విమోచకుని సిద్దపరచిన దేవుడు

విమోచకుని సిద్దపరచిన దేవుడు

విమోచకుని సిద్దపరచిన దేవుడు 

దేవుడు మన కొరకు తన కుమారుని సిద్దపరచి, మన పాపపు దాస్యము నుండి విడిపించడానికి ఏర్పాటు చేసాడు

పరిచయం :

 బానిసత్వం బహు భయంకరం. 400 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులు అందులో మ్రగ్గిపోతున్నారు.

పురుషులకు వెట్టి చాకిరి, స్త్రీలకు కడుపు కోత, మగ పిల్లలకు మరణం ఇలా ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను బాధించారు. ఆ బాధల్లో వారు దేవునికి ఎంతగానో మొరపెట్టగా, దేవుడు వారికి ఇచ్చిన సమాధానమే ఈ విమోచకుడు.

 దేవుని వాక్యమును ప్రేమించు ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో రెఫీదీము వాక్య ధ్యాన సమయముకు  ఆహ్వానిస్తున్నము. అందరూ బాగున్నారా? గత భాగంలో ఇశ్రాయేలు ప్రజల మీద లక్ష్యం ఉంచిన దేవుడు మంత్రసానుల ద్వారా ఏ విధంగా సహాయం చేశాడో తెలుసుకున్నాం కదా, వారిపై లక్ష్యముంచిన దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపించడానికి వారి కొరకు ఒక విమోచకుని దేవుడు ఎలా సిద్ధపరిచాడో  నిర్గమకాండము 2&3 అధ్యాయముల ద్వారా ఈ భాగంలో తెలుసుకుందాం. 

రెండవ ప్రణాళిక కూడా బెడిసి కొట్టడాన్ని బట్టి, రాజుగారు ఈ మంత్రసానులను పిలిపించి అడిగాడు, వాళ్లు మాత్రం హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనవారు,  మేము వెళ్ళకముందే వారు ప్రసవిస్తున్నారు అని చెప్పారు.

రాజుగారు మూడవ ప్రణాళిక చేస్తూ హెబ్రీ మగ పిల్లలందరిని నైలు నదిలో పడవేయాలని ఆజ్ఞాపించాడు. 

ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం, ఏ ఒక్కరు కోరుకోరు కదా!  కానీ లేవి వంశానికి చెందిన అమ్రాము యెకెబెదు అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

వీరికి ముగ్గురు పిల్లలు కలగడం జరిగింది, ఇప్పుడు మూడో వ్యక్తికి సమస్య వచ్చి పడింది. ఎందుకంటే మూడో వ్యక్తి మగపిల్లవాడు కావడమే.  

మగపిల్లల పుడితే నైలు నదిలో పడవేయబడాలని ఆజ్ఞ ఉన్నది కనుక వాళ్ళ అమ్మ ఈ బాబుని మూడు నెలలు దాచిపెట్టి ఇక దాచలేక విసిరి నదిలో పడవేయలేక ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి మొసళ్ళు రాకుండా జిగటమన్నును నీళ్లు లోనికి రాకుండా తారును పూసి నది ఒడ్డున జమ్ములో ఉంచి కాపలాగా తన పెద్ద కుమార్తెను ఉంచింది..

అదే సమయంలో రాజుగారి కుమార్తె నది ఒడ్డుకు రావడం, ఆ పెట్టెను చూడడం , ఆమెకు కనికరము కలగగా ఆ బాబు యొక్క అక్క ద్వారా ఒక దాదికి ఆ బాబును అప్పగించి తన కొరకు పెంచమని జీతం ఇస్తానని చెప్పడం కూడా జరిగింది.

ఆ బాబును పెంచుతూ ఆ దాది, పెద్దవాడైన తర్వాత రాజకుమార్తె యొద్దకు తీసుకురాగానే మోషే అని ఆవిడ పేరు పెట్టడం జరిగింది. 

మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు, తన ప్రజలు బానిసత్వంలో ఉన్న సంగతి తెలుసుకున్నాడు, తన బలాన్ని బట్టి వారిని విడిపించాలని ప్రయత్నం చేశాడు, కాని అది బెడిసి కొట్టడంతో ఆయన మిద్యాను అనే దేశానికి పారిపోయాడు, అక్కడ సిప్పోరా అనే ఆమెను పెళ్లి చేసుకొని అక్కడే తన మామగారి మందులు మేపుతూ ఒక 40 సంవత్సరాలు గడిపాడు.

ఈలోగా ఒక రోజున దేవుడు మోషేను దర్శించి నా ప్రజలను ఐగుప్తీయులు ఎంతగా బాధపెడుతున్నారో నేను చూశాను, కాబట్టి నిన్ను వారిని విడిపించడానికి పంపిస్తాను రమ్మని ఆయనను పిలవడం జరిగింది.

కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. -నిర్గమకాండము 3:10

మోషేకు దేవుడు ఇచ్చిన ఈ పిలుపుకు మోషే వెంటనే అంగీకారం చెప్పలేదు. చూడండి ఇశ్రాయేలీయుల ప్రజల పక్షాన లక్ష్యముంచిన  దేవుడు వారిని విడిపించడానికి ఒక నాయకున్ని రక్షించి సిద్ధపరిచి పిలుపునిస్తూ ఉన్నాడు.

కొంత వాదన దేవునికి మోషేకు జరిగిన తర్వాత ఎట్టకేలకు మోషే అంగీకరించడం జరిగింది. దేవుని మాట చొప్పున మోషే తన కుటుంబంతో పాటుగా ఐగుప్తుకు బయలుదేరి వచ్చాడు.

దేవుడు మన కొరకు తన కుమారుని సిద్దపరచి, మన పాపపు దాస్యము నుండి విడిపించడానికి ఏర్పాటు చేసాడు, మన యందు లక్ష్యముంచి ఇలాంటి కార్యములు దేవుడు చేసినందుకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన యందు లక్ష్యముంచి కొనసాగాలి.

 దేవుడు మన కొరకు సిద్ధపరచిన రక్షకుని మీద దృష్టి నిలిపి మనం ముందుకు సాగాలి. ఆయన ద్వారా మాత్రమే కలిగేటువంటి రక్షణను మనము పొందుటకు అంగీకరించి నిత్యశిక్షను నరకమును తప్పించుకునే వారంగా ఉందాము.

ముగింపు :

 దేవుడు తన వంతుగా ఊహించన రీతిలో మనకు సహాయం చేస్తూ ఉన్నారు, మన బానిస బ్రతుకులు మార్చబడడానికి తన కుమారుడైన ఏసుక్రీస్తు వారి ద్వారా విమోచన సిద్ధపరిచాడు ఇకను ఆలస్యం చేయక ఆయన చెంత చేరి ఆయనపై లక్ష్యం ఉంచుతూ ముందుకు కొనసాగే వారిగా ఉందాము.

 ప్రభువు చిత్తమైతే మరొక భాగంతో మరలా కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మీకు తోడు యుండును గాక ఆమెన్. 

Post a Comment