దేవుడు ఆజ్ఞాపిస్తే ఏమి జరుగుతుంది?
నీ జీవితంలో లేమిని అనుభవిస్తున్నావా? చీకటి అనుభవిస్తున్నావా? సంక్షోభం అనుభవిస్తున్నావా? ఆజ్ఞాపించే దేవుని వైపు చూడు! కోరహు కుమారులు కోరుకున్నట్టుగా, నా జీవితంలో కూడా ఆజ్ఞాపించమని దేవునిని అడుగు.
పరిచయం :
నిజమే దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యం జరుగుతుంది, ఈ సత్యాన్ని నమ్ముతున్న విశ్వాసులందరికీ రెఫీదీము వాక్య ధ్యాన సమయంకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, అందరూ బాగున్నారా, మన దేవుడు ఆజ్ఞాపించేవాడు, ఆయన ఆజ్ఞపిస్తే ఏం జరుగుతుంది? దేవుడిచ్చే ఆజ్ఞలకు మనుషులు ఇచ్చే ఆజ్ఞలకు వ్యత్యాసం ఏంటి? ఈ భాగములో తెలుసుకుందాం !
మన దేవుడు ఆజ్ఞాపించేవాడు, ఆయన ఆజ్ఞ అధికారము గలది. మానవుని అధికారానికి ఆజ్ఞలకు పరిమితులు ఉంటాయి గాని దేవుని అధికారానికి ఆజ్ఞకు పరిమితులు లేవు.
నేడు మనం చూస్తున్న ఈ సృష్టినంత దేవుడు శూన్యంలో నుండి కలుగజేశాడు. మొదటి దినాన ఆయన వెలుగును కలుగజేసే సమయంలో " వెలుగు కలుగును గాక" అన్నాడు. అది ఒక ఆజ్ఞ.
దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. -ఆదికాండము 1:3
ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. -కీర్తనలు 33:9
ఆదికాండం మొదటి అధ్యాయం మూడో వచనాన్ని కాంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్ లో ఇలా అనువాదం చేయడం జరిగింది.
God said, “I command light to shine!” And light started shining. - Genesis 1 : 3 (CEV)
దేవుడు ఆఙ్ఞాపిస్తే ఉనికిలో లేనివెన్నో మనుగడలోనికి వచ్చాయి. ఆయన ఆజ్ఞాపించగా ఆకాశ విశాలము, భూమి, చెట్లు, సూర్య చంద్ర నక్షత్రాలు, జలచరములు, పక్షులు, జంతువులు ఇవన్నీ ఏర్పడినవి. దేవుడు కలుగును గాక అని చెప్పగానే ఇవన్నీ ఏర్పడినవి. దేవుని ఆజ్ఞ అసమానమైన అధికారముగలది. నీ జీవితంలో లేమిని అనుభవిస్తున్నావా? చీకటి అనుభవిస్తున్నావా? సంక్షోభం అనుభవిస్తున్నావా? ఆజ్ఞాపించే దేవుని వైపు చూడు! కోరహు కుమారులు కోరుకున్నట్టుగా, నా జీవితంలో కూడా ఆజ్ఞాపించమని దేవునిని అడుగు.
దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము. -కీర్తనలు 44:4
అడిగేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకో! ఆయన ఆజ్ఞ అసాధారణమైన కార్యములను చేస్తుంది. దేవుడు ఆజ్ఞాపించలేని అంశాలు అంటూ ఏమీ లేవు, నీవు విశ్వాసముంచగలిగితే అన్నియు సాధ్యమే.
ముగింపు :
దేవుడు ఆజ్ఞాపిస్తే ఏఏ కార్యములు జరుగుతున్నాయో తెలుసుకున్నాం కదా, నీ జీవితంలో కూడా నీవున్న కఠిన పరిస్థితులన్నిటిని దేవుని చేతిలో అప్పగించి ఆయన కార్యము కొరకు ఎదురు చూడండి.
దేవుని వాక్యమును లోతుగా మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ అంశాలు తప్పక చదవండి, ప్రభువు చిత్తమైతే మరొక భాగంతో మరల కలుసుకుందాం, దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి