దేవుని కుటుంబం ప్రణాళిక

 

దేవుడు ప్రణాళిక కలిగి ప్రతి పనిని జరిగిస్తాడు, దేవుడు ఈ సృష్టిని కలుగజేయడంలో ఆయనకున్న అనేకమైన ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం కుటుంబాన్ని కలిగి ఉండటం. తండ్రి కుమారా పరిశుద్ధాత్మలుగా వారు ఒకరితో ఒకరు మంచి సహవాసాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒక కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు, ఆ కుటుంబ ప్రణాళికను అమలు చేస్తూ ఆదాము హవ్వలను కలుగజేయడం జరిగింది.

దేవుని కుటుంబ ప్రణాళిక

పరిచయం :

దేవుని కుటుంబ సభ్యులైన మిమ్మల్ని అందరిని రెఫీదీము స్వరమనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా, గడిచిన భాగాల్లో ఆదికాండం మొదటి ఎనిమిది అధ్యాయాలను ధ్యానం చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను గురించి తెలుసుకున్నాము. 

ఈ భాగంలో దేవుడు తాను కోరుకున్న ఒక గొప్ప కుటుంబం కొరకైన ప్రణాళికను ఎలా కొనసాగించాడో ఆదికాండం 9-11 అధ్యాయాలు ద్వారా తెలుసుకుందాం.

దేవుడు ప్రణాళిక కలిగి ప్రతి పనిని జరిగిస్తాడు, దేవుడు ఈ సృష్టిని కలుగజేయడంలో ఆయనకున్న అనేకమైన ఉద్దేశాల్లో ఒక ఉద్దేశం కుటుంబాన్ని కలిగి ఉండటం. తండ్రి కుమారా పరిశుద్ధాత్మలుగా వారు ఒకరితో ఒకరు మంచి సహవాసాన్ని కలిగి ఉన్నప్పటికీ ఒక కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు, ఆ కుటుంబ ప్రణాళికను అమలు చేస్తూ ఆదాము హవ్వలను కలుగజేయడం జరిగింది.

ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకుకీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. -ఎఫెసీయులకు 1:4-6
దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. -ఆదికాండము 1:28

ఆదాము హవ్వలు పిల్లలను కలిగి ఉండి భూమిని నిండించాలన్నది దేవుని ప్రణాళిక. అయితే వారు దేవుని ప్రేమకు పెట్టబడిన పరీక్షలో విఫలమై దేవుని నుండి దూరమైపోయారు, అయినప్పటికీ దేవుడు వారికి పిల్లలను ఇవ్వడం మానుకోలేదు. అయితే దేవుని చేత అనుగ్రహించబడిన ఆ పిల్లలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా జీవించారు. 

కయీను అనే వ్యక్తి తల్లిదండ్రులు వలె దేవునికి వ్యతిరేకిగా మారిపోయాడు, హేబేలు దేవునికి ఇష్టుడుగా ఉన్న కయీను చేతిలో ప్రాణాన్ని కోల్పోయాడు, అయితే దేవుడు మరల షేతు అనే మరొక కుమారుడ్ని ఆదాము హవ్వలకు ఇవ్వడం జరిగింది. షేతుకు కలిగిన ఎనోషు అనే కుమారుడి ద్వారా మరలా ఆ సంతానము దేవునితో మమేకమవడం ప్రారంభించారు. 

ఒకపక్క కయీను సంతానం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వృద్ధి చెందారు, మరో పక్క షేతు సంతానం ఎంతోకొంత ఆత్మీయత కలిగిన వారుగా కొనసాగారు, ఓ రకంగా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకొనడానికి ఈ షేతు సంతానాన్ని ఎన్నుకున్నాడు అని చెప్పవచ్చు. 

మానవాళి దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పటికీ, వారిని వారి పాపము నుండి విమోచించే ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. అందులో భాగంగా స్త్రీ సంతానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాలి, అందుకొరకు దేవునికి ఒక కుటుంబం కావాలి.

మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను. -ఆదికాండము 3:15

ఇలా తరాలు మారుతూ ఉన్నాయి, షేతు సంతానములో కూడా అడపాదడపా కొంతమంది నీతిమంతులు తారసపడ్డారు, తనతో సహవాసం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టక వారిని తుది వరకు నడిపించాడు, అందుకు ఒక చక్కని ఉదాహరణ హనోకు జీవితమే. 

హానోకు తర్వాత నీతిమంతుడిగా జీవించిన నోవాహు తరంలో, ఆయన తప్ప మిగతా వారందరూ దేవునికి వ్యతిరేకులు కావడం మూలంగా దేవుడు వారిని తుడిచిపెట్టి తనకు అనుకూలంగా ఉన్న నోవాహును ఆయన కుటుంబాన్ని కాపాడాడు. 

దేవుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చేస్తున్నది ఇదే, తనకు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని రక్షించడం, తనకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్న వారిని నిర్ణీత సమయంలో తుడిచివేయడం. 

ఇప్పుడు అనగా జల ప్రళయం తర్వాత భూమ్మీద మిగిలింది నోవాహు కుటుంబం మాత్రమే, కాబట్టి దేవుడు తన ప్రణాళికను మరలా నోవాహు కుటుంబంతో కొనసాగించాడు. ఆదాము హవ్వలతో దేవుడు ఏ మాటలైతే చెప్పాడో, అవే మాటలు నోవాహు యొక్క కుటుంబంతో కూడా చెప్పడం జరిగింది, అనగా ఇప్పుడు నోవాహు ఆయన కుటుంబం భూమిని నిండించాలని దేవుడు కోరుకున్నాడు.

మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. -ఆదికాండము 9:1-4

జలప్రళయం తర్వాత నోవాహు కూడా పడిపోయిన వాడుగా ఉన్నాడు, నోవాహు కలిగిన ముగ్గురు కుమారులలో దేవుడు షేము అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ షేము సంతానములో నుండి వచ్చిన వాడే అబ్రహాము.

ముగింపు : 

గొప్ప కుటుంబాన్ని కలిగి ఉండాలన్న దేవుని ప్రణాళిక గురించి విన్నాము కదా! మనము కూడా దేవుని కుటుంబంలో సభ్యులమై అనేకులను ఈ కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం. ప్రభువు చిత్తమైతే మరోక అంశముతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడై యుండును గాక ఆమెన్.

Post a Comment