దేవుని ఆజ్ఞకు లోబడితే...
దేవుని ఆజ్ఞ ఫలితమే ఈ సృష్టి, మానవుని అవిధేయత ఫలితమే పతనస్థితి, నోవాహు విధేయత ఫలితమే శేషించబడిన మనమందరము మరియు మిగిలి ఉన్న ప్రాణులు.
పరిచయం :
దేవుని ఆజ్ఞలకు లోబడటమే ఆయనను ప్రేమించడం అని గడచిన భాగంలో తెలుసుకున్నాం, మరి దేవుని ఆజ్ఞలకు లోబడిన వారికి కలిగే ఫలితం ఏంటి, లోబడకపోతే వచ్చే నష్టాలేంటి?
వాక్యాన్వేషకులందరికీ శుభములు తెలియజేస్తూ రెఫీదీము ధ్యాన సమయంకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, అందరు బాగున్నారా, మన దేవుడు ఆజ్ఞాపిస్తే కార్యం జరుగుతుందని, మనము దేవునిని ప్రేమించాలని ఆయన కోరుతున్నాడని గడచిన భాగంలో తెలుసుకున్నాము. ఆజ్ఞాపించు దేవుడు అనే ఈ అంశంలో ముగింపు భాగాన్ని ఆదికాండం ఆరు నుండి ఎనిమిది అధ్యాయాల ద్వారా తెలుసుకుందాం !
ప్రేమకు పెట్టబడిన పరీక్షలో విఫలమైన ఆదాము హవ్వలు వారి జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు, దేవుని ఎదుటకి రాలేకపోయారు, తోట నుండి పంపించి వేయబడ్డారు, మంచి చెడ్డలు ఎరగని అమాయకత్వం నుండి, ఊహించుటకు, వివరించుటకు సాధ్యము కాని ఘోరమైన చెడుతనము కలిగినవారుగా మారిపోయారు.
వారి పతనస్థితినే, చెడుతనాన్ని వారసత్వంగా ఈ లోకానికి ఇచ్చారు, వారి పిల్లలు అదే దారిలో పయనిస్తూ ఒకరిని ఒకరు చంపుకోవడం, విచ్చలవిడిగా కామాభిలాషను నెరవేర్చుకోవడం చేస్తూ దేవునిని ప్రేమించుట అంటే ఏంటో పూర్తిగా మరిచిపోయి ఈ లోకమును చెడుతనముతో నింపివేశారు.
జీవాన్ని జీవితాన్ని ఇచ్చిన దేవునికి వారి జీవితాల్లో చోటే లేకుండా పోయింది. ఈ లోకము చెడిపోయిన స్థితిని చూచి దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. దేవుడంటే భక్తి కలిగి దేవుని కోసం జీవించే వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారా అని వెతికితే చెడుతనము కలిగిన ఆ తరములలో నోవాహు అనే ఒక్కడు మాత్రమే దొరికాడు.
దేవుడు నోవాహుని పిలిచి నోవాహుతో ఈ విధంగా చెప్పాడు, భూమ్మీదికి తాను జల ప్రళయం తీసుకురాబోతున్నానని, చితిసారకపు మ్రానుతో తన కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని, అందులో ఉండవలసిన అంతస్తులు, దానిలోనికి చేర్చవలసిన జంతువులు పక్షులు వాటి ఆహార పదార్థాలన్నిటిని గూర్చి ఆయనకు ఆజ్ఞాపించడం జరిగింది.
నోవాహుకు దేవుడు ఇక్కడ చాలా పెద్ద పనే పెట్టాడు, దేవునిని ఎరగనివారు ఉన్న ఆ తరంలో నోవాహు, నోవాహు యొక్క కుటుంబం మాత్రమే అంత పెద్ద ఓడను నిర్మించడం, ఈ మధ్యలో అనేకులు మాట్లాడే హేళన మాటలు భరించడం, చాలా పెద్ద కార్యమే.
నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. -ఆదికాండము 6:22
నోవాహు జీవితంలో ఎన్నడూ చూడని వర్షం, జలప్రళయం అనే విషయాలు తనకు అర్థమైనా, కాకపోయినా, దేవుడు చెప్పాడు కనుక దానిని నమ్మాడు, విశ్వాసంతో విధేయత చూపుతూ దేవుడు ఆజ్ఞాపించినదంతా నెరవేర్చాడు.
హవ్వకు విశ్వాసం లేకపోవడమే ఆమె అవిధేయతకు కారణమైంది, నోవాహు యొక్క విశ్వాసమే ఆయన విధేయతకు మూలమైంది. నీ జీవితంలో నీవు నిజంగా దేవునిని ప్రేమిస్తే, ఆయన నిన్ను ఈ లోకంలో ఉన్నవాటన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని గ్రహిస్తే నీవు తప్పకుండా దేవునియందు విశ్వాసం ఉంచుతావు, ఆయన మేలు చేసేవాడని అర్థరహిత కార్యాలు చేసేవాడు కాదని నమ్మి నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయన కార్యములకు ఆయన ఆజ్ఞలు నెరవేర్చడానికి అప్పగించుకుంటావు.
నోవాహు దేవుని ఆజ్ఞకు లోబడి ఓడను నిర్మించగా, దేవుడు భూమ్మీదికి తీసుకువచ్చిన గొప్ప జల ప్రళయం నుండి తనను తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. నోవాహు కూడా దేవుని ఆజ్ఞలకు అవిధేయుడైతే, జలప్రళయంలో నశించిన వారిలో ఒకడిగా మిగిలిపోయేవాడే.
దేవుని ఆజ్ఞకు లోబడిన నోవాహును దేవుడు జలప్రళయం లోనూ ఓడలోను కాపాడి రక్షించాడు. 40 దినాలు పాటు భూమ్మీద వున్న గొప్ప గొప్ప పర్వతాలు మునిగిపోయేంత వర్షం కురిసినప్పటికీ, దాదాపు సంవత్సరానికి పైగా ఓడలో నోవాహు ఉండవలసివచ్చినప్పటికీ దేవుడు ఆయనను సురక్షితంగా ఉంచాడు.
నీవు కూడా దేవుని ఆజ్ఞకు లోబడితే ఆయన గొప్ప కార్యములు నీ జీవితంలో చూడగలుగుతాం, ఆయన మేలులను ఖచ్చితంగా అనుభవిస్తావు. దేవుని ఆజ్ఞ ఫలితమే ఈ సృష్టి, మానవుని అవిధేయత ఫలితమే పతనస్థితి, నోవాహు విధేయత ఫలితమే శేషించబడిన మనమందరము మరియు మిగిలి ఉన్న ప్రాణులు.
సృష్టిలో ఉన్న ప్రతి దానికంటే ఎక్కువగా దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు జీవాన్ని జీవితాన్ని మాత్రమే కాక, ఆదాము హవ్వలా పతనం మూలంగా కలిగిన పాపపు స్థితి నుండి విడిపించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి ఆయన పంపాడు.
దేవుని ప్రేమను ఇకనైనా గుర్తించి, లోకమును పాపమును ప్రేమించడం మాని, శ్రద్ధతో ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ఆయన యొద్దకు నీవు పరిగెత్తి వస్తే నోవాహు వలె దేవుడు నిన్ను కూడా దీవించి కాపాడుతాడు.
ఈ రోజు రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, ఏమిటంటే మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయండి.. అనేదే. ఆ ఆజ్ఞను పాటించుటకు నెరవేర్చుటకు ప్రయాసపడదాం.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.. -ద్వితియోపదేశకాండము 28:1
ముగింపు :
సమస్త జనులను శిష్యులుగా చేయడమనే గొప్ప ఆజ్ఞ మనకు ఇవ్వబడినదని తెలుసుకున్నాం కదా, ఆ ఆజ్ఞను నెరవేర్చుటకు అందరము కలిసి ప్రయాస పడదాం, ప్రభువు చిత్తమైతే మరోక అంశముతో మళ్ళీ కలుసుకుందాం, దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి