సమూయేలు ఏలీని గౌరవించాడు



సమూయేలు ఏలీని గౌరవించాడు

సమూయేలు ఏలీని గౌరవించాడు

హాయ్ పిల్లలు బాగున్నారా? సమూయేలు గురించి మంచి విషయాలు నేర్చుకుంటున్నారా? సమూయేలను వారి తల్లిదండ్రులు ఎక్కడ వదిలిపెట్టి వెళ్లారు? ఏలి తాత దగ్గర కదా! అవును దేవుని మందిరంలో ఏలి తాత దగ్గర సమూయేలును వదిలిపెట్టి వెళ్లారు. ఇక అది మొదలుకొని సమూయేలుకు అమ్మైనా నాన్నైనా ఏలీ తాతే అని చెప్పాను కదా. 

ఏలి తాతకి ఇద్దరు కుమారులు ఉన్నారు, వారి పేర్లు హోప్ని, ఫినేహాసు, వీరు మంచి వాళ్ళు కాదు. అందుకే హన్నా సమూయేలును వారి వద్ద వదిలిపెట్టలేదు. ఏలీ తాత ఆ దినాల్లో ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, పైగా వయసులో చాలా పెద్దవాడు. ఇప్పుడు సమూయేలు ఏలి తాత దగ్గర వదిలిపెట్టబడ్డాడు గనుక ఆ తాతయ్య సమూయేలుకు దేవుని సేవ ఎలా చేయాలో చక్కగా నేర్పించడానికి అవకాశం ఉన్నది. 

అయితే సమూయేలు దేవుని సేవ చేయాలంటే నేర్చుకోవాలి కదా, తాను నేర్చుకోవాలంటే ఏలి తాతకు విధేయుడుగా ఉండాలి. ఏలీ తాతను గౌరవించాలి. సమూయేలు ఏలీ తాతను గౌరవించాడు, ఆయనకు తనవంతుగా తాను చేయగలిగిన సహాయములెన్నో విసుగుకొనకుండా సమూయేలు ఖచ్చితంగా చేసి ఉంటాడు. 

సమూయేలు ఏలితాతకు ఏ విధంగా సహాయం చేసి ఉంటాడు? బహుశా ఆయన తీసుకురమ్మన్న వస్తువులు తీసుకురావడం, ఆయన వయసులో పెద్దవాడు కాబట్టి కొన్ని కొన్ని వస్తువులు ఆయనకు అందించడం ఇలా ఎన్నో రకాలుగా సహాయం చేసి ఉంటాడు.

 పిల్లలు, మీరు మీ ఇంట్లో పెద్ద వాళ్ళని గౌరవిస్తున్నారా? ముఖ్యంగా మీ అమ్మమ్మ, నాయనమ్మ , తాతయ్యలను గౌరవిస్తున్నారా? వారు చెప్పిన మాటను వింటున్నారా? మీలో ఎంతమంది ఉదయాన్నే లేచి మీ అమ్మమ్మ తాతయ్యకు, తల్లిదండ్రులకు వందనాలు చెప్తున్నారు? మీకు ఆ అలవాటు లేకపోతే ఈరోజు నుండి నేర్చుకోనండి. మీ అమ్మమ్మ తాతయ్యలు, లేదా మీ కంటే పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడడం వారికి వందనాలు చెప్పడం వారిని గౌరవించడం అవుతుంది. 

పెద్దవారిని గౌరవించే పిల్లలు మంచి పిల్లలు అని పిలవబడతారు. పైగా అలా చేయడం ద్వారా మీరు దేవునికి భయపడేవారుగా ఉంటారు, దేవుడు తనకు భయపడే వారందరినీ ఆశీర్వదిస్తాడు. మీ సేవకులను, సండే స్కూల్ టీచర్లను, స్కూల్లో టీచర్లను మీరు గౌరవించాలి. ఇంతకుముందు మీరు ఎవరినైనా గౌరవించకపోయినట్లయితే దేవుని ఎదుట క్షమాపణ కోరుకొనండి, ఇది మొదలుకొని వారిని గౌరవించడానికి నిర్ణయము చేసుకొనండి.

కంఠత వాక్యము :

తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను. -లేవీయకాండము 19:32

పునర్విమర్శ ప్రశ్నలు :

  • ఏలి కుమారుల పేర్లు ఏమిటి?
  • ఏలి కుమారుల వద్ద సమూయేలు ఎందుకు వదిలిపెట్టబడలేదు?
  • సమూయేలు ఏలిని ఏ విధంగా గౌరవించి సహాయం చేసి ఉంటాడో ఊహించి రాస్తూ , పెద్దలను గౌరవించి, వారికి సహాయం చేయుటకు చేయవలసిన పనులను పట్టికగా రాసి మీరు చేస్తున్న వాటికి సున్నా చుట్టండి , మీరు చేయాలనుకుంటున్న వాటి క్రింద గీత గీయండి.

Post a Comment