కయీను దేవునికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు


కయీను దేవునికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు


కయీను దేవునికి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు


    " అర్పన్….! అర్పన్….!!, ఇలా రా!!! నా కళ్ళజోడు ఎక్కడుందో కనబడడం లేదు!!!! కొంచెం చూసిద్దువు గాని!!!!!" అని వారి తాతగారు పిలిచారు. అది విన్న అర్పన్ మనసులో అబ్బ ఈ ముసలోడుతో అంతా తలకాయ నొప్పి ఐపోయింది అని అనుకుంటూ పైకి మాత్రం " నీకు కళ్ళజోడు వెతికి పెట్టడం మాత్రమే పని అనుకున్నావా, పో నేను ఆడుకోవాలి అక్కడే ఎక్కడో ఉంటుంది చూసుకో" అని చెప్పి వెళ్ళిపోయాడు.

    పిల్లలు మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? గడిచిన భాగంలో కయీను నిర్లక్ష్యంగా దేవునికి అర్పించాడని, తన తమ్ముడిని ఆయన ప్రాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ చంపేశాడని తెలుసుకున్నాం. కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేసి అవి ఎవరికీ తెలియవు అని అనుకుంటాం. మనం చేసేది ఎవరికీ తెలియకపోయినా దేవునికి మాత్రము ఖచ్చితంగా తెలుసు. ఆయన ప్రతిదీ చూస్తున్నాడు గనుక ఖచ్చితంగా ఒకరోజు మనలను లెక్క అడుగుతాడు . దేవుని కన్నుల నుండి మనం ఏమాత్రం తప్పించుకోలేం, పిల్లలు మీరేం చేసినా నిర్లక్ష్యం లేకుండా చేయాలి.

    కయీను తన తమ్ముడు విషయంలో చేసిన ఈ నిర్లక్ష్యానికి దేవుడు ఎలా స్పందించాడో ఈ భాగంలో తెలియజేస్తున్నాను కదా! సరే జాగ్రత్తగా వినండి!

యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడాయననీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను. -ఆదికాండము 4:9-12 

    కయీను చేసిందంతా చేసి అది ఎవరికీ తెలియదు అన్నట్టుగా ఇంటికి వెళ్ళాడు, హేబేలు లేకపోవడానికి గురించి ఆదాము హవ్వలు అడిగారో లేదో, ఒకవేళ వాళ్ళు అడిగిన ఈయన ఏ సమాధానం చెప్పాడో కాని దేవుడు మాత్రం కయీనుని అడిగాడు. ఏమని అడిగాడో తెలుసా? "కయీను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ?? " అని అడిగాడు. మిమ్మల్ని ఎవరైనా ఇలా అడిగితే మీరు ఎలా సమాధానం చెబుతారు! ( పిల్లల్ని సమాధానం చెప్పనివ్వండి) కానీ కయీను ఏమని సమాధానం చెప్పాడో తెలుసా? " నేనెరుగను నా తమ్ముడికి నేనేమన్నా కాపలానా " అని అన్నాడు. మా తమ్ముడికి నేను కావలి కాయాలా?? నన్నెందుకు అడుగుతున్నావ్ అన్నట్టు సమాధానం ఇచ్చాడు. 

    ఎంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడో కదా! పైగా తానిలా ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? దేవునితో మాట్లాడుతున్నాడు. పిల్లలు మీకు తెలుసా మనం నిర్లక్ష్యంగా మాట్లాడే ప్రతి మాటకి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. యేసయ్య రెండవ రాకడలో మనం దేవుని వద్దకు వెళ్లిన తర్వాత మనం మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటలు గూర్చి దేవునికి లెక్క చెప్పాలి. అమ్మో ఎన్ని వ్యర్థమైన  మాటలు నిర్లక్ష్యం మాటలు మాట్లాడటం కదా! కాబట్టి జాగ్రత్తగా క్షమాపణ కోరుకుందాం!! 

    కయీను ఇలా సమాధానం ఇచ్చిన తర్వాత దేవుడేమన్నాడో తెలుసా? నువ్వు చేసిన పని ఏంటి, పాపం కయీను దేవునికి తెలియదు అనుకుంటున్నాడు! నీవు చంపిన నీ తమ్ముడు రక్తం నాకు మొఱ్ఱపెడుతూ ఉన్నది, అని కయీనును దేవుడు శపించాడు. శపించబడిన మనుషులలో కయీను మొదటివాడు, నీవు దేశదిమ్మరివిగా ఉంటావని, నీవు సేద్యం చేసినప్పుడు భూమి సరిగా పంట ఇవ్వదని దేవుడు శపించాడు.

    చూసారా పిల్లలు కయీను నిర్లక్ష్యానికి ఎలాంటి ఫలితం వచ్చిందో, కాబట్టి మీరు ఏ పని చేసినా నిర్లక్ష్యంగా చెయ్యొద్దు. ఏ ఒక్కరికి కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పవద్దు. అందరికీ మంచిగా సమాధానం చెప్పండి, మన దేవుడు క్షమించేవాడు కనుక మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కయీను వలె చేసి ఉంటే దేవుని ఎదుట ఒప్పుకొనండి. ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా యేసయ్య రెండో రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉందాము. దేవుడు అలాంటి భాగ్యము మనకందరికీ దయచేయునుగాక, ఆమెన్.

కంఠత వాక్యం

నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. -మత్తయి 12:36
పాట : నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం

ఆర్. సమూయేలు.

Post a Comment