద్వారా దేవుడు కోరుకున్న ఉద్దేశం నెరవేరాలి అనేదే ఇక్కడ వీరికి కలలు ఇవ్వడంలో అయన ప్రణాళిక గా కనబడుతున్నది.   

    చివరగా, మనం పెద్ద మనుషులతో సంబంధాలు కలిగి ఉండాలని ఆశపడుతాము, ఈ పెద్ద మనుషులు లేదా నాయకులు మనలను ఉద్ధరిస్తారు అని భావిస్తాము మరియు విశ్వసిస్తాము కానీ చాలా సందర్భాల్లో వారు మనకు చేసే మేలు లేదా సహాయము పరిమితమే. అంతేకాదు మనము దిక్కు తోచని, నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ పెద్ద మనుషులను మనము నేరుగా వెళ్లి కలుసుకోలేని పరిస్థితిలు ఉంటే, మనకు వారి సహాయం అవసరమని దేవుడు యెంచితే ఖచ్చితంగా దేవుడే వారిని మన దగ్గరకు తీసుకువస్తాడు. కాబట్టి మనము ఈ విషయము గమనించి కలిగిన దీన అవస్థను బట్టి కృంగిపోక దానిని సరిగా ఉపయోగించుకుంటూ, విశ్వాసము, సత్ప్రవర్తన సేవాభావం కలిగి అందరికంటే పెద్దవాడైన దేవునితో సంబంధాలు కలిగి ముందుకు సాగుదాం. మనలను విడువని దేవుడు మనకు   తప్పక మేలు చేస్తాడు. 

ఆర్. సమూయేలు 

2 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి