భీకరమైన కార్యములు చేయువాడు.
సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. -కీర్తనలు 45:4,5
భీకరమైన అనే పదానికి భయంకరమైన, అద్భుతమైన, భక్తిని పుట్టించే అనే అర్థములు చెప్పవచ్చు. అనేకమందిని పాపము నుండి రక్షించు ప్రక్రియలో యేసుక్రీస్తువారు భయంకరమైన కార్యములు జరిగిస్తాడు.
ఈ కార్యములు యేసయ్య తన కుడి చెయ్యి మూలముగా మన హృదయములలో జరిగిస్తాడు. యేసయ్య తర్వాత ప్రస్తుత కాలములో పరిశుద్దాత్మ దేవుడు ఆ పనిని కొనసాగిస్తాడు. పాపము, నీతి తీర్పును గూర్చిన భయము మనలో పుట్టించి మార్పును కలుగజేస్తాడు.
ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. -యోహాను 16:8
ఈ కార్యములు జరిగించబడడంలో ఆయన బాణములు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ బాణములు ఆయనకు శత్రువులుగా ఉన్న మన హృదయములలో చొచ్చి, మనకు గాయం చేసి, మనలను ఆయనకు విధేయులనుగా మార్చుతుంది.
మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలి చేయుననెను. -మత్తయి 21:44
అయితే దేవునికి వ్యతిరేకంగా జీవించుటను కొనసాగిస్తూ ఆయనకు అప్పగించుకొనక, ఆయన రాజ్యమునకు అధికారమునకు లోబడక ఉన్న జీవితములు ఈ బాణములు నాశనం చేస్తాయి.
మరియు నేను తమ్మును ఏలు టకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను. -లూకా 19:27
ఆయన పాతాళ లోక ద్వారములను జయించు ప్రక్రియలో భయంకరమైన కార్యములు జరిగిస్తాడు.
ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. -లూకా 21:26
కాబట్టి రక్షణ పొందని ప్రతి ఒక్కరూ దేవునికి శత్రువులుగా ఇకను జీవించక ఆయన జరిగిస్తున్న భయంకరమైన, అద్భుతమైన కార్యములను బట్టి దేవునికి లోబడి జీవించుటకు తీర్మానం చేసుకుందాం.
ఇప్పటికే రక్షణ మార్గంలో కొనసాగుతున్న మనము ఆయన తన అద్భుతమైన కార్యముల ద్వారా మనలో భక్తిని పుట్టించినందుకు దేవునికి హృదయ పూర్వకమైన ఆరాధన సమర్పిద్దాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి