యోబు గ్రంధము : దేవుడు న్యాయవంతుడు

యోబు గ్రంధము :  దేవుడు న్యాయవంతుడు

యోబు గ్రంధము : 

దేవుడు న్యాయవంతుడు

భారత దేశములోని మణిపూర్ రాష్ట్రములో జరుగుతున్న మారణ ఖాండ గురించి వింటూ ఉంటే చాలా బాధ కలుగుతున్నది. మణిపూర్ లో ఆ సమస్యలకు కారణం ఏమిటి? ఒక్కకరిది ఒక్కో సమాధానం. కొంతమంది అది జాతుల మధ్య గొడవ అని, ఇంకొంతమంది అది క్రైస్తవులు మీద దాడి అని, మరి కొంతమంది అది ఒక మతం లేదా పార్టీ చేస్తున్న కుట్ర అని మాట్లాడుతున్నారు.

ఇది క్రైస్తవులు మీద దాడి అని అంగీకరిస్తే అది అలా జరగడానికి క్రైస్తవుల పాపం కారణమని, విశ్వాసం కారణమని, సాతాను కారణమని ఇలా రకరకాల వాదనలు వినిపించబడవచ్చు.

మన జీవితంలో ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు దానికి కారణాలు వెతుకుతూ ఉంటాము. కొన్ని సార్లు మనకు సంతృప్తికరమైన సమాధానాలు దొరుకుతాయి, మరికొన్ని దొరకకపోవచ్చు. కొన్నిసార్లు మనకు దొరికిన సమాధానాలు సరైనవి అని మనం అనుకుంటాం, కానీ అవి దేవుని దృష్టిలో సరైనవి కాకపోవచ్చు.

సుమారు 4000 సంవత్సరాల క్రితం నేటి గణాంకాల ప్రకారం 400 వందల కోట్ల విలువ చేసే గొప్ప ఆస్తిపరుడు ఉండేవాడు. ఈయన ఆస్తి 20 మైళ్ళ దూరం ఉండొచ్చు అని ఇంకో పండితుని అంచనా. ఈయనకు 10 మంది పిల్లలు ఉన్నారు. ఈయనకు దేవుడంటే భయము భక్తి ఉన్నాయి, జీవితంలో ఎంతో యదార్ధంగా నడుచుకునేవాడు. ఇలాంటి వ్యక్తికి ఒక్కసారిగా సమస్యలు వచ్చిపడ్డాయి. పిల్లలందరూ చనిపోయారు, ఆస్తి మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. తన శరీరముకు కురుపులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో ఆయన అడిగే ప్రశ్న, ఆయనను తెలుసుకుంటున్న మనమందరం అడిగే ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది? మన జీవితంలో కష్టాలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని చక్కగా చర్చించే గ్రంధమే యోబు గ్రంధము.

యోబు గ్రంధంలో రాయబడిన సంఘటనలు క్రీస్తు పూర్వము 2000- 1800 మధ్య కాలములో జరిగాయి, అయితే 1440-1400 మధ్యలో మోషే ఈ గ్రంధమును రాసి ఉండొచ్చు. ఈ గ్రంధంలో 42 అధ్యాయములు ఉన్నాయి, వీటిని మూడు భాగములుగా విభజించవచ్చు,

  • 1,2 అధ్యాయములు - పరిచయం
  • 3- 41 అధ్యాయములు - పలు వాదములు
  • 42 అధ్యాయము - పునరుద్దరణ

యోబు ఎవరు? ఆయన కుటుంబం నేపథ్యము, ఆస్తుల వివరాలు, ఆయనకు కలిగిన కష్టాలు అను విషయాలు మొదటి భాగములో కనబడుతుంది. యోబును పరామర్శించుటకు వచ్చిన ముగ్గురు స్నేహితులు (ఏలిఫజు, బిల్డదు, జోఫరు ) , యోబు పరిస్థితిని సమీక్ష చేస్తూ ఒకరు మార్చుకొని ఒకరు మూడు సార్లు చేసిన వాదనలు, దానికి యోబు ఇచ్చిన సమాధానాలు, యవ్వనస్తుడైన ఏలిహు చేసిన వాదనలు, వీరందరి వాదనలకు 70 కంటే ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ దేవుడు ఇచ్చిన సమాధానం వంటి విషయాలు రెండొవ భాగములో మనము చూడవచ్చు. మూడవ భాగములో యోబు పోగొట్టుకున్న వాటిని దేవుడు ఎలా రెట్టింపు చేసాడో తెలియపరచబడింది.

ఈ గ్రంధం మనకు నేర్పే సత్యాలు

దేవుడు ఇచ్చే వాటి కోసం కాకుండా దేవుని కోసమే ఆయనను వెంబడించాలి.

సాతాను యోబు విషయంలో చేసిన సవాలు ఇదే, యోబు భక్తిగా ఉన్నాడు అంటే, దీవెనలు అనే లంచం నీవు ఇస్తున్నావు కాబట్టి అతను నీ పట్ల నమ్మకముగా భక్తిగా ఉన్నాడు, ఒక్కసారి దీవించడం మాని కష్టాలు అనుమతించు అతను ఖచ్చితంగా నీకు దూరం అవుతాడు అని సవాలు చేసాడు. కాని ఇది యోబు విషయంలో తప్పు అని తేలింది, మరి మన విషయంలో!

ఎవరిని నీవు వెంబడిస్తున్నావు? దేవునినా? ఆయన ఇచ్చే వాటినా? యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని చెబుతూ దేవుని పట్ల భక్తిని కోల్పోకుండా జాగ్రత్తపడదాం.

పాపమును బట్టి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి

యోబు స్నేహితులు తమ వాదనను ఈ అంశాన్ని ఆధారం చేసుకుని చేశారు. వారిలో ఎలీఫజు చెప్పిందేంటంటే యోబు పాపం చేశాడు కాబట్టి దేవుడు ఆయనను శిక్షిస్తున్నాడు. ఎలిఫజు మాట్లాడిన మూడు సందర్భాల్లో (4,5,15,22 అధ్యాయములు ) తాను ఇదే వాదనను వినిపించాడు. 

మరొక స్నేహితుడైన బిల్డదు తాను మాట్లాడిన మూడు సందర్భాల్లో యోబు తాను చేసిన తప్పును ఒప్పుకోవటం లేదు కాబట్టి ఇంతటి శ్రమను అనుభవిస్తున్నాడు అని చెప్పాడు, మరొక స్నేహితుడైన జోఫరు తాను మాట్లాడిన రెండు సందర్భాల్లో యోబు చేసిన తప్పులకి ప్రస్తుతం అనుభవిస్తున్న దాని కంటే ఇంకా గొప్ప శ్రమలు రావచ్చు అని కూడా చెప్పాడు. వీరు చెప్పిన మాటలు వాస్తవమే గాని యోబు విషయంలో అవి ఏమాత్రం సరిపోవు, యోబు పాపము చేసిన దానిని బట్టి శ్రమను అనుభవించడం లేదు. కాబట్టి వారి వాదనలు యోబుకు ఏమాత్రం ఓదార్పును కలిగించలేదు ఇంకా ఆయన గాయాన్ని రెచ్చగొట్టాయి అని చెప్పొచ్చు. ఈ సత్యం యోబు విషయంలో సరిపోలేదు, మరి మన సంగతేంటి? సమస్యల వలయంలో మనం చిక్కుకున్నప్పుడు, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చాయి అని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ పరిశీలన మనం చేసుకోవాలి. నాలో పాపము ఉన్నదేమో అని మనలోకి మనము తొంగి చూసుకోవాలి.

శ్రమలు మన ఆత్మీయ జీవితాన్ని శుద్ధి చేయడానికి వస్తాయి

వాస్తవానికి యోబు యొక్క పరిస్థితిని తెలుసుకొని ఆయనను పరామర్శించడానికి ఎలీఫజు, బిల్డదు, జోఫరు, మరియు ఎలీహు అనువారు వచ్చారు. కొన్ని దినాల మౌనం తర్వాత పెద్దవారైన ఆ ముగ్గురు యోబుతో ఒకరు మార్చుకొని ఇంకొకరు మూడు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. 

వారు మాట్లాడుతున్నంత సేపు మౌనంగా ఉన్న యవనస్తుడైన ఎలిహు ఎట్టకేలకు పెదవిప్పి మన జీవితాన్ని శుద్ధి చేయడానికి, నూతనమైన రీతిలో మనలను మలచడానికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడని తెలియపరిచాడు. 

ఈ మాట వాస్తవమే కానీ ఇది యోబుకి ఏమాత్రం వర్తించదు. మరి నీకేమైనా వర్తిస్తుందేమో ఆలోచించు! నాలో పాపము లేదు నేను మంచిగానే దేవునిని వెంబడిస్తున్నాను మరి నాకెందుకు ఈ శ్రమలు అని నీవు భావిస్తున్నట్లయితే దేవుడు నిన్ను మరింతగా శుద్ధి చేయడానికి, ఆయన కోరుకున్న రూపం లోనికి నిన్ను మలచడానికి, ఒక ఉన్నతమైన పని కొరకు నిన్ను సిద్ధపరచడానికి బహుశా ఈ శ్రమలు నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడేమో. మౌనంగా దేవునికి అప్పగించుకో, ఆయన చేయదలచిన కార్యమును జరగనివ్వు

దేవుడు న్యాయవంతుడు సార్వభౌమ అధికారం కలవాడు గనుక శ్రమలకు భయపడవద్దు

మనలో ప్రతి ఒక్కరము శ్రమ లేని జీవితాన్ని కోరుకుంటాం, శ్రమలు వస్తున్నాయంటే భయపడుతూ ఉంటాం. శ్రమ పడకూడదు అని ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే కొన్నిసార్లు మనం శ్రమను అనుభవించడానికి మన పాపం కారణం కాకపోవచ్చు, మన జీవితాన్ని శుద్ధి చేయడమో ఉన్నతంగా మలచడం కూడా కాకపోవచ్చు, మరి ఇవి రెండు కానప్పుడు ఇంకెందుకు శ్రమ నా జీవితంలోకి వచ్చింది? దానికి దేవుడే సమాధానం చెప్పాడు. 

యోబు జీవితంలో శ్రమలకు కారణం పాపము కాదు, ఆయనకు రెట్టింపైన ఆశీర్వాదం ఇవ్వటం కూడా కారణం కాదు, దేవునికి సాతానుకు మధ్య జరిగిన సవాలను బట్టి దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి దానిని యోబు జీవితంలో అనుమతించాడు. 

యోబు గ్రంధాన్ని చదువుతున్న మనకు వారిద్దరికీ మధ్య జరిగిన సవాల్ గురించి తెలుసుగాని శ్రమలు గుండా వెళ్తున్న యోబుకు దాని గురించి తెలియదు కదా. దేవుడు సాతానికి అవకాశం ఇచ్చినప్పటికీ దానికి పరిధులు నియమించాడు.

జీవితంలో శ్రమలే రాకూడదు అని కోరుకోవద్దు, నీవు కోరుకున్న కోరుకోకపోయినా, సిద్ధపడిన సిద్ధపడకపోయినా కొన్నిసార్లు కొన్ని శ్రమలు తప్పవు. అయితే శ్రమ వస్తున్నప్పుడు భయపడవద్దు, అది సాతాను ద్వారా గాని, దుర్జనుల దౌర్జన్యం ద్వారా గాని, స్వయంకృత అపరాధము ద్వారా గాని, మన పరిధిలో ఉన్న వాటి వలన గానీ మన పరిధిలో లేని వాటి వలన శ్రమ కలిగినప్పటికీ భయపడవద్దు. 

మనం ఎందుకు భయపడకూడదు అంటే మన దేవుడు న్యాయవంతుడు, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు. న్యాయవంతుడు నీకెన్నడు అన్యాయం చేయడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవునిని దాటి నీకెవరూ ఏ హాని చేయలేరు. 

ఎవరు ఏ విధమైన హాని చేయడానికి కీడు చేయడానికి ప్రయత్నం చేసినా, దానిని మేలుగా మలుచుటకు సమర్ధుడైన దేవుడు మనకు ఉన్నాడు గనుక ధైర్యంగా దేవుని పై విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగిపోదాం.

గుడ్డులోని తెల్ల సోన సంభాషణలు చేయవద్దు

ఇది నేను అంటున్న మాటలు కాదు, యోబు పలికిన మాటలు.
 ఉప్పులేక యెవరైన రుచిలేనిదాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచికలదా? -యోబు 6:6
చాలా విస్తృతంగా యోబు స్నేహితులు మాట్లాడారు కానీ అవి యోబు పరిస్థితికి ఏమాత్రం రుచించేవిగా లేవు. మన జీవితంలో మనం కూడా ఇలాంటి విధానాల్లో ఎన్నోసార్లు మనము ప్రవర్తిస్తూ ఉంటాం, ఎదుటి వ్యక్తి యొక్క స్థితిని అర్థం చేసుకోకుండా, మనము వారి కంటే గొప్పవారమని భావనను కనపరుస్తూ, ఉచిత సలహాలిస్తూ ఉప్పులేని సంభాషణలు చేస్తూ ఉంటాం. 

మన సలహాలు వారు వింటున్నట్టుగానే ఉంటారు కానీ లో లోపల వారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. తోటి వ్యక్తిని అర్థం చేసుకొని అవసరం మేరకు సంభాషిద్దాం సలహాలు ఇద్దాం.

Post a Comment