దేవునిని స్తుతించు పిల్లలు వలె ఉండండి!
కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? .................మత్తయి 21:15,16
హలో పిల్లలు బాగున్నారా? దేవుడు మనందరికి ఏమేమి ఇచ్చాడు? చెప్పండి! దేవుడు మనకు ఇచ్చిన ప్రతి దానితో మనము దేవునిని మహిమపరచాలి. మీకు ఈ పాట తెలుసా? నా కనులు చెవులు ముక్కు నోరు యేసు కోసమే! తెలుసా! తెలిస్తే పాడుకోండి, తెలియకపోతే మీ టీచర్ ని నేర్పించమని అడగండి. సరే, అసలు నేను ఎందుకు వచ్చానంటే మీకు ఒక విషయం చెప్దామని వచ్చా! వింటారా?? ఒకే
ఒక రోజు యేసయ్య బేతనియా అనే ఊరిలో ఉన్నాడు. అది ఎవరి ఊరో తెలుసా? అబ్బా, భలే చెప్పింది, ఆ అమ్మాయి లాజరు తాతయ్య ఊరు. లాజరు తాతయ్య తెలుసా మీకు? ఓహో ఆయన ఊరి పేరు మాత్రమే తెలుసా! సరే చెప్తా వినండి. లాజరు తాతయ్యకు ఇద్దరు తోబుట్టువులు (చెల్లెళ్లు ) ఉన్నారు, వారి పేర్లు….. చెప్పేస్తున్నా…చెప్పేస్తున్నా.. మార్త, మరియ. ఈ కుటుంబమంటే యేసయ్యకు చాలా ఇష్టం, లాజరు తాతయ్య అంటే ఇంకా ఇష్టం. అయితే ఈ లాజరు తాతయ్యకు ఒకసారి ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు ఏమి జరిగిందో తెలుసా? లాజరు తాతయ్య చనిపోయాడు.
ఓహ్ మీ డౌట్ నాకు అర్డమైంది! లాజరు తాతయ్యకు బాగాలేకపొతే యేసయ్య ఏమి చేయలేదా? అనే కదా! యేసయ్యకు కబురు చేసారు ఇలా లాజరు తాతయ్యకు బాగాలేదని కాని యేసయ్య రాలేదు. చ! యేసయ్య వచ్చుంటే బాగుండేది కదా అని మీరు అనుకుంటున్నట్టే తన చెల్లళ్ళు కూడా అనుకున్నారు. కాని యేసయ్య తర్వాత వచ్చాడు! ఇప్పుడు వచ్చి ఏమి ఉపయోగం, ఆరోగ్యం బాగాలేనప్పుడు వస్తే బాగుండేది అని అనుకుంటున్నారు కదా! నాకు తెలుసు! మీరే కాదు ఆయన చెల్లెళ్ళు కూడా అలాగే అనుకున్నారు.
ఇంతకి లాజరు తాతయ్య చనిపోయిన ఎన్ని దినాలకు యేసయ్య వచ్చాడో తెలుసా? 4 రోజులకు వచ్చాడు. అప్పుడు వచ్చి సమాధి ఎక్కడ ఉంది చూద్దాం పదండి అని అంటున్నాడు. సమాధి దగ్గరకు వెళ్ళేలోపు మరియ యేసయ్యను కలుసుకొని ఏడవడం, యేసయ్య కూడా ఏడవడం జరిగాయి. లాజరు తాతను ఒక గుహలో సమాధి చేసారు, ఆ గుహకు అడ్డముగా పెద్ద రాయి పోర్లించి ఉంచారు. దానిని తొలగించమని అడిగాడు యేసయ్య, మార్తమ్మ ఏమో వద్దయ్యా తాను చనిపోయి 4 రోజులైంది, వాసన వస్తుంది అని అన్నది. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావని చెప్పాడు, మొత్తానికి రాయి తీసారు.
తర్వాత ఏమి జరిగిందో తెలుసా? యేసయ్య " లాజరు బయటకు రా! " అని పిలిచాడు. లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. యేసయ్య ఎంత గొప్ప కార్యం చేసాడో కదా! ఆ తర్వాత యేసయ్య కొన్ని రోజులు ఎఫ్రాయిము అనే ఊరికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత పస్కా పండుగకు 6 రోజులు ముందు మరల యేసయ్య బేతనియా అనే ఊరికి, అదే లాజరు తాతయ్య ఊరికి వచ్చాడు. అంటే సరిగ్గా శుక్రవారం సాయంత్రం వచ్చాడు అనుకోండి.
అయితే ఆదివారమున యేసయ్య ఒక గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి జయప్రవేశము చేసారు. యేసయ్య వెనుక, ముందు వస్తున్నవారు " దావీదు కుమారునికి జయము " అని కేకలు వేస్తూ దేవునిని స్తుతించి మహిమపరచారు. అయితే ఈ కేకలు వేసినవారిలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా కేకలు వేసి దేవునిని స్తుతించారు. వారు కేకలు వేసి స్తుతించడానికి కారణం తెలుసా? యేసయ్య చేసిన అద్భుతములన్నిటిని బట్టి , లాజరు తాతను తిరిగి బ్రతికించినందుకు వారు ఆ విధంగా స్తుతించారు.
పిల్లలు మీరు కూడా దేవుడు చేసిన అద్భుతములను బట్టి, మీ నోటితో పాటలు పాడుతూ దేవునిని స్తుతించండి. మీరు స్తుతించుట ద్వారా దేవుడు సాతాను నోరు మూయిస్తాడు, కాబట్టి చక్కగా పాటలు నేర్చుకొనండి, పాడండి, దేవునిని స్తుతించండి, మీ నోటి నుండి చెడ్డ మాటలు రానివ్వకుండా మీ నోటితో దేవునిని మహిమపరచండి.
కంఠత వాక్యము :
శత్రువులను పగతీర్చుకొనువారిని మాన్పివేయుటకై నీ విరోధులనుబట్టి బాలురయొక్కయు చంటి పిల్లలయొక్కయు స్తుతుల మూలముననీవు ఒక దుర్గమును స్థాపించి యున్నావు.- కీర్తనలు 8:2
- ఆర్. సమూయేలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి