భర్తను శోధించిన శారా



భర్తను శోధించిన శారా


భర్తను శోధించిన శారా

 అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను. కాగా శారయి ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను. -ఆదికాండము 16:1,2

పరిచయం :

సాతాను మనలను శోధించడానికి కొన్నిసార్లు మనకు దగ్గర వ్యక్తులను, ప్రియమైన వారిని ఉపయోగించుకుంటాడు. దేవుడు ఏర్పరచిన వివాహ బంధం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని సరి చేసుకుని దేవుని ఉద్దేశాలు నెరవేర్చుటకు ఏర్పాటు చేయబడినది. 

కానీ దీనిలో సాతాను ప్రవేశించినప్పుడు భర్తను లేదా భార్యను తన సాధనంగా వాడుకుంటున్నప్పుడు దేవుడు కోరుకుంటున్న ఉద్దేశాలు నెరవేర్చబడటానికి అవకాశం ఉండదు. 

ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మన అనుభవిస్తున్న కొన్ని పరిస్థితులను ఆధారం చేసుకుని సాతాను మనలను శోధించి మన జీవిత భాగస్వామిలను కూడా మనము శోధించులాగున తద్వారా మన కుటుంబము దైవిక ఉద్దేశాల నుండి దూరంగా నడిపించబడులాగున సాతాను ప్రయత్నం చేస్తాడు.

ఈ ప్రయత్నం ఆదిమానవులైన ఆదాము అవ్వల విషయంలో సాతాను ఎలా ప్రయోగించాడో గతంలోనే తెలుసుకుందాం. సాతాను హవ్వను శోధించాడు, ఇక ఆదామును శోధించవలసిన అవసరం లేకుండానే హవ్వ మిగతా కార్యక్రమాన్ని నడిపింది.

ఇక్కడ మనకు సాతాను వాడుకుంటున్న పావుగా శారా కనపడుతున్నది. అబ్రహామును శోదించడానికి దేవునికి దూరంగా వారిని తీసుకు వెళ్ళడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇందు కొరకై శారా మనసులో మొలిచిన ఆలోచన, మరో వివాహం. తాను బ్రతికుండగా, ఇంకొక స్త్రీని అబ్రహాముకిచ్చి వివాహము జరిపించడానికి శార ఆలోచిస్తూ ఉన్నది, ఇదే విషయాన్ని అబ్రహాముతో కూడా పంచుకున్నది. 

వివాహమనేది దేవుడు ఒక పురుషునికి లేదా ఒక స్త్రీకి ఏర్పాటు చేశాడు, ఒక పురుషుడు ఒకేసారి ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవడం, ఒక స్త్రీ ఒకేసారి ఎక్కువమంది భర్తలను కలిగి ఉండడం దేవుని ఉద్దేశం ఎన్నటికీ కాదు. అలా ప్రవర్తించిన వారు ఎవరైనా దేవునికి విరోధంగా ప్రవర్తించినట్టే. 

 గమనించండి ఈ మరో వివాహానికి సంబంధించిన ప్రతిపాదన, చేసిన వ్యక్తి శారానే కానీ అబ్రహం కాదు. ఇక్కడ అబ్రహాము తప్పల్లా శారా మాట వినటమే, కానీ ఈ పథకానికి రచయిత నడిపించింది శారానే.

శారా ఎందుకిలా చేసింది అనేదాని గురించి మనం ఆలోచించడానికి ముందుగా, మీ జీవితంలో శోధించబడుతున్న భర్తకు విడుదలను సమాధానాన్ని కలిగించే భార్యలుగా ఉన్నారా? లేదా మీరే శోధనకు మూలమై, భక్తి కలిగిన మీ భర్తను కూడా దేవునికి వ్యతిరేకంగా మార్చేవారుగా మారుతున్నారా? ఆలోచించండి.

అబ్రహాము ఒకవేళ రెండో వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయితే, దేవుని వాగ్దానములను గుర్తు చేసి సహనంతో ఆయన కొరకు కని పెట్టుకోవాలని ప్రోత్సహించవలసిన శారా, దేవుని వాగ్దానములు కొరకు సహనంతో కనిపెట్టుకొని ఎదురుచూస్తున్నటువంటి అబ్రహంతో ఇంక చాల్లే మరో వివాహం చేసుకో అన్నట్లుగా ప్రవర్తించడం మనలో ప్రతి ఒక్కరి హెచ్చరిస్తూ ఉన్నది.

శారా ఇలా ఆలోచించడానికి కారణం, తన భర్తను శోధించటానికి కారణం తనకు పిల్లలు లేకపోవడమే.

లోటును బట్టి :

శారా చాలా సౌందర్యవంతురాలు, బహు ఆస్తిపరురాలు. కానీ ఆమెకు పిల్లలు లేరు. దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చే బహుమానం ఒక రకంగా ఉంటుంది, ఆయన మనకు ఇచ్చే బహుమానాల్లో మన తల బరువెక్కి పోయేటట్టు చేయక, ఈ జీవితాన్ని మనం సంతోషంగా కొనసాగించినట్లు కొన్ని సిలువలు కూడా మన జీవితంలో ఆయన అనుమతిస్తాడు. 

ఈ లోకంలో ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా చూస్తే గర్భఫలమనే బహుమానము ధనికులకు దూరంగా పేదలకు దగ్గరగా, మంచివారికి దూరంగా చెడ్డవారికి దగ్గరగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ధనికులు వారి పిల్లల కొరకు ఎంతో ఆస్తిని విడిచిపెట్టగలిగినప్పటికీ, మంచివారు వారి పిల్లలను మంచిగా పెంచగలిగినప్పటికీ, దేవుడు ఎందుకు ఈ విధంగా చేయడంలో ఆనందిస్తూ ఉన్నాడు.

సిలువను బట్టి :

శారా తాను మోస్తున్న ఈ సిలువలో దేవుని హస్తాన్ని గుర్తించింది. పిల్లలు అనుగ్రహించబడినప్పుడు దానికి దేవుడే కారణం, పిల్లలు కలగ లేదంటే కూడా, లేదా కొంత వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే కూడా దానికి దేవుడే కారణం. అయితే ఇది దేవుడు అనుమతించినప్పుడు ఆయన ఉద్దేశాలు జ్ఞానవంతమైనవి మన ఊహకు అందనివి అని గ్రహించి దానిని మనం భరించేవారంగా ఉండాలి.

అసహనం :

మన ఆకాంక్షలు దేవుని అనుమతులకు లోబడినవై ఉండాలి. దేవుడు అనుమతించని దానిని మనం కోరుకొనడం ద్వారా మేలు కంటే కీడే ఎక్కువగా చూస్తాం.

మనలను మనము సంతోషపరుచుకొనుటకు కాక మనలను ఈ స్థితిలో నడిపిస్తున్న దేవుని సంతోష పెట్టుటకు మనం ఇష్టపడి ముందుకు సాగాలి. ఒకవేళ మనల్ని మనం సంతోషపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తే మన యొద్ద నుండి దేవుడు దాచి ఉంచిన వాటిని పొందుకోవడానికి ఇతర పద్ధతులన్నిటినీ ఆశ్రయించే వారం గా ఉంటాం. 

దైవ చిత్తము ఆయన నడిపింపు మన జీవితంలో ప్రాముఖ్యం కావాలి. దేవుని వాగ్దానం యందు స్థిరమైన నమ్మకము, దేవుని సమయం కొరకు ఎదురుచూపు మనకు కావాలి. అలా ఎదురు చూసేవారు విశ్వాసం కలవారు ఏమాత్రం తొందర పడరు.

పది సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ శారాకు పిల్లలు కలగకపోవడం ఆమెను తొందర పెట్టింది అని చెప్పవచ్చు.

అపార్థము:

దేవుని వాగ్దానాలు కొన్నిసార్లు మనము సరిగా అర్థం చేసుకున్నప్పుడు అపార్థం చేసుకున్నప్పుడు శారా ప్రవర్తించిన రీతిలోనే మనం కూడా ప్రవర్తించేవారంగా ఉంటాం. దేవుడు అబ్రహాముకు సంతానం ఇస్తానన్నాడు, బహుశా అది నా ద్వారా కాదేమో అనుకున్నది శారా. అబ్రహం కూడా ఇలాగే భావించాడంటంలో సందేహం లేదు. అందుకే దీని గురించి దేవుడు స్పష్టంగా తర్వాత మాట్లాడాడు శారావలనదైనదే నీ సంతానం అన్నాడు.

ముగింపు :

మన జీవితంలో కలిగి ఉన్న లోటును బట్టి, అనుభవిస్తున్న సిలువను బట్టి, అపార్ధాన్ని అసహనాన్ని పెంచుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించుటకు శోధించబడి, ఇతరులను శోధించేవారంగా కాక దైవ చిత్తంలో స్థిరంగా నిలిచుటకు ప్రయత్నం చేద్దాం.

పునర్విమర్శ ప్రశ్నలు

  • శారా తన భర్తను ఏ విధంగా శోధించింది?
  • "సాతాను కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని శోధించటానికి మన ప్రియులనే వాడుకుంటాడు" దీంతో మీరుఏకీభవిస్తున్నారా?
  • శారా అబ్రహంను శోధించడానికి నాలుగు కారణాలేంటి?
  • ఈ పాఠము ద్వారా మీరు తీసుకున్న తీర్మానం ఏంటి?

Post a Comment