సమూయేలు పిల్ల చేష్టలు మానివేసాడు



సమూయేలు పిల్ల చేష్టలు మానివేసాడు


సమూయేలు పిల్ల చేష్టలు మానివేసాడు

 తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. -1 సమూయేలు 2:11

హాయ్ పిల్లలు బాగున్నారా, అజయ్ అనే బాబుని వాళ్ళ అమ్మవాళ్లు, 50 వేలు ఫీజు కట్టి ఒక మంచి స్కూల్లో చేర్పించారు, ఒక రోజున ఆ బాబును తీసుకుని వెళ్లి అక్కడే హాస్టల్లో జాయిన్ చేసి ఇంటికి రావడానికి వెళ్లారు. అయితే అజయ్ ఒకటే పనిగా మారం చేస్తూ ఉన్నాడు, హాస్టల్ కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉండకుండా వెంటనే ఇంటికి తిరిగి వచ్చాడు, మరి ఇలా చేస్తే నష్టం కదా! డబ్బులు అన్ని వ్యర్థమైపోయినవి కదా!!, పైగా మంచి స్కూల్లో చదువుకునే అవకాశం కూడా పోయింది. 

సరే పిల్లలు, మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? సమూయేలు గురించి కదా! సరే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నాకు సమాధానం చెప్పాలి. సమూయేలును దేవుని మందిరంలో విడిచిపెట్టడానికి ఎవరెవరు వచ్చారు? వాళ్ళ అమ్మ మాత్రమే వచ్చిందా?? కాదు వాళ్ళ నాన్న కూడా వచ్చాడు. వాళ్ల అమ్మ నాన్న ఇద్దరూ కలిసి సమూయేలను దేవుని మందిరంలో అప్పగించారు. ఆ తర్వాత వారు పాట పాడి దేవునిని స్తుతించారు. ఇంతకు మీకు సమూయేలు వాళ్ళ నాన్న పేరు తెలుసా? ఆయన పేరు ఎల్కానా. అందరూ చెప్పండి. 

సమూయేలను దేవుని మందిరంలో అప్పగించిన తర్వాత ఎల్కానా, హన్నా ఇద్దరు కూడా వారి ఇంటికి తిరిగి వెళ్లారు.  వారు సమూయేలును తీసుకువెళ్లారా? వదిలి వెళ్లారా?? వారు సమూయేలను వదిలి వెళ్లారు. అమ్మో ఒక్కడినే వదిలిపెట్టి వెళ్ళారా! అవును ఇకనుండి సమూయేలుకు అమ్మైనా నానైనా ఏలీతాతే! మరి అమ్మా నాన్న తిరిగి వెళ్ళిపోతా ఉంటే, సమూయేలు ఏడవలేదా? నేను కూడా ఇంటికి వస్తానని మారం చేయలేదా?

పిల్లలు మీరైతే ఏం చేస్తారు? మీ అమ్మ మిమ్మల్ని స్కూల్లో విడిచిపెట్టి వెళ్తూ ఉంటే ఏడ్చి దొరిలాడి మరలా అమ్మ తోటి ఇంటికి వచ్చేస్తారు కదా! సమూయేలుకు కూడా బాధనిపించి ఉంటుంది, కానీ ఇంటికి వస్తానని మారమైతే చేయలేదు, ఒకవేళ అలా చేసి ఉంటే వాళ్ళ అమ్మా నాన్న సమూయేలను వారితో పాటే ఇంటికి తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. 

కానీ బైబిల్ లో ఏమి రాయబడింది అంటే వారు సమూయేలను అక్కడే విడిచిపెట్టి వెళ్లారు, సమూయేలు దేవుని మందిరంలో ఉన్నాడు. పిల్లలు మనం చిన్నప్పుడు కొన్ని పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాం, కానీ మనం పెద్ద వారమయ్యే కొలది వాటిని మానివేయాలి. అలా మనం మానివేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. 

సమూయేలు ఇక్కడ మారం చేసి ఉంటే వాళ్ల అమ్మగారి కోరిక తీరేదా? లేదు కదా! సమూయేలుకు అక్కడ ఉండటం కష్టమైనా తాను మారాం చేయకుండా తల్లిదండ్రులు చెప్పినట్టు విని మంచిగా నడుచుకున్నాడు. పిల్లలు మీరు కూడా మారం చేస్తూ ఉంటారా? ఏ ఏ విషయాల్లో మీరు మారం చేస్తూ ఉంటారు? మీరు మారం చేయడం ద్వారా కలిగిన నష్టాలేంటి? ఒక పట్టికగా రాసుకొని ఇంకా ఈ విషయాల్లో మారం చేసి తల్లిదండ్రులను బాధ పెట్టమని, వారికి నష్టం కలుగు చేయమని దేవునికి మాట ఇవ్వండి.

కంఠత వాక్యము :

నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. -1 కోరింథీయులకు 13:11

పునర్విమర్శ ప్రశ్నలు

  • సమూయేలను విడిచిపెట్టడానికి ఎవరెవరు వచ్చారు?
  • సమూయేలును తల్లిదండ్రులు విడిచి వెళుతుండగా, ఆయన మారం చేశాడా?
  • మీరు చేసే పిల్ల చేష్టలను ఒక పట్టికగా రాయండి, వాటిల్లో మీరు మానివేయాలని అనుకుంటున్న వాటికి సున్నా చుట్టండి.

Post a Comment