దావీదు దేవుని కొరకు రోషముగలవాడు
అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తన యొద్ద నిలిచినవారి నడుగగా -1 సమూయేలు 17:23-26
నీకు బుద్ధి లేదా సిగ్గు లేదా అని నిన్ను ఎవరైనా అంటే నీకు కోపం వస్తుందా? మీ అన్నలు పనికిరానివాళ్ళు చేతగానివాళ్ళు అని ఎవరైనా అంటే మీకు కోపం వస్తుందా? మీ దేవుడు అసమర్ధుడు ఆయన ఈ పని చేయలేడు అని మాట్లాడితే కోపం వస్తుందా?
మనందరం మన జీవితంలో రోషము తెచ్చుకోవడం సాధారణం, కానీ ఏ విషయంలో రోషపడతాం అనేది ఆలోచించాల్సిన విషయం. మనల్ని ఎవరైనా తిడితే మనకు రోషం వస్తుంది, కానీ బైబిల్ ని కాల్చివేస్తే మాత్రం నోరు కూడా మెదపము.
దావీదు వారి నాన్నగారి మాట ప్రకారంగా యుద్ధభూమికి వచ్చేసరికి, ప్రజల పరిస్థితి ఏమంత మంచిగా లేదు. 40 రోజులుగా భయంతో వణికిపోతున్నవారుగా వీరు ఉన్నారు. వారి యొక్క భయానికి కారణం వారి ఎదుట నిలబడిన గోల్యాతు. అతని ఎత్తు, ఆయుధాలు, మాటలను బట్టి ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు.
గొల్యాతు ఎత్తును బట్టి, బాగా ఎత్తుగా ఉండే సౌలు కూడా నీరు కారిపోయాడు. తాను ముందుకు వెళ్లలేదు యుద్ధం చేయడానికి, తన కుమారుడైన యోనాతానును కూడా ముందుకు పంపలేదు.
రోజులు ఎక్కువగా గడుస్తూ ఉండడం ఎవరు ముందుకు రాకపోవడం ఫిలిష్తీయులలో ఇక గెలుపు మాదే అని విర్రవీగడం ఎక్కువ అవుతున్నది, ఇశ్రాయేలీయులలో భయం ఎక్కువవుతున్నది.
ఇలాంటి పరిస్థితులలో దావీదు యుద్ధభూమికి వచ్చాడు. యధావిధిగా గొల్యాతు తన సవాలును వినిపించాడు, ఆ సవాలు విని ఇశ్రాయేలీయులు పారిపోతున్న పరిస్థితుల్లో, వారిలో ఒకడు ఇలా అన్నాడు "గొల్యాతును చూసారా? అతడు ఇశ్రాయేలీయులను ధిక్కరించడానికి వస్తున్నాడు" అని చెప్పుకుంటూ ఆ గొల్యాతును జయించిన వారికి సౌలు ఇస్తానన్న బహుమానం గురించి మాట్లాడాడు.
సౌలు గొల్యాతును జయించడానికి ముందుకు వెళ్లే ధైర్యం తనకు లేక ఎవరో ఒక వ్యక్తిని ముందుకు పంపలేక, బహుమానం ఎర చూపితే ఎవరైనా ముందుకొస్తారని భావించాడు.
గొల్యాతును చంపిన వారికి సౌలు ఈ మూడు రకాలైన బహుమానాలు ఏర్పాటు చేశాడు. ఒకటి గొల్యాతును చంపిన వ్యక్తి రాజుకు చెల్లించవలసిన పన్నులు ఇక చెల్లించవలసిన అవసరం లేదు, రెండు రాజ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించబడుతుంది, మూడు గొప్ప ఐశ్వర్యం ఇవ్వబడుతుంది.
బహుమానం బాగానే ఉన్నా ముందుకొచ్చే ధైర్యం ఎవరికీ లేదు. అటువైపు గొల్యాతు మాట్లాడుతున్న మాటలను దావీదు విన్నాడు, గొల్యాతును చూసి భయపడి రాజు ఇస్తానన్న బహుమానాలు గురించి చర్చించుకుంటున్న వారి మాటలు కూడా దావీదు విన్నాడు.
ఆ మాటలు విన్నాక దావీదు స్పందన ఏంటో తెలుసా? జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? అని అన్నాడు. ఈ మాట దావీదుకు దేవుని పట్ల ఉన్న రోషాన్ని తెలియపరుస్తుంది.
గొల్యాతు తిరస్కరిస్తున్నది ఇశ్రాయేలు సైన్యాన్ని అని మనం ఆలోచించవచ్చు, కానీ దాన్ని దావీదు ఎలా పిలిచాడో చూడండి. జీవముగల దేవుని సైన్యం అన్నాడు.
ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు ఉన్న వ్యత్యాసాల గురించి దావీదు ఆలోచిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన కలిగిన ప్రజలు, ఆ నిబంధనకు గుర్తుగా సున్నతి కూడా వారు పొందారు.
ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టముగా జీవిస్తే గొప్ప బలము కలిగి వారు శత్రువును జేయించగలిగేవారుగా ఉంటారు.
తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల యెహోవా వారిని అప్పగింపనియెడల ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును? ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు? -ద్వితియోపదేశకాండము 32:30
దేవుని సహాయం చేత ఇశ్రాయేలు ప్రజలు లేదా ఒక ఇశ్రాయేలు సైనికుడు 1000 మందిని జయిస్తే, ఇద్దరు కలిసి పదివేల మందిని జయించేవారుగా వారు ఉండగలరు.
కానీ ఇది ఫిలిష్తీయులకు సాధ్యం కాదు, ఎందుకనగా వారికి దేవునితో నిబంధన లేదు, వాళ్లు ఆరాధిస్తున్న దేవతలు దేవుళ్ళు జీవముగలవి కావు, సున్నతి పొందిన జీవితాలు వారికి లేవు.
అలాంటి ఒక వ్యక్తి వచ్చి దేవుని సైన్యమైన ఇశ్రాయేలును తిరస్కరించటం, నోటికొచ్చినట్లు మాట్లాడటం దీని ద్వారా దేవుని నామాన్ని అవమానపరచటం దావీదుకు ఏమాత్రం నచ్చలేదు.
దావీదుకు సైన్యములో చేరే ఒక సైనికునికి ఉండే వయసు లేదు, కానీ గొల్యాతు దేవుణ్ణి అంటున్న మాటలను బట్టి లోపల రక్తం మరుగుతోంది.
నీకోసం నువ్వు, నీ కుటుంబం కోసం అక్కల కోసం చెల్లెలు కోసం అన్నల కోసం తమ్ముళ్లు కోసం అమ్మానాన్నల కోసం రోషము తెచ్చుకుంటావు కదా,
మరి నిన్ను సృజించిన దేవుని విషయంలో ఆయన కోసం రోషం కలిగి పని చేసావా? రోషం కలిగి జీవించవా? ఆయన నామము అవమానపరచబడుతుంటే నీకు బాధ కలుగుతుందా? ఆయన నామము మహిమ పరచబడడానికి నువ్వేమి చేయగలుగుతున్నావ్?
దేవునిని మనము ఎంతగా ప్రేమిస్తున్నామో అనేదానిని బట్టి మనము ఆయన కొరకు ఎంతగా రోషపడతామో అనేది ఆధారపడుతుంది.
దేవుని పట్ల ప్రేమ లేని వారు, దేవుని కార్యముల విషయంలో రోషము కలిగి ఉండలేరు. దావీదు దేవుని పట్ల ఇదే విధమైన రోషమును జీవితకాలం కలిగి ఉన్నారు. ఈ దినము నుండి దావీదు వలె దేవుని కొరకు రోషము కలిగి జీవించడానికి తీర్మానం చేసుకోండి.
కంఠత వాక్యము :
నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది -కీర్తనలు 119:53
పునర్విమర్శ ప్రశ్నలు
- ఇశ్రాయేలీయులలో ఎత్తైన వ్యక్తి ఎవరు? సమూయేలు మొదటి గ్రంధం మొదటి 10 అధ్యాయాలు చదివి రెఫరెన్స్ కూడా తెలపండి
- గొల్యాతును చంపినవాడికి రాజు ఇచ్చే మూడు బహుమానాలు ఏమిటి?
- దావీదు రోషముగలవాడు అని మీరు ఎలా చెప్పగలరు?
- దేవుడు వారికి తోడై ఉంటే ఇశ్రాయేలు సైనికులు ఏమి చేయగలరు?
- ఇశ్రాయేలు సైన్యమునకు ఫిలిష్తీయ సైన్యమునకు ఉన్న మూడు తేడాలు పట్టికగా రాయండి?
- ఏయే విషయాల్లో రోషము కలిగి దేవుని కొరకు జీవించడానికి మీరు తీర్మానం చేసుకుంటారు?

కామెంట్‌ను పోస్ట్ చేయండి