మన దేవుడు సర్వజ్ఞుడు


మన దేవుడు సర్వజ్ఞుడు

    సాధారణముగా మనుష్యులమైన మనకు ప్రస్తుతము జరుగుతున్నది తెలుసు, అది కూడా మన చుట్టూ, మనకు దగ్గరలో వున్నవి మాత్రమే తెలుసు, వార్తపత్రికల్లో, టి. వి.ల్లో చూపించినది మాత్రమే తెలుసు అంతేకాని ప్రపంచమంత ఏమి జరుగుతున్నదో తెలియదు. 

    కాని మన దేవుని జ్ఞానం చాలా గొప్పది. దానిని మాటలలో వివరించడం సాధ్యం కాదు అయినప్పటికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.

    కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలు అధికముగా వున్నప్పుడు కొంత మంది నా కష్టాలు నీకేమి తెలుసు అని దేవునిని ఉద్దేశించి అంటూ వుంటారు. 

    మరి కొంతమంది నువ్వు మనిషివైతే కదా తెలియడానికి అని అంటూ వుంటారు. కాని అది ఎంతవరకు వాస్తవం! దేవునికి నిజముగా తెలియదా? అంటే ఆయనకు తెలుసు. ఆయనకు ఏమి తెలుసో నీకు తెలుసా?

1. మన ప్రస్తుత పరిస్థితులు: 

    ఆయన మన ప్రస్తుత పరిస్థితులు ఎరిగినవాడుగా వున్నాడు. ఇంతకమునుపు నేను చెప్పినట్లుగా మనకు ప్రస్తుత పరిస్థితులను గూర్చి వున్న జ్ఞానం చాలా పరిమితం, ప్రపంచమంతా వున్న విషయాలు, మనకు వార్తల్లో, టి. వి.లో చెప్పబడని విషయాలు మనకు ఏమాత్రం తెలియవు. కాని దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ప్రస్తుతము జరుగుచున్న ప్రతిదానిని ఎరిగియున్నాడు.

    అంతే కాదు, ఆయన ప్రతిస్థలములో ప్రస్తుతము ఏమి జరుగుతున్నదో ఎరిగినవాడుగా వున్నాడు. మనము ఒకవేళ ప్రస్తుతము ప్రతి స్థలములో ఏమి జరుగుతున్నదో తెలుసుకోవాలంటే మొదట ఒక ప్రాంతమును గూర్చి తెలుసుకొని, ఆ తర్వాత ఇంకొక ప్రాంతమును గూర్చి తెలుసుకోవలసి వుంటుంది. 

    మనం ఇలా తెలుసుకొనే లోగా ఇంకొక ప్రాంతములో మరొక సంఘటన చోటు చేసుకుంటూనే వుంటుంది. అయితే దేవుడు ఒకే సమయంలో ప్రపంచమంత జరుగుతున్న పరిస్థితులను ఎరిగినవాడుగా వున్నాడు. ఒక రకముగా చెప్పాలంటే ఆయన జ్ఞానం ఒక ప్రముఖ టి. వి. ఛానల్‌ను మించినదిగా వున్నది.

    దేవునికున్న జ్ఞానమును గూర్చిన అవగాహన మనలో ధైర్యమును, భయమును, విశ్వాసమును నిరీక్షణను కలిగించవలసియున్నది.

    ధైర్యమెందుకు? కొన్నిసార్లు మన కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని మన పెద్దవారికి తెలియపరచాలని ఇష్టపడతాము, కారణమేంటి? వారికి వాటిని మనం తెలియజేస్తే వారు మనకు దాని విషయంలో సలహా ఇస్తారనో, సహాయం చేస్తారనో ఆశ. వారికి మనం చెప్పిన తర్వాత వారి దగ్గర నుండి ఏదైనా హామి పొందిన తర్వాత చాలా ధైర్యముగా వుంటాము. 

    అంతేకాదు మన ప్రియలు ఎవరైనా ఇబ్బందులలో వున్నారని తెలుసుకొన్నప్పుడు మనం వారి నిమిత్తమై ఆలోచన చేసి ఎంతో కొంత సహాయం వారికి అందించే ప్రయత్నం చేస్తాము. 

    చెడ్డవారమైన మనమే ఇంత శ్రద్ద కనబరిస్తే.. మరి మంచివాడైన దేవుడు మన పరిస్థితులు తెలుసుకొని కూడా మౌనంగా వుంటాడా? లేదు కాబట్టి నా పరిస్థితులు దేవునికి తెలుసు అనే ధైర్యము కలిగి మనం ఈ లోకంలో ముందుకు సాగాలి.

    భయమెందుకు? మనం కొన్ని పొరపాట్లు చేసి దయచేసి వీటిని మా పెద్దవారికి చెప్పవద్దని బ్రతిమాలుకుంటాము. ఎందుకు? ఇక అవి మన పెద్దవారికి తెలిస్తే ఏమైనా ఉందా? వారు వాటిని బట్టి మనలను శిక్షిస్తారనే భయం మనలను అలా మాట్లాడిరపజేస్తుంది. 

    కొన్నిసార్లు మన పెద్దవారు మనలను గమనిస్తున్నారు, మనకు దగ్గరల్లోనే వున్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తపడతాము, వారు మన ప్రవర్తన విషయమై మనలను గద్దిస్తారేమో అని భయం మనలను ఆ విధముగా ప్రవర్తింపజేస్తుంది.

    అలాగే దేవుడు నా పరిస్థితులు ఎరిగియున్నాడు అనే విషయం మనలో భయమును కలిగించాలి. ఎందుకంటే దేవుడు ఉనికిలో వున్న ప్రతిదానిని గూర్చి జ్ఞానము కలిగియున్నాడు. 

    సృష్టిలో నిర్జీవమైన వాటిని గూర్చి జ్ఞానము కలిగియున్నాడు. కీర్త. 147:4లో చెప్పబడినట్లుగా నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు వాటికి ఆయన పేరులు పెట్టాడు. 

    దీని అర్థమేమిటి? ఆయన నక్షత్రములను కలుగజేసినప్పుడు అవి ఎన్ని ఉండాలో ఆయనే నిర్ణయించాడు. అంటే వాటి సంఖ్య ఎంతో ఆయన ఖచ్చితముగా తెలుసు.

    నక్షత్రముల సంఖ్య ఎంత అని మనం దేవునిని అడిగితే రెండు రోజులు సమయం ఇవ్వండి లెక్కబెట్టి చెప్తాను అనడు, అవి ఎన్నో ఆయనకు తెలుసు, లెక్కించవలసిన అవసరం లేదు. 

    అంతే కాదు వాటన్నిటికి ఆయనే పేరులు కూడా పెట్టాడు. నక్షత్రముల సంఖ్యను మాత్రమే కాదు, ప్రతిదానిని పేరుపేరున ఆయన ఎరిగియున్నాడు. అయితే ఆ జ్ఞానం లేనిదెవరికి? మానవునికే గదా! అబ్రాముతో దేవుడు నక్షత్రములును చూపించి నీకు చేతనైతే లెక్కించమన్నాడు. మనుష్యులుగా మనకు 2000 సం॥లు జీవించినా వాటిని లెక్కించడం సాధ్యం కాదేమో! , . ,

    ఆయన నిర్జీమైన వాటిని గూర్చే కాక జీవముగలిగిన మనుష్యులను గూర్చి కూడా జ్ఞానము కలిగియున్నాడు.

1. వారు చేసే పనులను గూర్చి (కీర్త. 33:13-15), ఆయన జ్ఞానము కలిగియున్నాడు. మనుష్యులు క్రియలను ఆయన విచారించుచున్నాడని ఈ వాక్యము తెలియజేయుచున్నది.

2. మనయొక్క హృదయమును, ఆలోచనను (కీర్త. 139:1-4), ఆయన ఎరిగియున్నాడు. తలంపు మనకు రాకమునుపే ఆయన దానిని ఎరిగియున్నాడు.

3. మన ఆశలను, భారములను (నిర్గ. 3:7; మత్త. 6:8) ఆయన ఎరిగియున్నాడు. నిర్గ. 3:7లో ఇశ్రాయేలీయుల బాధను చూచాను అన్నాడు. మత్త. 6:8లో మన అక్కరలు ఆయన ఎరిగియున్నాడు అని వ్రాయబడియున్నది.

    కాబట్టి మన పెద్దవారి నుండి మనం కొన్ని విషయాలు దాచగలమేమో గాని దేవుని నుండి దాచలేము. దేవుడు ఎల్లప్పుడు మనలను చూస్తున్నాడు ఆయన కునకుడు నిద్రపోడు. కాబట్టి దేవునియందు భయము కలిగి మనము నడచుకొనవలసియున్నది.

2. మన గతకాలపు పరిస్థితులు : 

    మన పెద్దవారు మనకు కొన్ని విషయాలు చెబితే తప్ప మనకు గతమును గూర్చిన అవగాహన వుండదు. అందుకే బైబిల్లో పిల్లలకు దేవునిని గూర్చి, వారి గతకాలపు విషయాలను గూర్చి బోధించాలని దేవుడు పలుమార్లు పెద్దలను ఆదేశించాడు (ద్వితి. 6:4`9). 

    పెద్దవారు బహుగా వృద్దులయ్యేవరకు జీవించాలని కోరుకొనవలసినది ఇందుకే (కీర్త. 71:18). అంతే కాదు చరిత్ర పుస్తకాల ద్వారా కూడా మనం ఈ జ్ఞానమును పొందుతాము, అందుకే చరిత్రకారుల పాత్ర చాలా కీలకమైనది. 

    అయితే బహిర్గతం కాని విషయాలు, వారి మనస్సుకే పరిమితమైన విషయాలు ఎవరికి తెలియవు కాని దేవుడు వాటిని కూడా ఎరిగియున్నాడు. 

    గతకాలంలో నీ హృదయమునకు చేయబడిన గాయములను గూర్చి ఆయన ఎరిగియున్నాడు. ఆయనకు కరెంట్‌ అఫైర్స్‌ పుస్తకాలు అవసరం లేదు.

    మన గతాన్ని ఎరిగినవాడే మనలను ప్రస్తుతము చక్కగా అర్థం చేసుకొనగలుగుతాడు. ఒక వైద్యుడు ప్రస్తుతము వున్న రోగమునకు మందు ఇవ్వాలంటే గతమును గూర్చి తెలుసుకోవాలి. అప్పుడే తాను మెరుగైన వైద్యం అందించగలుగుతాడు. 

    కాబట్టి మన గతాన్ని ఎరిగిన దేవుడు మనలను అద్భుతముగా నడిపించగలడు, గతంలో మనకు కలిగిన గాయములకు ప్రస్తుతము ఏ విధమైన వైద్యం చేయాలో, ఏ విధమైన భారములు మనం మోయగలమో, ఏ పనులు మనం చేయగలమో ఆయన ఎరిగి వాటినే మన ముందుకు తీసుకువస్తాడు గనుక ఆయనయందు సంపూర్ణ విశ్వాసం వుంచి ముందుకుసాగవలసియన్నది. 

    దేవుడు మన గతమును క్షమిస్తాడు, మారుస్తాడు, వాడుకుంటాడు. దేవుడు పౌలు, మోషే యొక్క పాండిత్యమును వాడుకున్నాడు. వారి బలహీనతల మధ్య దేవుని శక్తి కనబడిరది. 

    మోషే నత్తివాడు, పౌలు దేవుని పిల్లలను హింసించాడు, అయితే దేవుడు వారిని అద్బుతరీతిగా మార్చి వాడుకుంటూ పరిశుద్దాత్ముని ద్వారా జరుగు కార్యములను గూర్చి తెలియపరచాడు. 

    సాతాను మన గతమును జ్ఞాపకము చేసి కృంగదీయాలనుకుంటే దేవుడు దానినే వాడుకొని తన కార్యములు నెరవేర్చుకుంటాడు.

3. మన భవిషత్య్‌ను ఎరిగినవాడుగా వున్నాడు : 

    మనిషికి తన భవిష్యత్‌ను గూర్చి ఏమాత్రము జ్ఞానము లేదు. తాను ఎప్పుడు మరణిస్తాడో అతనికి తెలియదు. రాబోవు మరుక్షణం ఏమి జరుగుతుందో కూడా తనకు తెలియదు. అయితే దేవుడు నిత్యత్వము నుండి తనను గూర్చి తాను జ్ఞానము కలిగియున్నాడు మరియు ఈ విశ్వములో తన చేత సృజింపబడిన ప్రతిదానిని గూర్చియు, సాధ్యమయ్యే ప్రతి అంశమును గూర్చియు ఆయన జ్ఞానము కలిగియున్నాడు. 

    త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులు (తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు) మాత్రమే ఒకరి విషయంలో ఒకరు జ్ఞానముగలవారుగా వున్నారు (మత్త. 11:27; 1 కొరింథీ. 2:11).

    మత్త. 11:27లో కుమారుడు తప్ప తండ్రిని ఎవరు ఎరుగలేదని, కూమారుడు తండ్రిని ఎవరికి బయలుపరచుతాడో వారికే ఆయనను గూర్చి జ్ఞానం వుంటుంది అని తెలియజేయుచున్నది. 

    అంతే కాదు విశ్వమంతటిలో సాధ్యపడు ప్రతి కార్యమును గూర్చి దేవుడు జ్ఞానం కలిగినవాడుగా వున్నాడు (1 సమూ. 23:11; మత్త. 11:23). 

    1 సమూ. 23:11 లో దావీదును కెయిలా ప్రజలు సౌలుకు అప్పగిస్తారని దేవునికి తెలుసు. మత్త. 11:23లో సొదోమ నిలిచియుంటుంది అని కూడా దేవునికి తెలుసు. కనుక మనము ఒక నిర్ణయము చేయుటకు ముందుగా దేవునికి ప్రార్థించు అలవాటును కలిగియుండడం మంచిది. దేవుడు వర్తమాన, భూత, భవిష్యత్‌ కాలములను గూర్చి జ్ఞానం కలిగినవాడుగా వున్నాడు.

    దేవుడు భవిష్యత్‌ను ఎరిగినవాడుగా వున్నాడు. దేవుని యొక్క భవిష్యద్‌ జ్ఞానం భవిష్యత్‌లో జరిగే కార్యములకు కారకం కాదు. దేవుడు ఆ కార్యములను ఎరిగియున్నాడు కాబట్టి అవి జరగడం లేదు, అవి జరుగుతాయి కాబట్టి దేవుడు వాటిని ముందుగానే ఎరిగియున్నాడు. మన భవిష్యత్‌ ఆయన ఎరిగియున్నాడు గనుక మనము ఆయనయందు నిరీక్షణను కలిగి మనము ముందుకు సాగుదాం.

ముగింపు :

1. దేవుడు మన ప్రస్తుత పరిస్థితులను ఎరిగినాడుగా వున్నాడు.
2. ఏకకాలంలో ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదానిని ఆయన ఎరిగియున్నాడు.
3. దేవుడు నిర్జీవమైనవాటిని గూర్చి జ్ఞానము కలిగియున్నాడు.
4. దేవుడు జీవముగల మనుష్యులను గూర్చి కూడా జ్ఞానము కలిగియున్నాడు.
5. మన హృదయమును, ఆలోచనలు ఎరిగియున్నాడు.
6. మన క్రియలు ఆయన ఎరిగియున్నాడు.
7. మన భారములు, అక్కరలు ఎరిగియున్నాడు.
8. మన గతపరిస్థితిని ఆయన ఎరిగియున్నాడు.
9. భవిష్యత్‌ విషయాలను ఆయన ఎరిగియున్నాడు.
10. దేవుడు తనను గూర్చి తాను సంపూర్ణ జ్ఞానం కలిగియున్నాడు.
11. విశ్వములో సాధ్యపడే ప్రతిది ఆయనకు తెలుసు.

మనము ఏమి చేయాలి?

1. ధైర్యముగా వుందాం.
2. భయభక్తులు కలిగి జీవిద్దాం.
3. విశ్వాసం కలిగియుందాం.
4. నిరీక్షణ కలిగియుందాం.
5. దేవునికి ప్రార్థన చేద్దాం.

ఆర్ . సమూయేలు 

Post a Comment