ప్రణాళిక గల దేవుడు
(ఆది. 9-50 అధ్యాయములు)
దేవుడు కుటుంబం కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు.
దేవుడు ఈ సృష్టిని కలుగజేయడంలో ఆయనకున్న అనేకమైన ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం కుటుంబాన్ని కలిగి ఉండటం. తండ్రి కుమారా పరిశుద్ధాత్మలుగా వారు ఒకరితో ఒకరు మంచి సహవాసాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒక కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు, ఆ కుటుంబ ప్రణాళికను అమలు చేస్తూ ఆదాము హవ్వలను కలుగజేయడం జరిగింది.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. -ఎఫెసీయులకు 1:4-6
దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. -ఆదికాండము 1:28
ఆదాము హవ్వలు పిల్లలను కలిగి ఉండి భూమిని నిండించాలన్నది దేవుని ప్రణాళిక. అయితే వారు దేవుని ప్రేమకు పెట్టబడిన పరీక్షలో విఫలమై దేవుని నుండి దూరమైపోయారు, అయినప్పటికీ దేవుడు వారికి పిల్లలను ఇవ్వడం మానుకోలేదు. అయితే దేవుని చేత అనుగ్రహించబడిన ఆ పిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జీవించారు.
కయీను అనే వ్యక్తి తల్లిదండ్రులు వలె దేవునికి వ్యతిరేకిగా మారిపోయాడు, హేబేలు దేవునికి ఇష్టుడుగా ఉన్న కయీను చేతిలో ప్రాణాన్ని కోల్పోయాడు, అయితే దేవుడు మరల షేతు అనే మరొక కుమారుడ్ని ఆదాము హవ్వలకు ఇవ్వడం జరిగింది. షేతుకు కలిగిన ఎనోషు అనే కుమారుడి ద్వారా మరలా ఆ సంతానము దేవునితో మమేకమవడం ప్రారంభించారు.
ఒకపక్క కయీను సంతానం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వృద్ధి చెందారు, మరో పక్క షేతు సంతానం ఎంతోకొంత ఆత్మీయత కలిగిన వారుగా కొనసాగారు, ఓ రకంగా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకొనడానికి ఈ షేతు సంతానాన్ని ఎన్నుకున్నాడు అని చెప్పవచ్చు.
మానవాళి దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పటికీ, వారిని వారి పాపము నుండి విమోచించే ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అందులో భాగంగా స్త్రీ సంతానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాలి, అందుకొరకు దేవునికి ఒక కుటుంబం కావాలి.
మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. -ఆదికాండము 3:15
ఇలా తరాలు మారుతూ ఉన్నాయి, షేతు సంతానములో కూడా అడపాదడపా కొంతమంది నీతిమంతులు తారసపడ్డారు, తనతో సహవాసం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టక వారిని తుది వరకు నడిపించాడు, అందుకు ఒక చక్కని ఉదాహరణ హనోకు జీవితమే.
హానోకు తర్వాత నీతిమంతుడిగా జీవించిన నోవాహు తరంలో, ఆయన తప్ప మిగతా వారందరూ దేవునికి వ్యతిరేకులు కావడం మూలంగా దేవుడు వారిని తుడిచిపెట్టి తనకు అనుకూలంగా ఉన్న నోవాహును ఆయన కుటుంబాన్ని కాపాడాడు.
దేవుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చేస్తున్నది ఇదే, తనకు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని రక్షించడం, తనకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని నిర్ణీత సమయంలో తుడిచివేయడం.
ఇప్పుడు అనగా జల ప్రళయం తర్వాత భూమ్మీద మిగిలింది నోవాహు కుటుంబం మాత్రమే, కాబట్టి దేవుడు తన ప్రణాళికను మరలా నోవాహు కుటుంబంతో కొనసాగించాడు. ఆదాము హవ్వలతో దేవుడు ఏ మాటలైతే చెప్పాడో, అవే మాటలు నోవాహు యొక్క కుటుంబంతో కూడా చెప్పడం జరిగింది, అనగా ఇప్పుడు నోవాహు ఆయన కుటుంబం భూమిని నిండించాలని దేవుడు కోరుకున్నాడు.
మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. -ఆదికాండము 9:1-4
జలప్రళయం తర్వాత నోవాహు కూడా పడిపోయిన వాడుగా ఉన్నాడు, నోవాహు కలిగిన ముగ్గురు కుమారులలో దేవుడు షేము అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ షేము సంతానములో నుండి వచ్చిన వాడే అబ్రహాము.
ప్రణాళిక నెరవేర్పు కొరకు దేవుడు సాధారణ వ్యక్తులను ఎన్నుకున్నాడు
ఈ లోకంలో దేవుని కొరకు కొన్ని అసాధారణమైన కార్యాలు జరిగించిన వారిని చూసినప్పుడు వారు అసాధారణమైన వ్యక్తులు అని మనం భావిస్తాం. కానీ వాస్తవం ఏంటంటే వారు ఆ పని కొరకు ఎన్నుకొనబడ్డప్పుడు వారు సాధారణమైన వ్యక్తులే, ఇంకా చెప్పాలంటే బలహీనులే అని చెప్పవచ్చు.
ఈ లోకం ఒక వ్యక్తిని ఒక పని కొరకు ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అర్హతను చూస్తుంది. కానీ దేవుని ఎన్నిక ఆ వ్యక్తికి అర్హతనిస్తుంది, ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఎన్నుకునేది అర్హత లేనివారినే అని కొన్నిసార్లు అనిపిస్తుంది.
ఎక్కువ కాలం దేవుని పరిచర్యలో కొనసాగిన ఏ వ్యక్తి అయినా తాను చేస్తున్న ఆ పరిచర్యకు అర్హుడును కాను అని భావిస్తాడు. పాప స్వభావము కలిగి, పాపము చేయగలవాడైన మానవుని దేవుడు ఎన్నుకొని తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం ఎంతో గొప్ప విషయమై యున్నది.
షేము సంతానములో తెరహును, తెరహుకున్న ముగ్గురు కుమారులలో అబ్రామును (ఈయన పేరును దేవుడు తర్వాత అబ్రహాము అని మార్చాడు) ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులందరూ సాధారణమైన వారే అనే విషయాన్ని మనం గ్రహించాలి.
దేవుడు తన కొరకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తులందరూ సాధారణమైన వారే, అంతేకాదు వారందరూ బలహీనులు అని కూడా మనం గమనించవచ్చు.
దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు ఆయనకు పిల్లలు లేరు, ఒక గొప్ప కుటుంబాన్ని కలిగి ఉండాలని అనుకున్న దేవుడు, తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి ఇప్పటికే ఒక డజన్ మంది పిల్లలు కలిగిన కుటుంబాన్ని ఎన్నుకుంటే బాగుండేది కదా అనేది మానవుని ఆలోచన.
అబ్రహాములాంటి కుటుంబాన్ని ఎన్నుకోవడం బుద్ధిహీనమని కొంతమందికి అనిపించవచ్చు. కానీ దేవుని ఎన్నికల్లో ఉన్న గొప్పతనము అదే అనే విషయాన్ని మనము గమనించాలి.
అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యూదా ఇలా దేవుడు కుటుంబంలో కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని తన ప్రణాళికను నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు.
నీవు బలహీనుడవైనప్పటికీ, పాపివైనప్పటికీ, దేవుడు నిన్ను తన కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన పని చేయుటకు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు.
నీ అర్హతలు బలహీనతలు వైపు చూసుకొని వెనకడుగు వేయక, నిన్ను పిలిచిన వాడు సర్వజ్ఞుడు మరియు సర్వశక్తివంతుడని నమ్మి ఆయన ఎన్నికకు అడ్డు చెప్పక లోబడి నీ ద్వారా ఆయన సాధించాలనుకున్న కార్యములు జరిగించుటకు సిద్ధపడటం ఉత్తమమైన విషయం.
నీవు దాన్ని తిరస్కరిస్తే ఆ పని చేయడానికి దేవునికి చాలామంది ఉన్నారు, కానీ నీకు దొరికిన అవకాశాన్ని నీవు పోగొట్టుకుంటావు. జ్ఞానవంతులు మంచి నిర్ణయాన్ని చేస్తారు, మంచి నిర్ణయం తీసుకునే విధంగా ప్రభువు నిన్ను నడిపించును గాక, ఆమెన్.
దేవుడు వీరిని మాత్రమే ఎన్నుకోవడానికి కారణమేమిటి?
కృప చేతనే ప్రణాళిక నెరవేర్పు నిమిత్తమై మనుషులను ఎన్నుకొనడం జరిగింది
ఇంతకుముందు చెప్పినట్టుగానే వారందరూ సాధారణమైన వ్యక్తులు, మరియు అనేకమైన బలహీనతలు కలిగిన వారు. ఉదాహరణకు అబ్రహాము జీవితాన్ని చూస్తే ఆయన రెండుసార్లు అబద్ధాలాడినట్టు బైబిల్ లో రాయబడింది, ఇస్సాకు కూడా అబద్ధం ఆడాడు, యాకోబు మరి ఎక్కువ అబద్దాలాడాడు, మోసం చేశాడు మరి వీరిని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు? కేవలము ఆయన కృప చేతనే, వారి ఎన్నికలో వారి గొప్పతనం ఏమీ లేదు.
దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడు అనేదానికి కారణం దేవునికి మాత్రమే తెలుసు, వీరినే నీవు ఎందుకు ఎన్నుకున్నావని దేవునిని అడిగే హక్కు మనకి ఎవరికీ లేదు. మనం ఈ లోకంలో జన్మించుటకు ముందే దేవుని కుటుంబంలో మనము సభ్యులము కావాలని దేవుడు మనలను ఎన్నుకున్నాడు, మనం ఎలాంటి వారేమో దేవుడు ఎరిగినప్పటికీ మన ద్వారా కొన్ని పనులు నెరవేర్చుకొనడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు.
షేతు సంతానములో దేవుడు ఎన్నిక చేస్తూ వచ్చిన మనుషులను మనం గమనిస్తే, ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉంటే దేవుడు ఒక్క వ్యక్తిని మాత్రమే ఎన్నుకొని మిగతా వారిని పక్కకు పెట్టినట్లు చూస్తూ వచ్చాం, అబ్రహాము తర్వాత ఇస్సాకు ఇస్మాయేలు ఇద్దరు ఉన్నారు, దేవుడు ఇస్మాయిల్ ను ఎన్నుకోలేదు, ఇస్సాకు కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు ఏశావు యాకోబు అనే వారిలో యాకోబును మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు.
వీరు ఎన్నికల్లో పక్షపాతం లేదు గాని దేవుని కృప ఆయన సార్వభౌమ అధికారం మాత్రం కనబడుతున్నది. అంతేకాదు దేవుని ఎన్నికలకు లేదా ఆయన సార్వభౌమ అధికారానికి మనము ఎలా స్పందిస్తామో అనేది కూడా చాలా ముఖ్యం, దేవుడు తన సార్వభౌమ అధికారం చొప్పున ఒక నిర్ణయం చేసినప్పటికీ, మనుషులుగా ఆయన మనకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఆ ఎన్నికలో నుండి తొలగిపోయి మనకు ఇష్టమైన దారిని మనము ఎంచుకొనగలిగే అవకాశం ఉన్నది.
దేవుడు ఆ విషయంలో అడ్డం రాడు, దేవుడు వదిలిపెట్టిన వారందరు దేవుని పట్ల విశ్వాసం లేక, ఆయనతో సహవాసము లేక జీవించినవారే. దేవుడు ఎన్నుకున్న వారిలో ఎన్ని బలహీనతలు ఉన్నా వారి విశ్వాసము, ప్రతి సమయంలో వారు దేవునికి స్పందించే విధానము వారిని ఆ ఎన్నికలో నిలవబెట్టింది. దేవుడు తన కృప ద్వారానే నేడు ఈ సత్యాన్ని నీకు అందింపచేస్తున్నాడు, విశ్వాసంతో నీవు స్పందిస్తే దేవుని గొప్ప కార్యములు నీ జీవితంలో నీవు చూడగలుగుతావు.
సమస్త జనులను ఆశీర్వదించాలని ప్రణాళికతోనే దేవుడు కొంతమందిని ఎన్నుకొనడం జరిగింది.
ఈ లోకంలో ఉన్న వారందరూ దేవుని ఆజ్ఞలను మీరుట వలన, దేవునితో సహవాసమునకు దూరమైన వారై, నరక శిక్షకు పాత్రులుగా ఉన్నారు.
తన ప్రజలు తన యొద్ద నుండి దూరమై నరక శిక్షను నిత్య వేదనలను అనుభవించుటను చూడలేని దేవుడు వారి శిక్షను తప్పించాలని వారిని విమోచించు ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సర్వలోకమంతా దేవుని ఎదుట దోషులై ఉన్నారు, ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని విమోచించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు.
నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా -ఆదికాండము 12:3
దేవుడు యూదులను మాత్రమే ఎన్నుకున్నప్పటికీ, ఆయన యూదులను మాత్రమే ఆశీర్వదించాలని ఆ విధంగా చేయలేదు. ఆయన ఉద్దేశం ఆ యూదులను ఉపయోగించుకొని సర్వలోకమానవాళికి రక్షణను దీవెనలు తీసుకురావాలని ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు.
ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు లేదు, సత్య సువార్తకు విశ్వాసంతో స్పందించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే దీవెన పొందే అవకాశం ఉన్నది. ఆయన మార్పు లేని వాడు, ఆయన ఉద్దేశాలు ఇప్పటికీ మారలేదు,
అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఈ సమస్త జనులు అనే విషయం అబ్రహాము మొదలుకొని ఇప్పటివరకు దేవుని ఆలోచనలో మెదలాడుతూనే ఉన్నది అనే విషయము మనము గమనించాలి.
దేవుడు ముందస్తు ప్రణాళికలు చేసే వాడై ఉన్నాడు
మనం కొన్నిసార్లు ఊహతో ప్రణాళికలు చేసి సర్వజ్ఞానలమన్నట్టు మాట్లాడటతాము. కానీ దేవుడు నిజంగానే సర్వజ్ఞానియై ఉన్నాడు గనుక జరగబోవునదేదో ఆయనకు ముందుగానే తెలుసు గనుక, తాను ఎన్నుకున్న ప్రజలకు మేలు చేయు నిమిత్తమై చాలా ముందస్తు ప్రణాళికలు ఆయన కలిగి ఉంటాడు.
ఈ లోకంలో ఉన్నది ఏది దేవుని ఆశ్చర్యపరచలేదు, కారణం దేవుడు సమస్తము ఎరిగిన వాడుగా ఉన్నాడు.
సంతానము లేని స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు ఎన్నుకొని నిన్ను గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానమును నిలబెట్టుకుంటూ 100 సంవత్సరాల వయసులో అబ్రహాము శారాలే ఊహించని తరుణంలో వారికి ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆయన పేరే ఇస్సాకు.
ఈ ఇస్సాకును దేవుడు దీవించి ఇద్దరు పిల్లలను ఇచ్చాడు, వారిలో ఒక అతని పేరు ఏశావు, మరొకని పేరు యాకోబు. దేవుడు తన ప్రణాళికను కొనసాగించడానికి యాకోబును ఎన్నుకున్నాడు.
తాను ఎన్నుకున్న యాకోబును ఒక పెద్ద కుటుంబం గా చేశాడు, ఈ పెద్ద కుటుంబానికి భవిష్యత్తులో ఒక కరువు రాబోతున్నది. 20 సంవత్సరాల్లో రాబోయే కరువు నిమిత్తమై దేవుడు ముందుగానే ప్రణాళికలు చేశాడు. ఆ కరువులో ఆ కుటుంబాన్ని కాపాడడానికి ప్రణాళిక చేస్తూ యాకోబు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు దేవుడు పంపించాడు.
అయినను నేనిక్కడికి వచ్చు నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. -ఆదికాండము 45:5
ఇందులోను దేవునికొక ఉన్నతమైన దూర దృష్టి ఉన్నది. దేవుడు అబ్రహాముకు తాను నివసిస్తున్న కనాను దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు, అది తనకు ఎప్పుడు సొంతం అవుతుంది అని అబ్రహం అడిగిన ప్రశ్నకు దేవుడు సమాధానం ఇస్తూ, ఈ ప్రాంతంలో ఇప్పటికే నివసిస్తున్న అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు.
కాబట్టి నీ సంతానపు వారు తామెరగని దేశంలో 400 సంవత్సరాల పాటు బానిసలుగా ఉండి శ్రమను అనుభవిస్తారు, ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో వారు ఇక్కడికి తిరిగి వస్తారు, ఇక్కడ ఉన్న వారిని వెళ్లగొట్టి దీనిని స్వాధీనం చేసుకుంటారు అని చెప్పాడు.
ఈ దేవుని ప్రణాళిక అర్థం కాని చాలామంది యూదులు ఎవరి దగ్గర నుంచో ఆ భూమిని లాక్కున్నట్టుగా మాట్లాడతారు, అక్కడ ఉన్న వారిని పంపించి వేయడం కూడా కొంతమందికి నచ్చదు. దేవుడు ఇక్కడ ఉన్న వారిని ఎందుకు పంపించి వేస్తున్నాడు? దేవుని విధానమే అది, తనకు అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని తుడిచి వేయడమే.
ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. -ఆదికాండము 15:13-16
ఈ ప్రజలకు 400 సంవత్సరాల సమయం ఇచ్చాడు, ఈ సమయంలో వారు వారి జీవితాన్ని మార్చుకుంటే వారి పట్ల దేవుని ఉద్దేశాలు మరో రకంగా ఉండేవి, అయితే ఇక్కడ వారు మార్చుకుంటారో లేదో కూడా దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు.
అయితే వారు మార్చుకోకపోతే వారి అక్రమమునకు దేవుడు శిక్ష విధించే స్థాయికి వారు చేరుకుంటారు కనుక దేవునికి ఇష్టము లేని జీవితాన్ని వారు జీవిస్తున్నందుకు వారిని అక్కడి నుండి తొలివేసి, తనకిష్టమైన జీవితాన్ని జీవించే వారికి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసేవాడిగా దేవుడు ఉంటాడు.
అబ్రహాముకు దేవుడు చెప్పిన ఈ మాటల్లో భాగంగా ఐగుప్తులో నివసించడానికి మొదటిగా యోసేపును దేవుడు పంపించాడు, ఆ తర్వాత యాకోబు కుటుంబాన్ని కూడా దేవుడు పిలిపించాడు.
మొత్తానికి కరువు సంవత్సరాలు వచ్చాయి ఆ కరువు సంవత్సరాల్లో ఐగుప్తుకు చేరిన యోసేపు ఒక ఆర్దిక మంత్రి హోదాలో ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయన కాలములో యాకోబు కుటుంబం 70 మంది గా కరువును తప్పించుకొనడానికి ఐగుప్తుకు చేరిన వారుగా ఉన్నారు. దేవుడు ఎంత ముందస్తుగా తన ప్రణాళికలు చేస్తున్నాడో గమనించండి.
మన విమోచనను గూర్చిన ప్రణాళిక, ఏసుక్రీస్తు వారి సిలువ మరణము ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాలనే ప్రణాళిక మానవులు పాపము చేసినప్పుడు దేవుని మనసులో నుండి హడావుడిగా పుట్టినది కాదు, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకొరకు నియమించబడ్డారు.
మన దేవుడు భవిష్యత్తును ఎరిగిన దేవుడు, మనకు సంభవించబోయేవి, మనము ప్రవర్తించబోయే విధానము అన్నిటినీ దేవుడు ఎరిగిన వాడుగా ఉండి వాటి మధ్య తన ఉద్దేశాలు నెరవేర్చుకొనుటకు ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేసే వాడిగా మన దేవుడు ఉంటాడు.
నీవు జన్మించక ముందే నీ జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, రాబోయే 10 15 సంవత్సరాల్లో నీ జీవితంలో ఏమి జరగాలో దేవుడు ముందుగానే ఉద్దేశించాడు.
నీకు కలగబోయే కష్టనష్టాలు అన్నిటిలో నుండి విమోచించడానికి బలపరచడానికి కాపాడడానికి దేవుడు ఇప్పటికే నీ కొరకు పరిష్కారాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు.
సమస్యలను చూచి దిగులు చెందకు, సమస్త మెరిగిన దేవునికి మౌనంగా నిన్ను నీవు అప్పగించుకో, ఆయన మీద ఆనుకో, ఆయన నీ కొరకు ముందస్తుగా తయారు చేసిన ప్రణాళికలను అవసరమైన సమయంలో నెరవేర్చి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ముందస్తు ప్రణాళికలు మా కొరకు సిద్ధపరుస్తున్న దేవా, అన్ని సందర్భాల్లో నీ మీద ఆనుకొని ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగిపోయే భాగ్యము మాకు దయచేయండి.
దేవుని ప్రణాళికలన్నీ మేలుకే
మన దేవుడు ముందస్తు ప్రణాళికలు చేసే దేవుడని తెలుసుకున్నాం కదా, ఆయన తన ప్రణాళికలో భాగంగా యాకోబు యొక్క కుటుంబాన్ని దేవుడు రక్షించే క్రమంలో యోసేపును ఐగుప్తుకు పంపాడు అని తెలుసుకున్నాము. అయితే యోసేపు ఐగుప్తుకి ఎలా చేరాడో తెలుసా? యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద పగ పట్టి ఆయనను ఒక బానిసగా అమ్మి వేశారు, అలా యోసేపు ఐగుప్తుకు రావడం జరిగింది.
ఐగుప్తులో యోసేపు చాలాకాలం బానిసగానే ఉన్నాడు ఎట్టకేలకు దేవుడు కలుగజేసుకొని యోసేపును ఐగుప్తును పాలించే స్థాయిలో నిలిచాడు, యాకోబు కుటుంబాన్ని ఐగుప్తుకు రప్పించిన తర్వాత యాకోబు కొన్నాళ్ళకి చనిపోయాడు, ఆ సమయంలో యోసేపు యొక్క అన్నలు ఎంతో భయపడి, ఇప్పుడు యోసేపు ఐగుప్తును పాలిస్తున్నాడు, మనం గతంలో ఆయనను అమ్మేశాం కదా అది మనసులో పెట్టుకొని మనకు కీడు చేస్తాడేమో అని ఆలోచిస్తున్న సందర్భంలో యోసేపు ఇలా అంటాడ
మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. -ఆదికాండము 50:20
నిజంగా మనుషులు మనకి ఏమి చేయాలని ఉద్దేశించిన, దేవుని యొక్క ప్రణాళిక అది మేలు నిమిత్తమై ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఆ కీడును కూడా దేవుడు మేలుగా మార్చగలడు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయనపై అసూయ చెందిన వారందరూ మేము గెలిచామని భావించారు, కానీ ఆ మరణము ద్వారా పాపము సాతాను యొక్క బానిస నుండి మానవాళికి దేవుడు విడుదలను కలిగించాడు.
మీ జీవితంలో మనుషులు నీకు కీడు చేయ ఉద్దేశిస్తున్నారని బాధపడుతున్నావా, దేవుడు దాన్ని మేలుకై మారుస్తాడు. తమ జీవితంలో నెరవేరని వాగ్దానాలను గట్టిగా నమ్మి తమ తర్వాతి తరాలకు వాటిని బోధించి ఆ మార్గంలో నడిపించిన విశ్వాస వీరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు అని వారి మార్గంలో మనం కూడా నడుస్తూ ప్రణాళిక గల దేవునికి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకుందాం. యోసేపు తాను చనిపోతూ కూడా తన తర్వాత వారికి ఇదే మాట చెప్పాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలను ఆ ప్రాంతానికి తీసుకు వెళ్ళండి అని చెప్పాడు.
కష్టాలు మన జీవితంలో కలిగిన, మనము క్రమశిక్షణలో పెట్టబడిన మనుషులు మనలను ద్వేషించిన దేవుడు వాటన్నిటినీ మనకు మేలుగా మారుస్తాడు.
కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి మనలను పలకరించిన దాని వెనక ఆయనకున్న ప్రణాళిక మేలును ఉద్దేశించినదై ఉన్నదని గ్రహించండి. సమస్యలు కూడా మేలుకై ఆయన ఉద్దేశించాడని తెలుసుకోండి.
ప్రస్తుతము అనుభవిస్తున్న కష్టం మీద కాక ప్రణాళిక గల దేవుడు దాని వెనక దాచి ఉంచిన మేలు మీద మన దృష్టి నిలిపి ముందుకు సాగుదాం, అలాంటి భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి