దావీదు భాద్యతగల కాపరి
దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండుగురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. అయితే యెష్షయి యొక్క ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలు వెంటను పోయి యుండిరి గాని దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ పది జున్ను గడ్డలు తీసికొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసికొని రమ్మని చెప్పి పంపివేసెను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. -1 సమూయేలు 17:12-20
ఇంతకు మునుపు దావీదు ఒక సాధారణమైన గొర్రెల కాపరి, కానీ ఇప్పుడు అభిషేకించబడిన తర్వాత ఆయనకు ఒక నూతన బాధ్యత అప్పగించబడింది. అదే సౌలు యొక్క ఆయుధాలు మోయడం.
ఇశ్రాయేలీయులకు ఫిలిష్టియుల యొద్ద నుండి యుద్ధం వచ్చింది, వారిలో ఒకడైన గొల్యాతు గత 40 దినాలుగా తనతో పోరాడడానికి ఒక వ్యక్తిని పంపమని సవాలు చేస్తూ ఉన్నారు. అయితే అతని ఎత్తును బట్టి, అతనికున్న ఆయుధములను బట్టి, అతని మాటలను బట్టి పోరాటం చేయడానికి ఇశ్రాయేలీలలో రాజు అయిన సౌలుతో సహా ఎవరూ తెగించలేదు. దావీదు యొక్క ముగ్గురు అన్నలు యుద్ధభూమిలో ఉన్నారు , 40 దినాలుగా అది ముందుకు గాని వెనక గాని కదల్లేదు, ఈ పరిస్థితుల్లో దావీదు వాళ్ళ నాన్నగారు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి దావీదును ఒకసారి యుద్ధభూమికి పంపాలని అనుకున్నాడు.
దావీదు అభిషేకించబడినప్పటికీ తండ్రికి విధేయుడుగా ఉన్నాడు కనుక, తండ్రి పిలవగానే అంగీకరించి ముందుకు వచ్చాడు. అయితే తనకు అప్పగించబడిన గొర్రెల సంగతేంటి? మనము ఒకేసారి రెండు మూడు పనులు చేయాల్సి వచ్చినప్పుడు, మనకు ప్రధానంగా అప్పగించబడిన పనిని విస్మరించకూడదు వదిలి పెట్టకూడదు.
సౌలు ఆయుధములు మోసేవాడుగా దావీదుకు ఉద్యోగం దొరికినప్పటికీ , అది ఎల్లప్పుడూ ఉండేది కాదు కనుక తాను ఇంతకు మునుపు వలె ఒక సాధారణ గొర్రెల కాపరిగా కొనసాగాడు. అవసరాన్ని బట్టి రెండు ఉద్యోగాలకు న్యాయం చేశాడు. ఇప్పుడు యుద్ధభూమికి వెళ్లే పరిస్థితుల్లో తన గొర్రెల సంగతి ఏం చేశాడు అనే ఆలోచిస్తే, వాటిని మరొక కాపరికి అప్పగించి తన తండ్రి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ముందుకు వెళ్లాడు.
దీనిని బట్టి దావీదు ఒక బాధ్యత గల కాపరి అని మనం చెప్పవచ్చు. మనము దావీదు వలె ప్రవర్తించటానికి నేర్చుకోవాలి. యేసయ్య కూడా ఆయన వెళ్ళిపోతూ మనలను ఒంటరిగా విడిచి పెట్టకుండా ఆయన స్థానంలో మనలను బలపరుచుటకు పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహించి వెళ్ళాడు.
మీకు అప్పగించబడిన కొన్ని పనులు మీరు చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని చేయగలిగిన వారికి అప్పగించాలి, ఇలా చేయడం మీ బాధ్యత, అది నా బాధ్యత అని భావించిన వారు ఇలా చేస్తారు. దాని ద్వారా మీరు అందుబాటులో లేకపోవడం మూలంగా ఆ పని ఆగిపోకుండా కొనసాగుతుంది.
అంతేగాని ఆ పనిని పూర్తిగా గాలికి వదిలేసి వెళ్లిపోకూడదు. మనం చేసే పనులలో సమతుల్యత కలిగి ఉండాలి. మనం మంచిగా చదువుకోవాలి, దేవుని పని కూడా చేయాలి. మనం మంచిగా చదువుకోవాలి, మరియు ఆటల పోటీలలో కూడా పాల్గొనాలి. ఆటల పోటీలలో పాల్గొంటున్నామని, దేవుని పని చేస్తున్నామని, చదువు కొనడమును పక్కన పెట్టకూడదు. అలా చేసేవారు బాధ్యతారహితులవుతారు.
మనం చదువుకుంటున్నప్పటికీ ఇంట్లో మన మీద ఉన్న బాధ్యతలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం నెరవేర్చాలి. మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇంట్లో మన మీద ఉండే బాధ్యతల నుండి మనకే మాత్రము మినహాయింపు ఉండదు. బయట మన హోదా ఏదైనా కావచ్చు కానీ ఇంట్లో మన పాత్ర మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి. కాబట్టి మీ ప్రాధాన్యతులను లెక్కించుకొనండి, సమతుల్యతను పాటిస్తూ కొనసాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్.
కంఠత వాక్యము :
మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు; -యోహాను 14:18
పునర్విమర్శ ప్రశ్నలు :
- గొల్యాతుకు ఇశ్రాయేలీయులు భయపడడానికి గల మూడు కారణాలేంటి?
- దావీదు బాధ్యతగల కాపరి అని మీరు ఎలా చెప్పగలరు?
- మీ ప్రాధాన్యతల పట్టికను రూపొందించండి!
- మీరు బాధ్యతగా వ్యవహరించలేకపోయిన అంశాలను, లేదా సందర్భాలను వ్రాయండి?

కామెంట్‌ను పోస్ట్ చేయండి