వేషధారుల వలె ఉండవద్దు/Hypocrisy/Children Bible Stories in Telugu - R. Samuel.

వేషధారుల వలె ఉండవద్దు/Hypocrisy/Children Bible Stories in Telugu - R. Samuel.
     

వేషధారుల వలె ఉండవద్దు

      ఈ భాగమును చదువుతున్న సండే స్కూల్ టీచర్స్ మరియు తల్లిదండ్రులందరికి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను, బాగున్నారా? పిల్లలను ఉద్దేశించి రాసిన " వందనములు తండ్రి " అను భాగమును చదివారా? మీ పిల్లలకు వినిపించారా? అది వాస్తవముగా 4-6 సంవత్సరాల పిల్లలను ఉద్దేశించి రాయడం జరిగింది.

    ఇక ఈ భాగము నుండి నేరుగా పిల్లలకు చెప్పడం కాకుండా మీరు పిల్లలకు చెప్పగలుగునట్లు మీకు సహాయం చేస్తే అది మీ ఆత్మీయ జీవితముకు మరియు మీ పిల్లల ఆత్మీయ జీవితముకు కూడా ఉపయోగపడుతుంది అని భావిస్తూ నేను ఈ మాటలు వ్రాస్తున్నాను. ఇది 7-9 సంవత్సరాల పిల్లలను ఉద్దేశించి రాయబడింది, ఈ భాగమును చదువుతున్న టీచర్స్ గాని, తల్లిదండ్రులు గాని, మీరు ఈ క్రింద సూచనలు పాటిస్తూ మీ పిల్లలకు బోధించండి.


సూచనలు :

  • క్రింద ఇవ్వబడిన వాక్యభాగమును మీరు ప్రార్ధనపూర్వకముగా చదవండి.
  • పాఠ్యభాగమును మీరు బాగా చదివి అర్థం చేసుకొని అందులోని విషయాలు మీకు ఇవ్వబడిన సూచనల ప్రకారం వివరించండి.

వాక్యభాగము :

    అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో  మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అయిదు పిచ్చుకలు   రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవుని యెదుట మరువబడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి. భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యుల యెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్య కుమారుడు దేవుని దూతల యెదుట వానిని ఒప్పుకొనును. మనుష్యుల యెదుట నన్ను ఎరుగనను వానిని, నేనును ఎరుగనని దేవుని దూతల యెదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని, పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మును తీసికొని పోవునప్పుడు మీరు ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదుమా అని చింతింపకుడి, మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను - లూకా 12:1 -12


పాఠ్యభాగము :

    ఒక రోజు 8 సంవత్సరాల వినోదిని స్కూల్ కి ఆలస్యముగా వెళ్ళింది. ఆలస్యముగా వచ్చినప్పుడు మీరెందుకు ఆలస్యముగా వచ్చారు అని ఎవరైనా అడుగుతారు కదా! ఆలాగే వాళ్ళ టీచర్ కూడా అడిగింది, దానికి వినోదిని ఏమి చెప్పిందో తెలుసా? " టీచర్.. టీచర్.. మరేమో మా అమ్మకు బాగాలేదు టీచర్, అందుకని నేను ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్ని చేసి వచ్చేసరికి ఆలస్యం అయ్యింది టీచర్"  అని చెప్పింది.

    8 సంవత్సరాల పిల్ల ఇంట్లో పనులన్ని చేసింది అంటే ఏమి చేసి ఉంటాది అబ్బా! అని మీకు అన్పించినట్టుగానే వాళ్ళ టీచర్ కు అన్పించి అదే మాట అడిగింది. దానికి వినోదిని " అన్ని పనులు చేసాను టీచర్, అన్నం, కూర, బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, ఇల్లు తుడవడం ఇలా అన్ని చేసాను టీచర్ " అని చెప్పింది.

    మీకు లాగే ఆమెకు కూడా నమ్మడానికి కొంచెం కష్టం అన్పించినా ఎలాగో నమ్మింది. అయితే ఈ వినోదిని స్కూల్ కి ఆలస్యముగా రావడమును అలవాటుగా మార్చుకుంది. ప్రతి రోజు అలాగే ఆలస్యముగా వస్తూ ఉన్నది, కారణం ఏంటి అంటే పైన చెప్పిందే చెప్తూ ఉన్నది. టీచర్ చేసేదేమి లేక వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగుపడాలని ప్రార్ధన చేస్తూ ఉన్నది. 

    రోజులు గడుస్తుండగా వినోదిని వాళ్ళ అమ్మ స్కూల్ దగ్గరకు వచ్చింది, ఆమెను చూడగానే టీచర్ " ఏమండీ బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉన్నది?? " అని అడిగింది. దానికి ఆమె స్పందిస్తూ " నాకేమైంది? నేను బాగానే ఉన్నానే! " అని అన్నది. దానికి ఆ టీచర్ ఆశ్చర్యపోతూ " అదేంటండి, మీకు ఆరోగ్యం బాగాలేదని, ఇంట్లో పని అంతా తానే చేస్తున్నాను అని చెప్పి మీ అమ్మాయి రోజు స్కూల్ కి ఆలస్యముగా వస్తున్నది" అని అన్నది.

    దానికి వాళ్ళ అమ్మగారు సమాధానమిస్తూ "పనంతా చేస్తుందంటనా! ఏమి పని వచ్చు ఆమెకు చేయడానికి?? రాత్రి పొద్దు పోయినదాకా ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆలస్యముగా నిద్ర లేచి ఆలస్యముగా స్కూల్ కి వస్తున్నది " అని అసలు విషయం చెప్పేసింది. ఇది విన్నాక టీచర్ వినోదిని ఏమి చేసి ఉంటది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. అయితే వినోదిని ఎందుకు ఇలా చేసింది అని టీచర్ ఆలోచనలో మునిగిపోయింది. ఆమె ఆలోచనలోనికి మనము కూడా తొంగి చూస్తూ పాఠం నేర్చుకుందాం రండి.

    రెండు కారణముల చేత వినోదిని అలా చేసింది. ఒకటి టీచర్ అంటే ఉన్న భయం, రెండు ఆమె దగ్గర మార్కులు సంపాదించడం. దీని ద్వారా వినోదినికి దెబ్బలు తప్పాయి, రోజు చాలినంత సేపు ఫోన్ చూడవచ్చు, ఎంత లేటుగా అయినా నిద్ర లేవొచ్చు, రోజు స్కూల్ కి ఆలస్యముగా రావచ్చు. పైగా స్కూల్ లో మంచి పేరు, అందరూ వినోదిని లాగా ఇంట్లో పని చేయాలి అని మాదిరిగా ఆమెను బట్టి చెప్పడం ఇవన్ని దొరికాయి.

    ఒక్క వినోదినియే కాదు మనలో చాలా మంది మనకు సెలవు అవసరమైనప్పుడు ఎన్ని సార్లు మన తాత ముత్తాతలను చంపేసి ఉంటామో, ఎన్ని సార్లు మనము హాస్పిటల్ బెడ్ ఎక్కి ఉంటామో కదా! దీనికి అంతటికి బైబిల్ ఒక పేరు పెడుతుంది అదేమిటంటే వేషధారణ.

    మనం వేషదారులము కావడానికి ప్రధాన కారణం మనుష్యులంటే భయం, వారిని మెప్పించాలి అనే ఆశ, వారి దగ్గరి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అనే ఆలోచన, మన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్ల కూడదు అనే భావం మనలో ఉండడమే.ఏదైనా సంపాదించుకోడానికి కూడా మనము ఈ వేషం వేస్తుంటాము. వేషధారణ కేవలం మనుషుల కోసమే. వారికి భయపడి, వారి దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలి అని అలా చేస్తాము. దీనికి విరుగుడు దేవునికి భయపడడమే.

    యాకోబు ఆశీర్వాదం పొందడం కోసం తన అన్న ఏశావు వలె వేషం వేసుకొని వెళ్ళాడు, అబద్దాలు చెప్పాడు (దీని మీద మీకు అవగాహన ఉంటే పిల్లలకు ఆ భాగమును వివరించండి). మనుషులకు భయపడొ, వారి మెప్పు కోసమో వేషాలు వేయవద్దు, దేవునికి భయపడి జీవిద్దాం, ఎందుకంటే మనుషులు మహా అయితే చంపుతారేమో, కాని దేవుడు మనలను నరకంలో పడవేస్తాడు, కాబట్టి జాగ్రత్త పడదాం.

కంఠత వాక్యము :

..........చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి…….- లూకా 12:5.

కార్యాచరణ :

పిల్లలు వేషధారులుగా తల్లిదండ్రులతో ప్రవర్తించిన విధమును జ్ఞాపకం చేసుకొని వారి దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరమని చెప్పండి.

- ఆర్. సమూయేలు.

Post a Comment