నీతి రాజ్య స్థాపకుడు.
సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము నీ దక్షిణహస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. -కీర్తనలు 45:4
ఈ లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి ఎంతో మంది రాజులు ఉన్నారు. అయితే ప్రతి రాజ్యములోనూ దాదాపుగా ప్రతి రాజులోను, మనము ఈ మూడు అంశాలు చూడలేము. అవేమనగా, సత్యము, వినయము, నీతి. సత్యానికి బదులుగా మోసము, వినయముకు బదులుగా గర్వము, నీతికి బదులుగా అవినీతి ఈ లోక రాజ్యాల్లో, ఆ రాజ్యాలను పరిపాలించే రాజులలో మనము చూస్తూ ఉంటాం.
ఈ లోక సంబంధమైన రాజులు వారి రాజ్యాన్ని స్థాపించిన, లేదా వారి రాజ్యాన్ని విస్తరింప చేసుకున్న కొన్నిసార్లు మోసపూరితంగా, ఇంకొన్నిసార్లు గర్వముగా, మరికొన్నిసార్లు అవినీతి అక్రమాలతో, రాజ్యాలను పరిపాలిస్తారు, విస్తరింప చేసుకుంటారు.
కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యవంతుడు అని గత భాగంలో తెలుసుకున్నాం. ఆయన సత్యవంతుడు మాత్రమే కాదు, వినయము కలవాడు లేదా సాత్వికుడు కూడా. యేసుక్రీస్తు వారు స్వయంగా నేను సాత్వికుడును దీన మనసు కలవాడను అని తన గురించి తాను చెప్పుకున్నాడు.
నేను సాత్వికుడను దీన మనస్సుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. -మత్తయి 11:29
సువార్త సత్యమైనది, నీతి గలది. అది వినయంతో ప్రకటించబడవలసి ఉన్నది, సాత్వికంతో అంగీకరింపబడాల్సి ఉన్నది. సువార్త ప్రకటన ఒకరకంగా బతిమాలుకునే పరిచర్య.
కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. -2 కోరింథీయులకు 5:20
వినయముతో సువార్త ప్రకటించబడుతూ ఉండగా, సాత్వికముతో దానిని అంగీకరించిన ప్రజల హృదయాల్లో నీతి గల యేసుక్రీస్తు వారి రాజ్యము స్థాపించబడుతుంది. ఇందులో ఎవరి బలవంతము లేదు. మన రాజైన యేసుక్రీస్తు వారు నీతి గలవాడై యున్నాడు.
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. -జెకర్యా 9:9
నీతి గల ఈ రాజు మనలను నీతిమంతులుగా తీర్చుటకు సత్యం స్థాపించుటకు, దీనుడిగా ఈ లోకానికి మొదటిసారి వచ్చాడు. మనము నీతిమంతులుగా తీర్చబడుటకు అవసరమైన పరిశుద్ధ రక్తమును చిందించినవాడుగా , విధేయతను కనబరిచిన వాడుగా ఉన్నాడు.
ఈ సువార్త సత్యమును విశ్వసించిన వారి హృదయాల్లో నీతిగల తన రాజ్యమును స్థాపించాడు, రాజుగా వారి హృదయాల్లో గౌరవించబడుతూ ఆరాధించబడుతున్నారు.
నీతిగల తన రాజ్యమును విశ్వమంతటా సంపూర్ణంగా స్థాపించుటకు అతి త్వరలో ఆయన రానైయున్నాడు.
కాబట్టి సత్యము వినయము నీతి కలిగిన ఈ రాజును స్తుతిస్తూ, అవే లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండుటకు తీర్మానించుకుంటూ, నీతి గల ఆయన రాజ్యంలో పౌరసత్వము సంపాదించుకొని ముందుకు కొనసాగే వారముగా ఉందాము. అలాంటి భాగ్యము ప్రభువు మనకు దయచేయును గాక. ఆమెన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి