బైబిల్ కోర్స్ ను గూర్చిన పరిచయము
క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను, అందరూ బాగున్నారా? మరొకసారి మరొక నూతన అంశముతో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ బైబిల్ కోర్స్ ను గూర్చిన పరిచయ వాక్యాలు చదవడానికి మీరుచూపిన ఆసక్తిని బట్టి మీకు వందనాలు. ఈ క్రింద రాయబడిన విషయాలను శ్రద్దగా చదివి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు చేయవలసినదిగా కోరుతున్నాను .
దర్శనము
చాలా కాలం క్రితం నన్ను ఒక అతను ఒక ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్న ఏంటంటే "ఆది" అంటే అర్థం ఏమిటి? తాను అడిగిన ఆ ప్రశ్నలో తానేదో నేర్చుకోవాలి అనే తపన కలిగి ఉన్నట్టు అర్థమైంది. అంతేకాదు చాలామంది బైబిల్ ని క్రమంగా నేర్చుకోవాలని ఆశ కలిగిన వారు ఉన్నారు, వారు బైబిల్ చదువుతుండగా వారికి కలిగిన ప్రశ్నలను అడపాదడపా సమాధానాలు నిమిత్తమై నాకు పంపించేవారుగా ఉన్నారు.
దీనంతటికి ఒక పరిష్కారాన్ని కనుగొంటూ దేవుడిచ్చిన ఆలోచనను బట్టి బైబిల్ ను ఈ చివరి నుండి ఆ చివరి వరకు ధ్యానిస్తూ ఆసక్తి కలిగిన వారికి బోధించాలని ప్రారంభించడం జరిగింది. ఇది మా సంఘంలో కొంతకాలంగా జరుగుతున్నది, వారితో నేను పంచుకున్న విషయాలకు, మరికొన్ని విషయాలు జోడించి సులభంగా అర్థం చేసుకుని ఇతరులకు బోధించుటకు వీలుగా, అవసరమైన చోట పట్టికలు, చిత్రాలు చూపిస్తూ దీనిని ఒక కోర్స్ గా తయారు చేయడం జరిగింది. నాకు తెలుసు ఈ ప్రయాణం పెద్దదని, అయితే ఇందులో నమ్మకంగా కొనసాగుతూ అనేకమందికి ప్రయోజనకరంగా మేముండులాగున మా కొరకు ప్రార్థించండి.
క్రైస్తవ సమాజములో చాలా బైబిల్ కోర్స్ లు ఉండగా మరలా ఇది ఒకటి అవసరమా అనే ఆలోచన కూడా కొంతమందిలో రావచ్చు. నేను పైన చెప్పినట్టుగానే దేవుడు నా చేతికి అప్పగించిన కొంతమందిని ఆత్మీయంగా సిద్ధపరచుటకు, నా ద్వారా నేర్చుకోవాలని ఆశిస్తున్న అనేకులకు ప్రయోజనార్థం ఈ కోర్స్ తయారు చేయడం జరిగింది.
దీనిని మీరు ఎలా ఉపయోగించుకోవాలి?
మీరు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తే చాలా రకాలుగా దీనిని మీరు ఉపయోగించుకోవచ్చు.
- ఒకటి మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, వాక్య జ్ఞానం పెంచుకొనుట కొరకు ఉపయోగించుకోవచ్చు.
- రెండవదిగా, సేవకులు ఎవరైనా ఇది చదువుతూ ఉంటే , దీనిని మీ సంఘాల్లో బోధించడానికి కూడా మీరు వినియోగించుకోవచ్చు.
- మూడవదిగా, దీన్ని ఒక బైబిల్ కోర్స్ వలె సిద్ధపాటు చేయాలి అనే ఆలోచన ఉన్నది, అందులో భాగంగానే ఇందులో కొన్ని ప్రశ్నలు చేర్చడం జరిగింది. ఈ కోర్సు ద్వారా నేను ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి అని ఆశించిన వారు, మీరు ఇందలి అంశాలను చదివి ధ్యానించిన తర్వాత ఇవ్వబడిన ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసి పంపే ప్రయత్నం చేయండి.
ఆ సమాధానాలను పోస్ట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు నాకు పంపవచ్చు. ప్రతివారం బైబిల్ క్విజ్ లో పాల్గొంటున్న వారికి ఈ విషయంలో మంచి అవగాహన ఉంటుంది గనుక వారికి చెప్పవలసిన అవసరం లేదు, అయితే క్రొత్త వారెవరైనా దీన్ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ విషయాన్ని గమనించండి.
అంతేకాదు ఇందలి అంశాలను చదివిన తర్వాత మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు వస్తే, అర్థం కాని విషయాలేమైనా ఉంటే వాటిని కూడా నిర్భయంగా నాతో పంచుకోవచ్చు. ఇది మీలో ఎవరికైనా పుస్తకము రూపములో కావాలంటే , నేరుగా వచ్చి లేదా పోస్ట్ ద్వారా తగిన విరాళము చెల్లించి పొందగలరు .
గమనించండి ఇది ఒక చిన్న ప్రయత్నమే, ఈ విషయంలో నీ ప్రార్థనా సహకారంతో పాటుగా ఆత్మీయమైన సలహాలు సూచనలు ఏమైనా చేయాలని మీరు ఆశిస్తే దీనిని మెరుగుపరుచుటకు అవి ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తే వాటిని మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి ఈ పరిచర్య కొరకు నూతనమైన ఈ ప్రయాణం కొరకు ప్రార్థించండి సహకరించండి ఆసక్తి గల అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి