దావీదు సహోదర ప్రేమగలవాడు

దావీదు సహోదర  ప్రేమగలవాడు

మన సంఘంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాదాపుగా ప్రతి ఆదివారం తప్పకుండా ఆరాధనకు హాజరవుతారు, కానీ వీరిలో ఒక వ్యక్తి అందరికంటే ముందు వస్తారు, మిగతా ఇద్దరిలో ఒకరు ఒకసారి, ఇంకొకరు ఇంకొకసారి వస్తూ ఉంటారు. 

దీన్ని చాలా వారాలుగా నేను పరిశీలించిన మీదట ఒకరోజు ఆ ముందు వచ్చే వ్యక్తిని పిలిచి అడిగాను, మీ ముగ్గురిదీ ఒకటే కుటుంబం కదా! మీరు కలసి ఎందుకు మందిరానికి రారు అని. దానికి ఆ వ్యక్తి చెప్పిన సమాధానం విని నేను ఆశ్చర్యపోయాను, ఇంతకు ఆ వ్యక్తి ఏమన్నారో తెలుసా, అన్నా మిగతా వారిద్దరూ ఒకరితో ఒకరు అసలు మాట్లాడుకోరు అని అన్నారు. అదేంటి మీరు తోబుట్టువులు కదా! అని అంటే దానికి ఆ వ్యక్తి, ఇది చాలా కాలంగా ఇలాగే జరుగుతుంది అని చెప్పారు.

దేవుడిచ్చిన బంధం సహోదరి సహోదరులు బంధం! మనము కావాలనుకుని సహోదరీ సహోదరులకు కాలేదు, దేవుడే మనలను ఈ విధంగా ఒక కుటుంబంలో పుట్టించాడు. దేవుడు మనలను ఈ రీతిగా ఒక కుటుంబంలో ఉంచాడు కనుక మనము ఒకరిని ఒకరము ప్రేమించవలసిన వారమైయున్నాము.

మనము ఒకరిని ఒకరి ప్రేమించుకోలేకపోవడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, అసూయ, కోపము పగ అనేవి మనలో ఉంటే మనము ఆ విధంగా ప్రేమను కనబరుచుకోలేము. దీనికి చక్కని ఉదాహరణ యోసేపు జీవితమే.

అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటె ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేక పోయిరి. -ఆదికాండము 37:4


యోసేపు అన్నలు యోసేపు మీద అసూయపడి, కోపం పెంచుకొని పగ పట్టి, కనీసం బాగున్నావా అని కూడా అడగలేకపోయారు. కాని దావీదు జీవితాన్ని చూస్తే, ఆయన సహోదరులను ప్రేమించేవాడుగా ఉన్నాడు, యోసేపుకు కూడా ఈ లక్షణం ఉన్నట్టు గతంలో నేర్చుకున్నాము. మనము గడిచిన భాగంలో తెలుసుకున్నట్లుగానే, దావీదును వాళ్ళ నాన్నగారు పిలిచి నిన్ను మీ అన్నల యొద్దకు పంపిస్తాను రమ్మని చెప్పాడు.

యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసికొని రమ్మని చెప్పి పంపివేసెను. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరుగెత్తి పోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరుల నడిగెను. -1 సమూయేలు 17:17,18,22

దావీదు అన్నలు దాదాపుగా 40 దినాలుగా తండ్రికి, కుటుంబమునకు దూరముగా ఉన్నారు. పైగా యుద్ధ భూమిలో ఉన్నారు. ఆ దినాల్లో యుద్ధం చేసే వారు వారిని వారే పోషించుకోవలసి యుండేది. కాబట్టి యుద్ధ భూమిలో ఉన్నవారికి వారి స్నేహితులు, కుటుంబం, సరుకులు పంపించి సహాయం చేసేవారు. 

కాబట్టి ఈ పని కొరకు దావీదు ఎంచుకొనబడ్డాడు, ఇంటి దగ్గర తన కంటే పెద్దవారు నలుగురు అన్నలు ఉన్నప్పటికీ దావీదు వాళ్ళ నాన్నగారు, దావీదునే అందుకొరకు ఎంచుకొని మంచి పని చేసాడు, అది ఎలా మంచి పని అయ్యింది అనేది మీరు తర్వాత తెలుసుకుంటారు. దావీదు కూడా తండ్రికి విధేయత చూపిస్తూ, అన్నల మీద ప్రేమగలవాడై, వేరే ఎవరినైనా పంపమని సాకులు చెప్పకుండా ముందుకు వచ్చాడు.

దావీదును వాళ్ళ నాన్నగారు పంపిస్తూ 20 కేజీల గోధుమలు (వీటిని వేయించి, పాలు లేదా వెన్నతో కలిపి ఉంచేవారు), 10 రొట్టెలు, అధికారికి 10 జున్ను గడ్డలు, ఇచ్చాడు. దావీదును పంపిస్తూ, మీ అన్నలు ఎలా ఉన్నారో తెలుసుకొని నాకు సమాచారం తెమ్మని చెప్పాడు. ఒక ముసలి తండ్రి ఇలా కోరుకోవడంలో ఆశ్చర్యం ఏమిలేదు.

దావీదు వాళ్ళ నాన్న చెప్పినట్టుగా వెళ్లి, సామానులు జాగ్రత్త చేసే వ్యక్తికీ సరుకులు అప్పగించి, వాళ్ళ అన్నలను పలకరించాడు. మీలో ఎవరైనా మీ అన్న తమ్ముడు, అక్క, చెల్లి మీద కోపం పెంచుకున్నారా? అలా వారిని క్షమించండి, పలకరించుకోండి. దావీదు వలె ప్రేమను కనబరచుకొనండి. వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, ప్రేమ చూపకపోయినా, మీకు కీడు చేసినా మీరు ప్రేమను కనపరచండి.

దావీదు తన అన్నల మీద ప్రేమ లేనివాడైతే ఖచ్చితంగా వెళ్ళడానికి సాకులు చెప్పేవాడు, ఒకవేళ వాళ్ళ నాన్న పంపాడని వెళ్లినా మాటలు ఉండకపోయేవి.

కంఠత వాక్యము :

 దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. -1 యోహాను 3:10

పునర్విమర్శ ప్రశ్నలు :

  • సహోదర ప్రేమ లేకపోవడానికి మూడు కారణాలు
  • దావీదు నాన్నగారు దావీదు అన్నలకు పంపించిన 3 రకాల ఆహార పదార్ధాలు ఏమిటి?
  • దావీదు కలిగియున్న సహోదర ప్రేమను వివరించండి.

Post a Comment