ఏశావు వివాహాము (మొదటి భాగము)


ఏశావు వివాహాము  (మొదటి భాగము)


ఏశావు వివాహాము (మొదటి భాగము )

 ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లి చేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి. -ఆదికాండము 26:34,35

    వివాహమనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ గా ఉన్నది. జంటగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. ఒంటరి వానికి సహాయం దొరకదు, ఇద్దరు జంటగా ఉండుటవలన ఒకరి ద్వారా ఒకరు మేలుపొందేవారుగా, ఒకరి కష్టం లో ఇంకొకరు సహాయకరంగా ఉండగలుగుతారు.

    అయితే వివాహంలో దేవుడు కోరుకున్న ప్రయోజనాలు కనబడాలి అంటే మన వివాహాలు దైవచిత్తానుసారమైనవై ఉండాలి. పెళ్లి చూపుల్లో ఒకరికి ఒకరు నచ్చడం తల్లిదండ్రులకు నచ్చడం కన్న దేవునికి నచ్చాలి అని కోరుకోవాలి. పైనున్న వాక్య భాగంలో మనం గమనించాల్సిన మూడు విషయాలు ఉన్నాయి, ఒకటి తల్లిదండ్రులు, రెండు పిల్లలు, మూడు కోడలు.

తల్లిదండ్రుల వైఫల్యం :

    పిల్లలకు వివాహం చేయడం అనేది తల్లిదండ్రులు యొక్క బాధ్యత. ఆదాముకు వివాహం చేసినవాడు దేవుడే కదా! ఇస్సాకు విషయంలో కూడా అబ్రహాము శ్రద్ధ తీసుకొని వివాహాన్ని జరిగించాడు.

అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన యెడలను, ఆమెకు వివాహము చేయవలసివచ్చిన యెడలను, ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదని ఒకడు తలంచిన యెడలను, అతడు తన యిష్టము చొప్పున పెండ్లి చేయవచ్చును; అందులో పాపము లేదు, ఆమె పెండ్లి చేసికొనవచ్చును. ఎవడైనను తన కుమార్తెకు పెండ్లి చేయనవసరములేకయుండి, అతడు స్థిరచిత్తుడును, తన ఇష్ట ప్రకారము జరుప శక్తిగలవాడునై, ఆమెను వివాహము లేకుండ ఉంచవలెనని తన మనస్సులో నిశ్చయించుకొనిన యెడల బాగుగా ప్రవర్తించుచున్నాడు. కాబట్టి తన కుమార్తెకు పెండ్లిచేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. -1 కోరింథీయులకు 7:36-38

    ఈ వచనములో తండ్రి తన కుమార్తె యొక్క వివాహం విషయమై ఆలోచన కలిగినవాడుగా ఉండాలి అని తెలియజేస్తున్నది. నిజానికి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వయసు మించిపోతున్నప్పటికీ వారికి వివాహం చేయాలను ఆలోచనలేనివారిగానే కొనసాగుతూ ఉంటారు.

    ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు తమకు నచ్చిన వారిని భార్యలుగా భర్తలుగా ఏర్పాటు చేసుకుంటారు. వివాహం విషయంలో పిల్లల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని వాటిని గురించి కొన్నిసార్లు పిల్లలను కూర్చోబెట్టి వివరించడం చాలా అవసరం. అలా వివరించ లేకపోతే, ఆ పిల్లలు తెలుసుకోలేకపోతే దైవచిత్తానికి చాలా దూరంగా , శాపానికి చాలా దగ్గరగా వారి వివాహాలు ఉంటూ ఉంటాయి. 

    దీనికి బాధ్యత వహించవలసిన వారు తల్లిదండ్రులే. నిజానికి ఇస్సాకు కుటుంబంలో ఇలాంటి బోధ లేదు అని చెప్పవచ్చు. ఏశావు యొక్క వివాహం విషయంలో వీరే మాత్రమూ శ్రద్ధ తీసుకున్నట్లుగా లేదు.

    ఏశావు వివాహము ద్వారా కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో యాకోబుకు వీరు ఈ బోధ చేశారు.

ఇస్సాకు యాకోబును పిలిపించినీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి... -ఆదికాండము 28:1,2

సమస్యలు తలెత్తకముందే జాగ్రత్తగాపడదాం.

" దేవా తగిన కాలం వచ్చినప్పుడు బాధ్యత గల తల్లిదండ్రులుగా మేము వ్యవహరించినట్లు మాకు సహాయం చేయండి"

    పిల్లలకు వివాహ వయసు వచ్చినప్పుడు వారికి తగిన వధువును వరుడుని వెతికే పనిలో ఉన్న తల్లిదండ్రులు ఈ విషయాలు గమనించండి. మీ కుటుంబంలోనికి వచ్చే ఆ వ్యక్తి దైవికమైన వ్యక్తిగా, ఆశీర్వాదాన్ని కొనసాగించే వ్యక్తిగా, సమాధానాన్ని కలిగించే వ్యక్తిగా ఉండునట్లు చూసుకోండి.

    మీ కుటుంబంలోనికి వచ్చే వ్యక్తి దైవికమైన వ్యక్తిగా, ఆశీర్వాదాన్ని కొనసాగించే వ్యక్తిగా, సమాధానాన్ని కలిగించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూన్నారు కాదా! మీరు ఏ కుటుంబంలోనికి వెళ్లారో ఆ కుటుంబం లో మీరు ఆ పై లక్షణాలు కలిగినవారుగా ఉన్నారా? 

    మీరు దైవికమైన తల్లిదండ్రులైతే, మీ కుటుంబంలోనికి మీరు ఆహ్వానించే వ్యక్తి దైవికమైన వ్యక్తి ఉండాలని భావిస్తారు. వివాహం విషయంలో ఇద్దరు వ్యక్తులను మనం జత చేస్తున్నప్పుడు, వారు కాడిని చక్కగా మోయాలి అంటే దేవుని చిత్తమును వారి జీవితం ద్వారా నెరవేర్చాలి అంటే వారిద్దరూ దైవికమైన వారై ఉండటం చాలా అవసరం.

 నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. -ద్వితియోపదేశకాండము 7:3,4
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? -2 కోరింథీయులకు 6:14

    మనం ఈ అంశాన్ని విస్మరించి వివాహాల విషయంలో ముందుకు వెళితే మీరు చేసిన ఈ బుద్ధిహీనమైన పనిని బట్టి జీవితకాలం బాధను అనుభవించేవారుగా ఉంటారు. ఆ వచ్చే వ్యక్తి ఆస్తులు అంతస్తులు, బంధు బలగం లేని వ్యక్తి అయినా ఇబ్బంది లేదు గాని భక్తి లేని వ్యక్తి అయితే మాత్రం చాలా సమస్యలు చూడాల్సి వస్తుంది.

    ఆ ఒక్క వ్యక్తి మూలంగా మీ పిల్లలు దేవుని సంతోషపరచలేరు, మీరు కూడా అనేక సందర్భాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. కాబట్టి దయచేసి ఈ విన్నపమును పెడచెవిని పెట్టవద్దు . ఇది ఎంత కీలకమైన విషయమో ఒకసారి ఆలోచించండి.

    ఇప్పటికే మీ ద్వారా ఈ తప్పు జరిగిపోయి ఉంటే, బాధపడడం వలన ఒరిగేదేమీ లేదు గానీ, దేవుని క్షమాపణ కోరుకొని, ఆయన కనికరం కొరకు, మీ కుటుంబ సభ్యుల మారుమనసు కొరకు ప్రార్థించడం ఉత్తమమైన విషయం.

    దేవుడు దేనికైనా సమర్ధుడు, ఆయన చేయలేని దంటు ఏదీ లేదు, కనుక ఆయన మీ కుటుంబాన్ని పునర్ నిర్మించగలరు. విశ్వాసంతో ప్రార్ధించి మన కుటుంబాలను బాగు చేసుకుందాం. విశ్వాసంతో ప్రవర్తించి మన కుటుంబాలను సమాధానంతో నింపుకుందాం! అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమెన్ 

- ఆర్. సమూయేలు.

Post a Comment