దేవుని కొరకు కనిపెట్టుకుందాం!
దాసుల కన్నులు తమ యజమానుని చేతితట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతితట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించువరకు మన కన్నులు ఆయనతట్టు చూచుచున్నవి. - కీర్తనలు 123:2
క్రైస్తవుల జీవితంలో క్రిందా, మీద పడే పరిస్థితులు ఉంటాయి. కొన్ని సార్లు క్రీస్తును నమ్ముకున్నందుకు, ఇంకొన్ని సార్లు మన స్వీయ తప్పులను బట్టి ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటాము.
అయితే మన ఇబ్బందులులలో ఎవరి వైపు చూడాలి? ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి?? మనలను కొట్టినా, తిట్టినా, ఇబ్బందులు అనుమతించినా అది దేవుడే చేయాలి. దేవుని అనుమతి లేకుండా ఏది నిన్ను తాకదు, నీ ఇబ్బందులకు దేవుడు కారణం కాదు, కాని ఆయన అనుమతి లేకుండా అది జరగదు.
ఇప్పుడు నీకున్న ఏకైక మార్గం దేవుని కొరకు కనిపెట్టుకోవడమే! యజమానులు ఇచ్చే సూచనలు కొరకు దాసులు కనిపెట్టుకున్నట్టుగా నీవు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి.
ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నావా? బహుశా నీ జీవితంలో చాలా కాలముగా దేవుని కొరకు కనిపెట్టుకొని అలసిపోయి ఇంకెంత కాలం నేను కనిపెట్టుకోవాలి అని అడుగుతున్నావా?
దానికి సమాధానం ఏంటో తెలుసా?? దేవుడు నిన్ను కరుణించే వరకు! ఆయన ఎప్పుడు కరుణిస్తాడు?? అది నాకు తెలియదు, కాని ఒక్కటి మాత్రం తెలుసు ఆయన నిన్ను కరుణించే లోపల నీ జీవితం మారుతుంది, గుణాలు మారతాయి, దేవుడు కరుణించడం ఆలస్యం అవుతున్న కొలది నీలో సహనం పెరుగుతుంది.
ఆయన నిన్ను ఇంకా కరుణించడం లేదు అని అంటే దాని వెనుక ఇన్ని మంచి ఉద్దేశ్యములు దాచబడి ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో పరిస్థితి ఎంత దుర్భరముగా ఉన్నా, విసుగక ఆసక్తితో దేవుని కొరకు కనిపెట్టుకో, నిశ్చయముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి