అత్యాశ కలిగియుండవద్దు
సూచనలు :
- క్రింద ఇవ్వబడిన వాక్యభాగమును మీరు ప్రార్ధనపూర్వకముగా చదవండి.
- పాఠ్యభాగమును మీరు బాగా చదివి అర్థం చేసుకొని అందులోని విషయాలు మీకు ఇవ్వబడిన సూచనల ప్రకారం వివరించండి.
వాక్యభాగము :
ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా, ఆయన ఓయీ, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని నేనీలాగు చేతును; నా కొట్లు విప్పి, వాటి కంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను. దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను. -లూకా 12:13-21
పాఠ్యభాగము :
ఆ రోజు మధ్యాహ్న భోజనంలో హాస్టల్ లోని పిల్లలందరికి ఒక్కొక్కరికి 2 గుడ్లు ఇవ్వడం జరిగింది. అందరికి పంచగా ఆఖరిలో ఒక గుడ్డు మిగలగా దాని కొరకు రూఫస్ మరియు రవి అనే ఇద్దరు పిల్లలు కొట్టుకోవడం ప్రారంభించారు. రవి అది తనకే కావాలి అని తన ప్లేట్ లో వేసుకుంటే, దానిని నాకు ఇప్పించమని టీచర్ దగ్గరికి వెళ్ళాడు రూఫస్. మీకేమి అర్థమైంది??
అది చూసిన టీచర్ కి ఏమి చెప్పాలో పాలుపోలేదు, అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎందుకు టీచర్ ఏమి చెప్పలేకపోయింది? వారిద్దరి దగ్గర అప్పటికే రెండు రెండు గుడ్లు ఉన్నాయి, అయినప్పటికి మిగిలిన ఆ ఒక్క గుడ్డు కోసం కొట్టుకుంటూ ఉన్నారు.
యేసుక్రీస్తు వారి యొద్దకు సరిగ్గా ఇలాంటి సమస్య ఒకసారి వచ్చింది. ఆస్తి పంచమని నా సహోదరునితో చెప్పండి అని అతను అడిగాడు ,దానికి యేసయ్య మీ మీద నన్ను తీర్పరిగా ఎవరు నియమించారు అని అడిగారు. వాస్తవమునకు ఆ రోజుల్లో భోధకులు ఈ వ్యవహారాలు కూడా చక్కబెట్టేవారు, కాని యేసయ్య వారి సమస్యను పరిష్కరించకుండా దానికి మూలమైనదానిని పరిష్కరించే ప్రయత్నం చేసాడు.
ఎందుకు యేసయ్య వారి ఆస్తి వ్యవహారం లోనికి దూరలేదు? ఎందుకంటే ఆస్తిలో భాగం అడుగుతున్న వ్యక్తికి ఎంతో కొంత ధనం అప్పటికే ఉండి ఉంటుంది, అయితే దానికి తోడు వాళ్ళ నాన్న లేదా అన్న ఆస్తిలో భాగం వస్తే ఇంకా బాగుంటుంది అని భావిస్తున్నాడు. ఆస్తి పంచాలసిన వ్యక్తికి కూడా ఎంతో కొంత ధనం ఉండి ఉంటుంది, అయినప్పటికి తన తండ్రి ఆస్తి మీద కూడా తాను ఆసక్తి కలిగియున్నాడు, ఒక వేళ ఈ వ్యక్తి ఇంట్లో పెద్దవాడైతే అతనికి తండ్రి ఆస్తిలో రెండు భాగములు వస్తాయి, అప్పుడు ఇంకా పరిస్థితి క్లిష్టముగా మారుతున్నది, వారి సమస్యను అది ఇంకా పెద్దదిగా మార్చుతుంది.
ఇక్కడ వీరిద్దరిలో ఉన్న సమస్య అత్యాశ, వారు కలిగియున్న దానితో తృప్తి పడకుండా ఇంకా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. అయితే యేసయ్య వారికి చెప్పిన సమాధానం ఏమిటంటే, మీరు ఇలా ఆస్తులు ఎంత పెంచుకుంటూ పోయినా అది మీకు జీవమును, సుఖమును సంతోషమును ఇవ్వలేవు అని చెప్పాడు. దానిని వివరించడానికి ఒక వెర్రి ధనవంతుని గురించి చెప్పాడు.
ఈ ధనవంతునికి పంట బాగా పండితే దానిని దాచడానికి స్థలము లేక అది ఇప్పుడు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. తన కొట్లు పెద్దవి చేసుకుంటాను అని నిర్ణయం చేసికొని, తన ప్రాణంతో తినమని, త్రాగమని, సుఖించమని, చాలా సంవత్సరాలకు సరిపడా ఆహారం సమాకూర్చానని, నీకేమి ఇబ్బంది లేదని చెప్పుకుంటూ ఉన్నాడు, అయితే ఈ రాత్రి నీ ప్రాణం పొతే నీవు సంపాదించి పెట్టింది, ఎవరి వశం అవుతుంది అని దేవుడు అడుగుతున్నాడు అని యేసయ్య తెలియజేసాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి