మనము నిజముగా దేవునిని ప్రేమిస్తే ...!
మనం ఆయన చేత సృజింపబడిన వారము కనుక. మనం ఏది తినాలో ఏది తినకూడదో ఆయనే నిర్ణయిస్తాడు. మనం ఆయన ఆజ్ఞకు లోబడవలసిందే.
పరిచయం :
దేవుని ఆజ్ఞలకు ఈ లోకంలో ఉన్న మనుషులు ఎందుకు లోబడాలి? అలా లోబడటం ఏమి తెలియజేస్తుంది? సత్యాన్వేషకులు అందరికీ శుభములు తెలియజేస్తూ,రెఫీదీము వాక్య ధ్యాన సమయంకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను,.
అందరూ బాగున్నారా? గడిచిన భాగంలో మన దేవుడు ఆజ్ఞాపించడం ద్వారా ఏ కార్యములు జరిగాయో ఆదికాండం మొదటి అధ్యాయంలో నుండి తెలుసుకున్నాము. ఈనాటి భాగంలో దేవుడు ఎందుకు, ఎలాంటి ఆజ్ఞలు ఇస్తాడు? వాటికి లోబడటం ఏమి రుజువు చేస్తుంది? అను విషయాలను తెలుసుకుందాం !
దేవుడిలా తన ఆజ్ఞ చేత సృష్టిని కలుగజేసి, మనిషిని మాత్రం తన నోటి మాటతో కాక తన రూపంలో చేతితో నిర్మించాడు. వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేసి వారి కొరకు ఏదేను అనే ఒక తోటను ఏర్పరిచి దానిని సేద్యపరచమని, కాయమని చెప్పాడు.
ఆ తోట మొత్తాన్ని అనుభవించే అవకాశం వారికి ఇచ్చాడు, ప్రతి దినము ఆయన వారితో సహవాసం చేస్తూ సంభాషిస్తూ సంతోషంగా వారి జీవితము కొనసాగునట్లు చేశాడు. అయితే ఒక రోజున దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. -ఆదికాండము 2:16,17
అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో దేవుడు ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? ఈ ఆజ్ఞను ఇవ్వడం వెనక దేవునికున్న ఉద్దేశం ఏంటి? వారు దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవడానికి , దేవుడు ఈ ఆజ్ఞ ఇవ్వటం జరిగింది.
దేవునిని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞలకు లోబడతారు. దేవునిని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞలను చులకనగా భావించేవారు, తిరుగుబాటు స్వభావం కలిగినవారే. వారు నిజానికి దేవుని కంటే మరేదో ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.
మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. -1 యోహాను 5:3
దేవుడు భారమైన ఆజ్ఞలేవి, మనము పాటించలేని ఆజ్ఞలేవి మనకివ్వడు మన మీద పెట్టడు. దేవుడు ఇక్కడ ఆదాము హవ్వలకు ఇచ్చిన ఆజ్ఞ కూడా భారమైన ఆజ్ఞ కాదు. తోట మొత్తాన్ని వారి చేతిలో పెట్టి ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము జోలికి మాత్రం వెళ్ళొద్దన్నాడు. ఆయన చెట్టు జోలికి వెళ్లొద్దు అనడానికి, ఆ చెట్టు చెడ్డది అనేది కారణం కాదు. ఆ చెట్టు వల్ల గాని పండు వల్ల గాని చెడు ఏమీ జరగదు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మంచిదే.
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను. -ఆదికాండము 1:31
ఆ చెట్టులో చెడు ఏమీ లేనప్పుడు, దేవుడు ఎందుకు తినవద్దన్నాడు? ఆయన దేవుడు గనుక. ఆయన చేత మనం సృజింపబడిన వారము కనుక. మనం ఏది తినాలో ఏది తినకూడదో ఆయనే నిర్ణయిస్తాడు. మనం ఆయన ఆజ్ఞకు లోబడవలసిందే.
అయితే ఆదాము హవ్వలు ఈ విషయంలో విఫలమయ్యారు, తమను ఎంతగానో ప్రేమించి తమకు జీవమును జీవితమును అనుగ్రహించిన దేవునిని ఆయన ఆజ్ఞను చులకనగా భావించి దానిని మీరినవారుగా ఉన్నారు. ఇందులో ఆదాము హవ్వలు ఈ విధంగా తప్పిపోవడానికి సాతాను ఒక కారణమయ్యాడు.
సాతాను పామును ఆవహించి (ఇక్కడ పాము కూడా చెడ్డది కాదు, సాతాను ఒక జంతువుని గాని మనిషిని గాని ఆ విధంగా ఆవహించగలదు, కాని పరిశుద్ధాత్మ మనుషులలో మాత్రమే నివసిస్తాడు) హవ్వతో మాట్లాడి , మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండ్లు ఆదాము హవ్వలు తింటే వారి కన్నులు తెరవబడి మంచి చెడ్డలు ఎరిగినవారై దేవతల వలె ఉంటారని దేవుడికి తెలుసు గనుక మీకు ఆ పండు ఆయన తినే అవకాశం ఇవ్వలేదు అని చెప్పాడు.
ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా -ఆదికాండము 3:5
సాతాను ఈ అబద్ధాలు చెప్పడం కొత్తమి కాదు, ఇప్పటికీ అవే అబద్ధాలు మన చెవులలో చెప్తూ ఉన్నాడు. మనము దేవునిని ప్రేమించనివ్వకుండా చేయడానికి, ఆయన నుండి మనలను ఏ విధంగానైనా దూరం చేయడానికి, ఆయన ఆజ్ఞలకు అవిధేయులను చేయడానికి, ఆయనను అపార్థం చేసుకోవడానికి, ఈ అబద్ధాలు మోసపు మాటలు మన చెవిలో మోగిస్తూనే ఉన్నాడు.
ప్రేమగల దేవుని కార్యాలు ఓ వైపు కనబడుతూనే ఉన్నాయి, ప్రేమపూర్వకమైన ఆయన మాటలు మరొక్క వైపు వినబడుతూనే ఉన్నాయి, కానీ మనిషి మాత్రం కీడే తప్ప మేలే మాత్రం చేయలేని సాతాను మాటలపై నమ్మకముంచుతూ, దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తూ కొనసాగే వాడుగా ఉన్నాడు.
సరిగ్గా హవ్వ కూడా అదే చేసింది, సాతాను మాటలు విన్న తర్వాత దేవుడు తన యొద్ద నుండి ఏదో దాచిపెడుతున్నాడని భావించింది, తన పట్ల దేవుడు చూపిన ప్రేమను అర్థం చేసుకోక, తాను దేవునిని ప్రేమించడం విస్మరించి ఆజ్ఞకు అవిధేయరాలై దేవుడు తినవద్దని చెప్పిన పండును తిన్నది. ఇక్కడ పండు తినడం గొప్ప విషయం కాదు గానీ ఆజ్ఞను మీరడమే ముఖ్యమైన విషయం.
ప్రియ సహోదరి, సహోదరుడా నీ జీవితంలో దేవునిని ప్రేమిస్తున్నావా? అయితే నీవు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా? ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడో జ్ఞాపకం చేసుకో, ప్రేమతోనే ఆయన నీకు ఈ జీవితాన్ని అనుగ్రహించాడు, నీవు నాది నాది అని చెప్పుకునే ప్రతి దేవునిదే.
ఇంతగా నిన్ను ప్రేమించిన దేవునికి నీవు చూపుతున్న ప్రేమేది? దేవుని ఆజ్ఞలను నీవు భారమని ఎంచుతున్నావా? దేవుని ఆజ్ఞలను చులకనగా చూస్తున్నావా? నిజంగా నువ్వు దేవునిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించు.
ముగింపు :
దేవుని ఆజ్ఞలు ప్రకారంగా జీవించటమే, దేవునిని ప్రేమించడమని తెలుసుకున్నాం కదా! ఈనాటి నుండి ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించడానికి నిర్ణయం చేసుకుందాం.
పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు క్రమముగా సంక్షిప్తంగా మీకు అందించబడుతున్నవి కనుక ఈ అంశాలు తప్పక చదవండి. ప్రభువు చిత్తమైతే మరొక భాగంతో మరల కలుసుకుందాం! దేవుడు మనలను దీవించును గాక ఆమెన్!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి