దేవుడు తన పని కొరకు సాధారణ వ్యక్తులను ఎన్నుకుంటాడు

 

దేవుడు తన పని కొరకు  సాధారణ వ్యక్తులను ఎన్నుకుంటాడు

దేవుడు తన పని కొరకు సాధారణ వ్యక్తులను ఎన్నుకుంటాడు

ఎక్కువ కాలం దేవుని పరిచర్యలో కొనసాగిన ఏ వ్యక్తి అయినా తాను చేస్తున్న ఆ పరిచర్యకు అర్హుడును కాను అని భావిస్తాడు. పాప స్వభావము కలిగి, పాపము చేయగలవాడైన మానవుని దేవుడు ఎన్నుకొని  తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం ఎంతో గొప్ప విషయమై యున్నది. 

పరిచయం :

దేవుడు ఎన్నిక చేసే విధానము సాధారణంగానూ వింత గొలుపేదిగాను ఉంటుంది. వాక్యాన్వేషకులు అందరికీ శుభములు తెలియజేస్తూ రెఫీదీము స్వరమనే ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. 

అందరూ బాగున్నారా, గడిచిన భాగాల్లో ఆదికాండం మొదటి 11 అధ్యాయాలను ధ్యానం చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను గురించి, ఆయన ఒక గొప్ప కుటుంబమును కోరుకుంటున్న విధానం గురించి తెలుసుకున్నాము కదా! . ఈ భాగంలో దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చుకొనడానికి దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటారో ఆదికాండం 12-50 అధ్యాయాలు ద్వారా తెలుసుకుందాం.

ఈ లోకంలో దేవుని కొరకు కొన్ని అసాధారణమైన కార్యాలు జరిగించిన వారిని చూసినప్పుడు వారు అసాధారణమైన వ్యక్తులు అని మనం భావిస్తాం. కానీ వాస్తవం ఏంటంటే  వారు ఆ పని కొరకు ఎన్నుకొనబడ్డప్పుడు వారు సాధారణమైన వ్యక్తులే, ఇంకా చెప్పాలంటే బలహీనులే అని చెప్పవచ్చు.

ఈ లోకం ఒక వ్యక్తిని ఒక పని కొరకు ఎన్నుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క అర్హతను చూస్తుంది. కానీ దేవుని ఎన్నిక ఆ వ్యక్తికి అర్హతనిస్తుంది, ఇంకో రకంగా చెప్పాలంటే  ఆయన ఎన్నుకునేది అర్హత లేనివారినే అని కొన్నిసార్లు అనిపిస్తుంది.

ఎక్కువ కాలం దేవుని పరిచర్యలో కొనసాగిన ఏ వ్యక్తి అయినా తాను చేస్తున్న ఆ పరిచర్యకు అర్హుడును కాను అని భావిస్తాడు. పాప స్వభావము కలిగి, పాపము చేయగలవాడైన మానవుని దేవుడు ఎన్నుకొని  తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడం ఎంతో గొప్ప విషయమై యున్నది. 

షేము సంతానములో తెరహును, తెరహుకున్న ముగ్గురు కుమారులలో అబ్రామును (ఈయన పేరును దేవుడు తర్వాత అబ్రహాము అని మార్చాడు) ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తులందరూ సాధారణమైన వారే అనే విషయాన్ని మనం గ్రహించాలి. 

దేవుడు తన కొరకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తులందరూ సాధారణమైన వారే, అంతేకాదు వారందరూ బలహీనులు అని కూడా మనం గమనించవచ్చు. 

దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు ఆయనకు పిల్లలు లేరు, ఒక గొప్ప కుటుంబాన్ని కలిగి ఉండాలని అనుకున్న దేవుడు, తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి  ఇప్పటికే ఒక డజన్ మంది పిల్లలు కలిగిన కుటుంబాన్ని ఎన్నుకుంటే బాగుండేది కదా అనేది మానవుని ఆలోచన. 

అబ్రహాములాంటి కుటుంబాన్ని ఎన్నుకోవడం బుద్ధిహీనమని కొంతమందికి అనిపించవచ్చు. కానీ దేవుని ఎన్నికల్లో ఉన్న గొప్పతనము అదే అనే విషయాన్ని మనము గమనించాలి. 

అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యూదా ఇలా దేవుడు కుటుంబంలో కొంతమంది వ్యక్తులను ఎన్నుకొని తన ప్రణాళికను నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు.

 నీవు బలహీనుడవైనప్పటికీ, పాపివైనప్పటికీ, దేవుడు నిన్ను తన కుటుంబంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన పని చేయుటకు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు.

నీ అర్హతలు బలహీనతలు వైపు చూసుకొని వెనకడుగు వేయక, నిన్ను పిలిచిన వాడు సర్వజ్ఞుడు మరియు సర్వశక్తివంతుడని నమ్మి ఆయన ఎన్నికకు అడ్డు చెప్పక లోబడి నీ ద్వారా ఆయన సాధించాలనుకున్న కార్యములు జరిగించుటకు సిద్ధపడటం ఉత్తమమైన విషయం. 

నీవు దాన్ని తిరస్కరిస్తే ఆ పని చేయడానికి దేవునికి చాలామంది ఉన్నారు, కానీ నీకు దొరికిన అవకాశాన్ని నీవు పోగొట్టుకుంటావు. జ్ఞానవంతులు మంచి నిర్ణయాన్ని చేస్తారు, మంచి నిర్ణయం తీసుకునే విధంగా ప్రభువు నిన్ను నడిపించును గాక, ఆమెన్. 

ముగింపు : 

నిజమే, మనకు అర్హత లేకపోయినా ఆయన ఎన్నికే మనలను అర్హులుగా చేస్తుంది. దేవుడు మనలను ఎన్నుకున్న పనులకు మనలను మనం అప్పగించుకొని, ఆయన ప్రణాళికలు నెరవేర్చుటకు ముందుకు కొనసాగుదాం. ప్రభువు చిత్తమైతే మరోక అంశముతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ప్రభువు కృప మనకు తోడై యుండును గాక ఆమెన్.

Post a Comment