దేవుడు సృష్టికర్త


దేవుడు సృష్టికర్త

దేవుడు సృష్టికర్త

    భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని గూర్చి తెలియపరిచిన సర్ ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్తకు నాస్తికుడైన ఓ స్నేహితుడు ఉండేవాడు. సర్ ఐజక్ న్యూటన్ అనే ఈ శాస్త్రవేత్త దేవుని యందు విశ్వాసముంచిన వ్యక్తి అని మనం గ్రహించవలసి ఉన్నది. దేవుని ఉనికిని నమ్మని తన స్నేహితునికి ఆ సత్యాన్ని ఎలా బోధపరచాలని చాలా తీవ్రంగా ఆయన ఆలోచించారు. ఎట్టకేలకు ఒక దినాన తనకు కలిగిన ఆలోచనను బట్టి ఒక వడ్రంగి పని చేసే వ్యక్తి దగ్గరికి వెళ్లి సూర్య కుటుంబమును(Solar System ) ప్రతిబింబించే విధంగా ఒక నమూనాను తయారు చేయమని అడిగాడు. 

    కొన్ని దినాల తర్వాత ఆ వ్యక్తి ఈ శాస్త్రవేత్త కోరిన విధంగా దాన్ని తయారుచేసి ఇచ్చారు, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో హాల్లో ఒక టేబుల్ మీద ఉంచడం జరిగింది. ఒకానొక దినాన ఈ నాస్తికుడైన స్నేహితుడు తన ఇంటికి రావడం జరిగింది, టేబుల్ మీద తన కళ్లెదురుగా కనబడుతున్నటువంటి సూర్య కుటుంబమును ప్రతిబింభించే ఆ అద్భుతమైన నమూనాను చూసి, " భలే ఉంది దీన్ని ఎవరు చేశారు అని అడిగాడు" దానికి న్యూటన్ గారు " దాన్ని ఎవరు చేయలేదు దానికై అదే ఏర్పడింది" అని అన్నాడు. దానికి ఆ స్నేహితుడు " జోక్ చేయొద్దు చెప్పు దీన్ని ఎవరు చేశారో " అని అడిగాడు. దానికి న్యూటన్ గారు మరల అదే సమాధానం ఇచ్చాడు. కొంత విసుగు చెందిన ఆ స్నేహితుడు " ఇంత అందంగా చక్కగా క్రమంగా ఉన్న ఒక నమూనా ఎవరో ఒకరు చేయకుండా దానిపై అదే ఎలా ఏర్పడుతుంది" అని అడిగాడు. అప్పుడు న్యూటన్ గారు "అవును కదా! ఇక్కడ ఉన్న ఈ నమూనాను చూసే దానికై అది ఏర్పడింది అంటే నమ్మలేకపోయావు, మరి దేవుడు లేకుండా ఈ సృష్టి దానికై అదే ఏర్పడిందని ఎలా నమ్ముతున్నావు" అని అడిగాడు.

    మనలో చాలామంది ఇప్పటికి కూడా ఆ నాస్తిక స్నేహితుడు వలె ఈ లోకము దానికై అదే ఉద్భవించిందని భావిస్తూ ఉంటాము. దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడనే వాస్తవాన్ని గ్రహించుము, ఒప్పుకోము.

    కానీ బైబిల్ మొదటి వచనంలోనే ఈ సృష్టి అంతటికి ఒక సృష్టికర్త ఉన్నట్టు స్పష్టంగా తెలియజేస్తున్నది.

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. -ఆదికాండము 1:1 

    అవును దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయనను ఎవరు సృజించలేదు, ఆయన ఈ లోకమును సృజించినవాడుగా ఉన్నాడు. ఆయన తప్ప ప్రతి ఒక్కటి ఆయన చేత సృజింపబడినవే.  దేవుడు తన మహిమ కొరకు తన మాట చొప్పున శూన్యములో నుండి ఈ సృష్టినంతటని కలిగించాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానిని ఆయన ఒక ఉద్దేశంతో కలిగించాడు.

 నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే. - యెషయా 43:7

 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను. -కీర్తనలు 33:6

    దేవుడు సృష్టికర్త అనే సత్యాన్ని నీవు నమ్ముతున్నావా? ఒకవేళ నీవు నమ్మకపోతున్నట్లయితే, ఈ అద్భుతమైన సృష్టికి ఆయనే కారణమని నీవు గ్రహించినట్లు దేవుడు సహాయం చేయను గాక. దేవుడు సృష్టికర్తని నమ్ముతున్న నీవు, ఆయన మారని వాడని, ఆయనకు వయసు లేదని, ఆయన శక్తి ఏమాత్రం తగ్గదని కూడా నీవు నమ్మవలసి యున్నది.

    ఇప్పటికీ నీవు ఉన్న ఏ స్థితిలోనైనా, నూతనమైన కార్యములు కలిగించుటకు ఆయన సామర్థ్యం కలిగి ఉన్నాడని విశ్వసించవలసి ఉన్నది. ఆయన లేని దానిలో నుండి రమ్మని పిలిచే దేవుడు, నీకున్న లేమిని బట్టి దిగులు చెందకుండా, సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసముంచి ఆయన మీద ఆనుకో. స్నేహితులు కాదన్నా డాక్టర్ లేదన్నా, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడని గ్రహించు. ఆయన యొక్క సృజనాత్మక శక్తి యందు విశ్వాసముంచి, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నిన్ను కలిగించిన ఉద్దేశమును నెరవేర్చుటకు సహాయం చేయమని వేడుకుంటూ కఠిన పరిస్థితుల్లో దిగులు చెందక, మంచి పరిస్థితులలో విర్రవీగక ఆయన మహిమ నిమిత్తము జీవించడానికి తీర్మానించుకుందాం.

" సృష్టికర్త అయిన తండ్రి, నా పట్ల నీవు కలిగి ఉన్న ఉద్దేశములన్నిటిని నెరవేర్చు భాగ్యము నాకు దయచేయుము"

- Rephidim Ministries   

Post a Comment