కష్టాలు అన్ని నాకే అని బాధపడకు
మూయబడిన దారులను గూర్చి చింతపడకు, దాని మూలంగా తెరవబడుతున్న దారులను గురించి సంతోషించు. కష్టాలు అన్ని నాకే అని బాధపడకు, అవి నిన్ను ఎలా మార్చుతున్నాయో, ఎక్కడికి చేర్చుతున్నాయో గ్రహించి దేవునికి లోబడి జీవించు.
కష్టాలు మన జీవితంలో కలిగినప్పుడు మనం రకరకాలుగా స్పందిస్తూ ఉంటాము. భక్తి గలవారు అది వారి భక్తి లోపం అనుకుంటారు. వారి పాపం వారిని ఆ స్థితికి చేర్చింది అని భావిస్తుంటారు. అయితే నిజముగా దేవుడు మన జీవితంలో కష్టాలు అనుమతించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రతి శ్రమ కూడా మేలుకరమైనదే. మనలను సరిద్దడం లేదా హెచ్చించడం దీని ద్వారా జరుగుతుంది. శ్రమ కలిగినప్పుడు ఈ మూడు పనులు చేయండి.
- దేవునికి ప్రార్థన చేయండి
- దేవుని చిత్తమును గ్రహించండి.
- దేవునికి లోబడి ఉండండి.
యోసేపు జీవితం
యోసేపు జీవితంలో తాను అనేక శ్రమలను అనుభవించాడు. తప్పు చేయడం వలన అవి ఆయనకు సంభవించాయా? ఎలా అర్థం చేసుకోవాలి? తన కలలు ఇంట్లో పెద్దవారికి చెప్పడం తప్పా? తన అన్నల తప్పిదాలు వారి తండ్రికి తెలియజేయడం తప్పా? తండ్రి మాట చొప్పున తన అన్నలను వెదకుతూ రావడం తప్పా? అందుకే గుంటలో వేయబడ్డాడా? అందుకే బానిసగా అమ్మబడ్డాడా?
పోతీఫరు ఇంట్లో నమ్మకమైన పనివానిగా ఉండడం తప్పా? అక్రమ రీతిలో శరీర వాంఛను తీర్చుకొనక తప్పించుకొని వెళ్లడం తప్పా? అందుకే చెరసాలలో వేయబడ్డాడా? తాను కూడా అన్నల వలె తప్పు చేస్తూ అన్నల తప్పులను గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో, అప్పుడు గుంటను తప్పించుకొనేవాడు. పోతీఫరు ఇంట్లో దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ఉంటే బాగుండేది జైలు జీవితం తప్పేదేమో. ఇంత సంకుచితముగా మన ఆలోచనలు చాలా సార్లు ఉంటాయి. మన శ్రమలో దైవ చిత్తం చూడకపోతే జీవితం అర్దం లేనిదిగా అనిపిస్తుంది.
దేవుని కోణం
ఇప్పుడు దేవుని కోణంలో యోసేపు జీవితమును చూస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. కష్టాలు ఆయన జీవితంలో పైకి జరగడానికి దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ప్రయోజనకరం అయ్యాయి. గుంట అనుభవం తాను దేవుని పైన మాత్రమే ఆనుకోవాలి అనే విషయం నేర్పించినది. తను పడిపోయినా, పడవేయబడినా, తనను తిరిగి లేపే దేవుడు ఉన్నాడని గుంట అనుభవం స్పష్టం చేసింది. మనుషుల కోపమును కక్షను కూడా ఉపయోగించుకొని దేవుడు తన చిత్తం నెరవేర్చుకోగలడు అని రుజువు చేయబడింది.
బానిసగా అమ్మబడడం అనే అనుభవం మనుషుల మనస్తత్వం ఎలాంటిదో అను విషయం తను గ్రహించే విధంగా చేసింది అని చెప్పవచ్చు. బానిసగా తాను నూతన ప్రాంతాలు, దేశాలు చూసే అవకాశం పొందాడు. తాను బానిస అయినప్పటికీ ఆ ఇంట్లో పెత్తనం చేసే అవకాశం పొందాడు. అది తనకు పరిపాలన విధానం పట్ల ఒక అవగాహన కలిగించింది. జైల్లో వేయబడడమే తాను ఆ దేశములో మంత్రి పదవి పొందడానికి అవకాశం కల్పించింది. కాబట్టి మూయబడిన దారులను గూర్చి చింతపడకు, దాని మూలంగా తెరవబడుతున్న దారులను గురించి సంతోషించు.
ముగింపు
కష్టాలు అన్ని నాకే అని బాధపడకు, అవి నిన్ను ఎలా మార్చుతున్నాయో, ఎక్కడికి చేర్చుతున్నాయో గ్రహించి దేవునికి లోబడి జీవించు. కష్టాలు యోసేపును గొప్ప ఆశీర్వాదము కొరకు సిద్ధపరచాయి. నీ జీవితంలో కూడా అవి మేలుకే కాబట్టి నీవు కూడా మేలుకో.
- ఆర్. సమూయేలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి